బీజేపీలోకి చీకోటి ప్రవీణ్‌.. డీకె అరుణ సమక్షంలో చేరిక

బీజేపీలోకి చీకోటి ప్రవీణ్‌.. డీకె అరుణ సమక్షంలో చేరిక
  • అమిత్‌ షా చొరవతో లైన్‌ క్లియర్‌

విధాత : క్యాసినో కింగ్‌ చీకోటి ప్రవీణ్‌ ఎట్టకేలకు బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ సమక్షంలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. కిషన్‌రెడ్డికి చీకోటి ప్రవీణ్‌ చేరడం ఇష్టం లేకపోవడంతో ఆయన చేరిక వాయిదా పడుతూ వచ్చింది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వయంగా జోక్యం చేసుకుని చీకోటి ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకోవాల్సిందిగా సూచించడంతో కాదనలేని పరిస్థితి రాష్ట్ర నాయకత్వానికి ఎదురైంది.


చీకోటి చేరికపై కిషన్‌రెడ్డి అయిష్టంగా ఉన్న నేపధ్యంలో డీకె అరుణ సమక్షంలో చీకోటికి కాషయ కండువాలు కప్పేసి కమల దళంలోకి ఆహ్వానించే తంతూ పూర్తి చేశారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రభృతులు చీకోటికి అభినందనలు తెలిపారు. అమిత్‌ షా సామాజిక వర్గంకు చెందిన చీకోటి ప్రవీణ్‌ భవిష్యత్తులో బీజేపీలో క్రియాశీలకంగా ఎదిగే అవకాశముందని భావిస్తున్నారు.


సీఎం కుర్చీ కోసమే వారి హడావుడి: డీకే అరుణ

సీఎం పదవీ కోసం బావబామ్మర్ధులు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు పోటీ పడుతూ కేసీఆర్‌ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నేనే సీఎం కావాలని కేటీఆర్‌ ఆరాటపడకుండా కేసీఆర్‌ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని హితవు పలికారు. బావ బామ్మర్ధులు ఎన్నికల వస్తున్నాయని హడావుడి చేస్తున్నారన్నారన్నారు.


కేసీఆర్‌ ఆరోగ్యం ఎలా ఉంటే నాకేంటి నేను సీఎం కావాలనే ప్లాన్‌లో హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఉన్నారన్నారు. బీఆరెస్‌ సభల్లో మళ్లీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని, బీసీ బంధు, గృహలక్ష్మి తదితర పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళిత బంధులో 30శాతం కమిషన్‌ను ఎమ్మెల్యేలు, బీఆరెస్‌ నాయకులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆరెస్‌ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు వేసినా ప్రజలు ఈ సారి వారి మాటలను నమ్మబోరన్నారు.