తెలంగాణను 58 ఏళ్లు ఏడిపించిన పార్టీ కాంగ్రెస్‌: సీఎం కేసీఆర్

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు.

తెలంగాణను 58 ఏళ్లు ఏడిపించిన పార్టీ కాంగ్రెస్‌: సీఎం కేసీఆర్

విధాత‌: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. ‘ఈ సభ జరుగుతున్న ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2011, మే 17న మొట్టమొదటి సింహగర్జణ సభ ఈ కాలేజీ వేదికగానే జరిగింది. తెలంగాణ రాష్ట్రం తీసుకరాకపోయినా, ఉద్యమాన్ని విరమించినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని నాడు జరిగిన సభలో నేను చెప్పిన. ఆ సభకు ఎవరూ ఊహించనంత మంది వచ్చి జయప్రదం చేశారు. గంగుల కమాలకర్‌ చెప్పినట్లు దళితబంధు, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక మంచి కార్యక్రమాలను కరీంనగర్‌ వేదిక నుంచే ప్రారంభించుకున్నాం. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, వ్యక్తిగతంగా నాకు అనేక విజయాలను అందించిన ఈ కరీంనగర్‌ మట్టి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నా’.


‘కాంగ్రెస్‌ పార్టీ దోకాబాజ్‌ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి మనలను 58 ఏళ్లు ఏడిపించిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. 1969లో ఉద్యమం చేస్తే 400 మందిని కాల్చిచంపిన పార్టీ. 2004లో మనతో పొత్తుపెట్టుకుని రాష్ట్రంల, కేంద్రంల అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆర్నెళ్లకో, ఏడాదికో తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్‌ నేతలు దోకా చేశారు. 13, 14 ఏండ్లు కొట్లాడితే తెలంగాణ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తర్వాత మళ్లీ వెనుకకు పోయారు. అంతేగాక టీఆర్‌ఎస్‌ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. దాంతో కేసీఆర్‌ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలని నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన. ఆ దీక్ష కూడా ఈ కరీంనగర్‌ గడ్డనే వేదికైంది. నన్ను అలుగునూ చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం జైల్లో పెట్టారు. ఇలాంటి అనేక ఉద్యమ ఘట్టాల్లో ప్రథమ స్థానంలో ఉండేది కరీంనగర్‌ మట్టి, కరీంనగర్‌ గడ్డ’


‘ఇక్కడి నుంచే ఉద్యమం మొదలైంది కాబట్టి ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పదల్చుకున్నా. ఒక దేశమైనా, రాష్ట్రమైనా బాగుందా.. లేదా..? అని చూసేందుకు రెండు కొలమానాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంకు పంతొమ్మిదో, ఇరవైయ్యో ఉండె. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన తర్వాత నా తెలంగాణ 3.18 వేల తలసరి ఆదాయంతోటి దేశంలోనే నెంబర్‌ 1గా ఉన్నది. కడుపు నోరు కట్టుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నం కాబట్టి ఇయ్యాల ఈ స్థాయికి వచ్చినం. రెండో గీటురాయి తలసరి విద్యుత్ వినియోగం. 2014లో తలసరి విద్యుత్‌ వినియోగం 1,122 యూనిట్లు ఉండె. దేశంలో మన ర్యాంకు ఎక్కడో ఉండె. ఇప్పుడు 2,040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతోటి దేశంలో మనమే నెంబర్ వ‌న్‌గా ఉన్నాం’


క‌రీంన‌గ‌ర్‌లో చైత‌న్య‌వంత‌మైన ప్ర‌జ‌లు ఉన్నారు. 75 ఏండ్ల త‌ర్వాత కూడా ప్ర‌జాస్వామ్యంలో ప‌రిణితి రాలేదు. ప్ర‌జాస్వామ్యంలో ప‌రిణితి వ‌చ్చిన‌ దేశాలు ముందుకు పోతున్నాయి. మ‌న ద‌గ్గ‌ర ఎన్నిక‌లు అన‌గానే హడావుడి, హంగామా, అభాండాలు, గాడిద, గుర్రం ఒక్క‌టై ప‌ని చేస్తాయి. గంద‌రోగోళం చేస్తారు. ఫాల్తు వాగ్దానాలు, అవి నెర‌వేర్చ‌క‌పోవ‌డం, గెల‌వ‌డానికి అనేక దుర్మార్గ‌మైన ప‌నులు, ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయి. ప్ర‌జాస్వామ్య ప‌రిణితి వ‌చ్చిన చోట ఇవి జ‌ర‌గ‌వు. అమెరికాలో మనం పెట్టిన‌ట్టు స‌భ‌లు కూడా పెట్ట‌రు. టీవీల ద్వారా మెసేజ్ ఇస్తారు. ప్ర‌భుత్వ పాల‌సీల మీద‌నే ఓటింగ్ వేస్త‌రు. అలాంటి ప‌రిణితి రాక‌పోతే దేశం ముందుకు పోదు. క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు విజ్ఞులు కాబ‌ట్టి ఆలోచించి ఓటేస్తార‌ని మ‌న‌వి చేస్తున్నాను.


ప్ర‌జాస్వామ్యంలో వ‌జ్రాయుధం ఓటు. అది జాగ్ర‌త్త‌గా వినియోగించాలి. ఈ రాష్ట్ర ప్ర‌గ‌తిని నిర్దేశిస్తుంది ఓటు. అంత శ‌క్తివంత‌మైంది. ఎటు ప‌డితే అటు వేయ‌కూడ‌దు. ప్ర‌జ‌లు గెల‌వాలి. అభ్య‌ర్థుల గురించి కూడా ఆలోచించాలి. అంత‌కంటే ముఖ్యం అభ్య‌ర్థుల వెనుకాల ఉన్న‌ పార్టీల గురించి ఆలోచించాలి. ఆ పార్టీ ప్ర‌జ‌ల గురించి ఏం ఆలోచిస్త‌ది, న‌డ‌వ‌డిక‌, ఆలోచ‌నా విధానం ఏంది..? రైతుల పేద‌ల గురించి ఆ పార్టీల దృక్ప‌థం ఏంటి..? ఏ పార్టీకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకెళ్త‌ద‌ని అని ఆలోచించాలి. ఆలోచించి మీరు నిర్ణ‌యం తీసుకుంటే మంచి నిర్ణ‌యాలు వ‌స్తాయి.


ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా అద్భుత ఫ‌లితాలు వ‌చ్చాయి. భూముల‌ పంచాయితీలు త‌గ్గాయి. మునుప‌టి లాగా పైర‌వీకారుల‌కు, ద‌ళారుల‌కు ఆస్కారం లేకుండా పోయింది. రైతుబంధు డ‌బ్బులు ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారా మీ ఖాతాలో వ‌చ్చి ప‌డుతున్నాయి. మీరు పెట్టుబ‌డికి వాడుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధ‌ర‌ణి ర‌ద్దు చేస్తామ‌ని మాట్లాడుతోంది. ధ‌ర‌ణి ర‌ద్దు చేస్తే అడ్డ‌గోలుగా లంచాలు, పైర‌వీకారులు, ద‌ళారులు. కాంగ్రెస్‌కు అధికారం వ‌స్తే ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో వేస్త‌ర‌ట‌. మ‌రి రైతుబంధు డ‌బ్బులు ఎలా వ‌స్తాయి. మ‌ళ్లా పైర‌వీకారులు, ద‌ళారులు.. మ‌ళ్లీ మొద‌టికి వ‌స్త‌ది.


వ‌డ్లు పండించ‌డంలో తెలంగాణ‌ పంజాబ్‌ను దాటిపోయి దేశంలో నంబ‌ర్ వ‌న్ అయింద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. పంట‌లు దిగుబ‌డి పెంచి, ఆదాయం పెంచి పేద‌ల‌ను ఆదుకుంటూ ముందుకు పోతుంటే కాంగ్రెస్ నాయ‌కులు అడ్డు ప‌డుతున్నారు. రైతులోకం సిరీయ‌స్‌గా ఆలోచించాలి. రాష్ట్రాన్ని ఆర్థికంగా ప‌టిష్టం చేశాం. వ్య‌వ‌సాయాన్ని ప‌టిష్టం చేశాం. రైతుల ముఖాలు వెలుగుతున్నాయి, అప్పులు తీరిపోయాయి. ద‌ళారీల బాధ త‌ప్పింది. ప‌ట్ట‌ణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. చెట్లు న‌రుడుకు త‌ప్ప గ‌తంలో చెట్లు నాటారా..? క‌రీంన‌గ‌ర్‌లో ఒక‌ప్పుడు అడ‌వి ఉండే.. మొత్తం అమ్మేసి క‌ర‌గ‌నాకేసిండ్రు. బీఆర్ఎస్ వ‌చ్చిన త‌ర్వాత చ‌ట్టం తెస్తే 7 శాతం గ్రీన్ క‌వ‌ర్ పెరిగింది. మంచి వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీన్ని మ‌ళ్లీ చెడ‌గొడుతాం. పైర‌వీకారుల‌ను తెస్తాం.. భూక్జ‌బాలు మొద‌లు పెడుతాం అని దందాతో కాంగ్రెస్ వ‌స్తుంది. ద‌య‌చేసి రైతాంగం, క‌రీనంగ‌ర్ ప్ర‌జ‌లు ఆలోచించాలి.


బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, ప్ర‌జ‌ల హ‌క్కులు కాపాడ‌టం కోసం. కాంగ్రెసోళ్లు 50 ఏండ్లు ప‌రిపాలించారు. వాళ్ల కాలంలో ఏం జ‌రిగిందో మ‌న కండ్ల ముంద‌ర‌నే ఉంది. మంచి, సాగు నీళ్లు లేవు. క‌రెంట్ లేదు. రైతులు, చేనేత‌ల ఆత్మ‌హ‌త్య‌లు, వ‌ల‌స పోవుడు వంటివి ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెండు, మూడు నెల‌లు మేధోమ‌ద‌నం చేసి ఒక ప్ర‌ణాళిక బద్దంగా ముందుకు పోతున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ప‌ట్టించుకోలేదు. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టి ఆంధ్రాలో క‌లిపారు. ప్ర‌జ‌ల‌ను పిట్ట‌ల్లా కాల్చి చంపారు. ల‌క్ష‌ల మందిని జైల్లో పెట్టారు. మ‌ళ్లీ పొత్తు పెట్టుకుని 15 ఏండ్లు ఏడిపించారు. ప్ర‌లోభాలు పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. మ‌నం మొండిగా ఉన్నాం కాబ‌ట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఎవ‌డ‌న్నా డీలాగా ఉంటే.. అయింతా గోల్ మాల్ చేసే ప‌రిస్థితి ఉండే. ఇటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.


కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు రూ. 200 పెన్ష‌న్ ఇచ్చారు. మ‌నం రూ. 2 వేల పెన్ష‌న్ ఇస్తున్నాం. సంప‌ద పెర‌గ‌డంతో పెన్ష‌న్లు పెంచుకుంటూ పోతున్నాం. భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే మాన‌వ దృక్ప‌థంతో గుర్తించి పెన్ష‌న్ వేల రూపాయాలు చేసింది కేవలం తెలంగాణ ప్ర‌భుత్వం మాత్ర‌మే. కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు ఇక్క‌డొచ్చి డైలాగులు కొడుతున్నారు. ఇవాళ కూడా అనేక రాష్ట్రాల్లో 600, 700 పెన్ష‌న్ ఇస్తున్నారు. కంటి వెలుగు ద్వారా 80 ల‌క్ష‌ల మందికి ఉచితంగా కండ్ల‌ద్దాలు పంపిణీ చేశాం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహ‌నాల ద్వారా గ‌ర్భిణిల‌కు సేవ‌లందిస్తున్నాం. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను మెరుగుప‌రిచి, వైద్య వ‌స‌తులు బాగా పెంచి, న‌మ్మ‌కం క‌లిగించాం. దీంతో మాతా శిశు మ‌ర‌ణాలు త‌గ్గాయి. అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇటువంటి మాన‌వీయ‌కోణంలో ఉండే ప‌థ‌కాలు తీసుకున్నాం. క‌ళ్యాణ‌ల‌క్ష్మి ద్వారా పేదింటి ఆడ‌పిల్ల‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తున్నాం.


గంగుల క‌మ‌లాక‌ర్ నేతృత్వంలో క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణం ఎంతో సుంద‌రంగా త‌యారైంది. క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణం అని కాకుండా, క‌రీంన‌గ‌ర్‌ న‌ర‌గం అని పిల‌వాల‌నిపిస్తోంది. గంగుల క‌మ‌లాక‌ర్ మొండి మ‌నిషి, ప‌ట్టిన ప‌ట్టు విడ‌వ‌డు కాబ‌ట్టి వెంట‌ప‌డి ఆ మానేరు రివ‌ర్ పంట్ర్ క‌ట్టిస్తున్నాడు. క‌రీంన‌గ‌ర్‌లో చౌర‌స్తాలు, రోడ్లు, సందులు అద్భుతంగా త‌యార‌య్యాయి. అద్దంలో చూపించిన స్ప‌ష్ట‌మైన తేడా క‌న‌బ‌డుతుంది. ప్ర‌జ‌ల యెడ‌ల‌ అభిమానం ఉండి, ప‌ని చేసే ప్ర‌భుత్వం ఉంటే, అభివృద్ధి ఎలా ఉంటుందో దానికి క‌రీంన‌గ‌ర్ అభివృద్ధి నిద‌ర్శ‌నం.


ఒక‌సారి మానేరు రివ‌ర్ ఫ్రంట్ పూర్త‌యితే క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణం ప‌ర్యాట‌క ప్రాంతంగా మారే అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టికే సంద‌ర్శ‌కులు వ‌స్తున్నారు రూ. 410 కోట్ల‌తో ముమ్మురంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. మానేరు మునుపు ఎలా ఉండేనో ఆలోచించాలి. నెత్తి మీద డ్యాం ఉన్న క‌రీంన‌గ‌ర్‌కు నీళ్లు రాని ప‌రిస్థితి. ఇవాళ ప్ర‌తి రోజులు నీళ్లు వ‌స్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ‌లో 24 గంట‌ల పాటు న‌ల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే వ‌చ్చేట‌ట్టు ఆ దిశ‌గా ప‌నులు జ‌రుగుతున్నాయి. ఒక రూపాయికి న‌ల్లా క‌నెక్ష‌న్ ఎవడైనా ఇచ్చిండా..? ఇవాళ ఒక‌టే రూపాయికి న‌ల్లా క‌నెక్ష‌న్ ఇవ్వ‌డంతో, మ‌హిళ‌లు బిందెలు ప‌ట్టుకుని బ‌జారుకు రావ‌డం లేదు. ఇవాళ బ్ర‌హ్మాండంగా నీళ్లు వ‌స్తున్నాయి. ఇది అభివృద్ధి కాదా..? ఇవ‌న్నీ ఆలోచించాలి. ప్ర‌జ‌ల జీవితాల్లో గుణాత్మ‌క‌మైన మార్పు తీసుకురావ‌డానికి ఇవి తొలి అడుగులు.


రాబోయే రోజుల్లో ఇంకా మంచి జ‌రుగుత‌ది. ఎవ‌డు ఏది అన్నా.. ఎవ‌డు ఏడ్సినా.. డెఫినెట్‌గా బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంటే వ‌స్త‌ది. ఇప్ప‌టికే సగం తెలంగాణ తిరిగాను. అద్భుతంగా ఉంది. మ‌న‌కు ఏం డౌట్ అవ‌స‌రం లేదు. ప్ర‌తిప‌క్షాల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌నం ప్ర‌జ‌ల‌తో ఉన్నాం.. ప్ర‌జ‌లు మ‌న‌తో ఉన్నారు.. 30న త‌మాషా చూపెడుతారు.. దానికి పైసా మందం కూడా రందీ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతుంది.


బీజేపీకి మ‌త‌పిచ్చి త‌ప్ప ఇంకోటి రాదు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ దేశానికి 157 మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చిండు. ఒక్క కాలేజీ కూడా తెలంగాణ‌కు నోచుకోలేదు. 100 ఉత్త‌రారాలు రాశాను. ఈ దేశాన్ని సాదే రాష్ట్రంలో మేం ఒక‌ళ్లం. ప‌న్నులు క‌డుతున్నాం. ఎందుకివ్వ‌లేదు అని ప్ర‌శ్నించాను. క‌నీసం ఒక్క‌టి ఇవ్వ‌లేదు. మ‌ర్యాద‌కైనా ఒక్క‌టి ఇవ్వ‌లేదు. ఆయ‌న ఇవ్వ‌లేద‌ని నారాజ్ కాలేదు. మ‌నం స‌న్నాసి కాదు కాదా..? ఆయ‌న ముఖం మీ కొట్టిన‌ట్టు మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేసుకున్నాం. కాంగ్రెస్ హ‌యాంలో పాత క‌రీంన‌గ‌ర్‌లో ఒక్క మెడిక‌ల్ కాలేజీ లేకుండా, బీఆర్ఎస్ గ‌వ‌ర్న‌మెంట్ వ‌చ్చిన త‌ర్వాత‌ 4 మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. ఇది మీ కండ్ల ముందున్న స‌త్యం. 50 ఏండ్ల కాంగ్రెస్ జ‌మానాలో ఒక్క మెడిక‌ల్ కాలేజీ రాలేదు. మోదీ ఇవ్వ‌లేదు. ప్ర‌తి జిల్లాకో మెడిక‌ల్ కాలేజీ పెట్టుకుంటున్నాం. ప్ర‌తి ఏడాది 10 వేల మంది డాక్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యానికి తెలంగాణ చేరింది.


ఇంకోటి అయితే దారుణం.. పార్ల‌మెంట్‌లో పాస్ చేసిన చ‌ట్టం ఉంది. జిల్లాకో న‌వోదయ‌ పాఠ‌శాల పెట్టాల‌ని చ‌ట్టంలో ఉంటే, దాన్ని మోదీ ఉల్లంఘించారు. వంద‌ల సార్లు అడిగినా కూడా న‌వోద‌య పాఠ‌శాల‌లు ఇవ్వ‌లేదు. మెడిక‌ల్ కాలేజీ, న‌వోద‌య పాఠ‌శాల‌ ఇవ్వ‌ని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి. ద‌య‌చేసి ఆలోచించాలి. క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు ఇది వ‌ర‌కే గోల్ మాల్ అయి ఓట్లేశారు. ఐదేండ్ల నుంచి బాధ ప‌డుతున్నారు. వినోద్ ఎంపీగా ఉన్న‌ప్పుడు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉంది..? వాళ్ల సంస్కారం, మాట‌లు, ప‌ద్ద‌తి ఏంది..? ఎంపీ వినోద్ ఉన్న‌ప్పుడు క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణాన్ని స్మార్ట్ సిటీలో పెట్టించారు. ఇప్పుడు స్మార్ట్ లేదు.. నా బోట్ లేదు.. వ‌ట్టిదే బొబ్బ‌.. మ‌సీదులు త‌వ్వుదామా.. గుళ్లు త‌వ్వుదామా.. మ‌సీదులు త‌వ్వేతోడు సిపాయా ఈ దేశంలో. మ‌సీదులు త‌వ్వ‌డం సంస్కారం ఉన్నోడు చేసే ప‌నేనా..?.


హిందూ మ‌తం పేరుతో కొట్లాట‌లు, పంచాయితీ.. ఇదా దేశానికి కావాల్సింది. దేశానికి ఏం కావాలా..? పేద‌రికంతో ద‌ళితులు, గిరిజ‌నులు, బీసీల్లోని కొన్ని కులాలు బాధ‌ప‌డుతున్నారు. వారికి కావాలి ప‌ని. మ‌తం, పంచాయితీ, కొట్లాట, తాకులాట‌లు పెట్ట‌డం రాజ‌కీయం అంటారా..? అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కులం, మ‌తం అనే తేడా లేకుండా క‌లిసి బ‌త‌కాలి. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి మ‌నిషి మ‌నోడు. అందుకే ప్ర‌గ‌తిశీల ప‌ద్ధ‌తుల్లో రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో తీసుకుపోతున్న‌ది ఎవ‌రు..? ఈ రాష్ట్ర విచ్చిత్తికి ప్ర‌జానీకాన్ని డివైడ్ చేసి స్వార్థ రాజ‌కీయం కోసం పాకులాడుతున్న‌ది ఎవ‌రో గ‌మ‌నించాలి. క‌రీంన‌గ‌ర్‌లో ఈ సారి క‌ర్రు కాల్చి వాత పెట్టాల‌ని అప్పీల్ చేస్తున్నాం. ఇంత చైత‌న్యం ఉన్న ప్రాంతం.. ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన‌ క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు బీజేపీకి బుద్ధి చెప్పాలి. లేదంటే పిచ్చోళ్లు మాకే ఓట్లేస్త‌రు అని అనుకుంటారు, అల‌స‌త్వం వ‌స్త‌ది.