ఆగం కావద్దు.. ఆలోచించండి.. తిమ్మిని బమ్మిని చేస్తరు జాగ్రత్త: కేసీఆర్

తెలంగాణ రాక ముందు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించింది. నాక‌న్న దొడ్డుగా, ఎత్తుగా ఉన్న‌వారు ముఖ్య‌మంత్రులు అయ్యారు. పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడితే స‌రిపోదు. క‌నీసం మంచినీళ్లు ఎందుకు ఇవ్వ‌లేదు

ఆగం కావద్దు.. ఆలోచించండి..  తిమ్మిని బమ్మిని చేస్తరు జాగ్రత్త: కేసీఆర్
  • గిరిజనబంధు అమలు చేస్తం
  • పార్టీల గత చరిత్ర చూడాలి
  • అమెరికా వాల్లను నమ్ముకుంటే కష్టం
  • సిటీకొట్టే వారిపై కెసిఆర్ సీరియస్
  • ఈ ప్రాంత పోరాట స్ఫూర్తిని చాటాలి
  • పాలకుర్తి ఎన్నికల సభలో సీఎం కేసీఆర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి:

’నేను కొట్లాడి ప్రాణం అడ్డంపెట్టి తెలంగాణ తెచ్చిన కాబట్టి, మీ బతుకులు చెడిపోవద్దని చెబుతున్నా… మీరు మల్లా ఆగం కాకూడదని చెబుతున్నా. ఈ హక్కులు చాలా సామాన్యంగా రావు. ఏ ప్రభుత్వం ఇయ్యదు. 50 యేండ్ల కాంగ్రెస్ ఉన్నా మీకియ్యలే. వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు‘ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొర్రూరులో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ రైతులు బలపడాలని తాము అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ఇక్కడ నీళ్ళకు టాక్సిలేదు. కరెంట్ ఫ్రీ, రైతు బంధు, రైతు భీమా ఇవన్నీ తీసెస్తమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఆరోపించారు. ఆ మాటలు నమ్మి ఆగమాగమైతే కెసిఆర్ కూడా ఏం చేయలేరు. కాంగ్రెస్ వాళ్ళు బాజాప్తా చెబుతున్నారు అందుకే ఆవేశం కాదు. ఆలోచన చేయాలంటూ వివరించారు.

తిమ్మిని బమ్మిని చేస్తరు జాగ్రత్త

దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా పరిణతి రాలేదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే తిమ్మిని బమ్మిని చేయడం, మాటలు చెప్పడం జరుగుతోందన్నారు. ఎన్నికలు చాలా సార్లు వచ్చాయి. చాలా మందిని గెలిపించారు. పార్టీకొకరు నిలబడుతరు. ఎమ్మెల్యేను ఎన్నుకున్న తర్వాత వచ్చే ప్రభుత్వం ఏర్పడుతదని చెప్పారు. మంచిదైతే మంచిగుంటది. లేకుంటే వచ్చే ఐదేండ్లు కిందిమీదికైతది. అందుకే విషయాలను పది మందిలో చర్చ చేయాలి. ఓటు మీ ఆయుధం, మీ తలరాత మారుస్తది. ఎవరికి వేయాలో వారికి వేయకపోతే శిక్ష అనుభవించాల్సి వస్తదంటూ హెచ్చరించారు. ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తది. డబ్బులిచ్చారని, సీసాలిచ్చారని ప్రలోభాలకులోనై ఓటేయ్యకూడదు. ఆలోచించి ఓటేస్తే ప్రజలు, ప్రజాస్వామ్యంగెలుస్తదన్నారు.

పార్టీ గత చరిత్ర చూడాలి

అభ్యర్ధులతో పాటు వారి వెనుక ఉన్న పార్టీల చరిత్ర చూడాలని కెసిఆర్ అన్నారు. బీఆర్ఎస్ చరిత్ర మీ ముందున్నది. కాంగ్రెస్, బీజేపీల గురించి మీకు తెలుసు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏం చేసిందనే లెక్కలు తీయాలన్నారు. పదేండ్ల నుంచి బీఆర్ఎస్ ఉంది. పాలకుర్తి అప్పుడు ఎట్ల ఉండే..ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించాలని కోరారు. పాలకుర్తికే వేరే రాష్ట్రం నుంచి వచ్చి నాట్లేస్తున్నారు. మాకంటే 50యేండ్ల ముందున్న కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలి. దేవాదుల కంప్లీట్ చేసి, కాళేశ్వరం పూర్తి చేస్తే లక్షా 30వేల ఎకరాల సాగువుతోందన్నారు.

రైతు బంధు వద్దంటున్నారు

రైతు బంధుతో ప్రజల సొమ్ము దుబారా అవుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని చెప్పారు. రైతు బంధు తెచ్చిన పార్టీ బీఆర్ఎస్, ఇపుడు 10వేలు ఇస్తున్నాం, దయాకర్ రావు గెలిస్తే రాబోయే కాలంలో రూ.16వేలిస్తామని హామీ ఇచ్చారు. రైతు బంధు ఉండాలా? వద్దా అంటూ కెసిఆర్ ప్రశ్నించారు.

మూడు గంటల కరెంట్ చాలట

రైతుల కోసం తాము కష్టపడి 24 గంటల కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తుండు, మూడుగంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని కెసిఆర్ విమర్శించారు. 10 హెచ్ పి మోటార్లు పెట్టాలంటున్నాడని, వ్యవసాయానికి 10 హెచ్ పి మోటార్లు వాడుతారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30వేల కనెక్షన్లకు 10 హెచ్ పి మోటార్లు ఎవరు కొనిస్తారు. వీని అయ్య కొనిస్తరా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉండాలా? వద్దా? అంటూ ప్రశ్నించారు. 24గంటల కరెంట్ కావాలంటే దయాకర్ రావును గెలిపించాలన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు. మాములు విషయం కాదు జిమ్మేదారి మనిషి అంటున్నారు. ఆరు చందమామలు, ఏడు సూర్యులను తెస్తమంటూ మంది మాటలువిని మార్మానంపోతే మళ్లొచ్చేసరికి ఇల్లు మాయమైందట అంటూ చెప్పారు.

ధరణి తొలగిస్తే మళ్లీ దళారులే

ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటూ ఆ పార్టీ నేత రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి అంటున్నారని కెసిఆర్ విమర్శించారు. రైతుల కోసం ధరణి తెచ్చాం…రైతుల భూములపై రైతులకే హక్కుండేందుకు ధరణి తీసుకొచ్చామన్నారు. ధరని తొలగిస్తే మళ్ళీ వీఆర్వోలు, గిరిదావర్లు, తహసిల్లాదర్ల దగ్గరకు పోవాల్సి ఉంటుందని వారు డబ్బులు గుంజుతారని విమర్శించారు. ధరణి తేవడం వల్ల రైతు బంధు, రైతు భీమా, ధాన్యం కొన్న డబ్బులు సరాసరి మీ అక్కౌంట్లో వేస్తున్నామని వివరించారు. కడుపుల చల్ల కదులకుండా మీ డబ్బులు మీకొస్తున్నాయన్నారు. ధరణి తొలగిస్తే దళారీలపాలవుతోందని వైకుంటపాలీలో పెద్ద పాము మింగినట్లైతదని హెచ్చరించారు.

గిరిజనబంధు అమలు చేస్తం

దళిత బంధు ఎట్లైతే ఇస్తున్నమో? గిరిజన బంధు ఇస్తమని కెసిఆర్ హామీ ఇచ్చారు. భూమిలేకుండా ఉంటే, ఉద్యోగం లేకుండా ఉంటే, ఆసరా లేకుండా ఉంటే వాళ్ళకుకూడా గిరిజన బంధు ఇస్తాం. తెలంగాణ రాకముందు చాలా మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులున్నారని, కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఈప్రాంతానికి మంచినీళ్ళిచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. లంబాడి బిడ్డలు మా తండాలకు మా రాజ్యమంటే ఇచ్చరా? మేమిచ్చాం. రిజర్వేషన్ 10శాతం పెంచామన్నారు. 70 యేండ్లలో ఎవరైనా దళితబంధు గురించి ఆలోచించారా? అంటూ ప్రశ్నించారు. దళితబంధు గుర్తించిందే కెసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అంటూ వివరించారు. పాలకుర్తికి ఇంజనీరింగ్ కాలేజీ ఇస్తాం, గ్రామానికి 150 ఇండ్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే చెక్ డ్యామ్ ల నిర్మాణం వల్ల దయాకర్ రావుకు చెక్ డ్యామ్ రావని పేరుపెట్టామన్నారు. దీంతో భూ గర్జజలాలు పెరిగాయి. అందుకే మీ బతుకుల విషయంలో ఆలోచించాలన్నారు. పోరాటాల గడ్డ, దైవభక్తి ఉన్న గడ్డ పోతన జన్మించిన గడ్డ, దొడ్డికొమురయ్య, బందగి చాకలి ఐలమ్మ పోరాటానికి వారసులని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఈ కాంగ్రెస్ కాదా? దీనితో మంచినీళ్ళకు, సాగునీళ్ళకు సకల తిప్పలు పడ్డం, ఇవన్ని పొగొట్టుకోవద్దని హితవు పలికారు. అమెరికా నుంచి విమానంలో వచ్చి ఐదు రోజులు మురిపించటోళ్ళు, రేపు మనకు కిరిటం పెడుతరా? టోపి పెట్టి మళ్ళీ విమానమెక్కుతరంటూ కాంగ్రెస్ అభ్యర్ధిని విమర్శించారు. మీ కోసం తండ్లాడే వ్యక్తి దయాకర్ రావు ఆయనను గెలిపించాలని కోరారు. ఈ సభలో అభ్యర్ధి దయాకర్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. సీఎం సహకారంతో పాలకుర్తి రుణం తీర్చుకున్నానని చెప్పారు. ఇంకా మిగిలిన సమస్యలను గెలిచిన తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లక్ష మెజారిటితో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు.