ఎల్లారెడ్డి, కామారెడ్డిలను గర్వపడేలా అభివృద్ధి చేస్తా : సీఎం కేసీఆర్
ఎల్లారెడ్డి, కామారెడ్డిలను గర్వపడేలా అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

విధాత: ఎల్లారెడ్డి, కామారెడ్డిలను గర్వపడేలా అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణితి ఇంకా రాలేదు. ఏయే దేశాల్లో అయితే వచ్చిందో బ్రహ్మాండంగా దూసుకుపోతున్నయి. ఎలక్షన్లు చాలా వచ్చాయి.. పోయాయి. ఇది మామూలుగా జరిగే విషయమే. ఇంత కాకుండా రెండు విషయాలపై మీరు గట్టిగా నిర్ణయిస్తే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థి గుణం, గణం మంచీచెడు, వ్యక్తిత్వంపై ఆలోచన చేయాల్సిందే. అంతకంటే ముఖ్యంగా పార్టీలు ముఖ్యం. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది’ .
‘మీ దగ్గర ఉండే బ్రహ్మాండమైన ఒకే ఒక ఆయుధం. వజ్రాయుధంలాంటిది మీ ఓటు. ఆ ఓటు ఆషామాషీగా వేయడం కాకుండా గ్రామం, పెద్దలంతా కూర్చొని విచారించి రాయిందో రత్నమేందో గుర్తుపట్టి ఓటు వేసిన నాడు ప్రజలు గెలువడం ప్రారంభమవుతుంది. ప్రజలు గెలిచినప్పుడు నిజమైన ప్రజాస్వామిక పరిణితి అవుతుంది. మంచి ఫలితాలు వస్తయ్. దేశం బాగుపడుతుంది. గెలిచిన ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంటయ్. నేను చెప్పిన నాలుగు మాటలను చర్చించాలి. నిజానిజాలు గుర్తించి ముందడుగు వేస్తే మంచి భవిష్యత్‌కు పునాది పడుతుంది.
‘బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ప్రజలకు అన్నిరకాల మేలు జరగడం కోసం. గులాబీ జెండా పుట్టిందే మీ కనుసన్నల్లోనే. గులాబీ జెండా పుట్టిన నాడు నా తమ్ముడు విఠల్‌రెడ్డి బ్రహ్మాండమైన పద్యం రాసిండు. ఆ పాట తెలంగాణ అంతా మార్మోగింది. పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నది. పార్టీల గురించి ఆలోచించాలన్నప్పుడు ఆ పార్టీల వైఖరి ఏంది ? ప్రజల గురించి ఏం ఆలోచిస్తరు ? రైతాంగం గురించి విధానం ఏముంది? మైనారిటీల గురించి ఏం ఆలోచిస్తరు ? సమాజాన్ని ఐకమత్యంగా ఎలా తీసుకుపోతురు? అనే విషయాలపై దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే.. న్యాయం జరుగుతుంది. బీఆర్‌ఎస్ చరిత్ర మీ కండ్ల ముందే ఉన్నది. తెలంగాణ వచ్చిన నాడు మంచినీరు లేదు. సాగునీరు లేదు. కరెంటు లేదు. చాలా భయంకరమైన పరిస్థితి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆకలిచావులు. బతుకలేక వలసపోయే పరిస్థితి ఉండేది’ .
‘బీఆర్‌రెడ్డి అనే ఆర్థికవేత్త బిహార్‌లో ఆయనను రప్పించుకొని.. అందరినీ కలుపుకొని మూడునాలుగు నెలలు కష్టపడ్డాం. మొదట సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇచ్చాం. పేదలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ గ్రామాలు పచ్చగా ఉండాలి.. కళకళలాడాలి.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో పటిష్టమైన వ్యవసాయ స్థిరీకరణ కోసం ప్రణాళిక తయారు చేసుకున్నాం.
మిషన్ కాకతీయ తీసుకువచ్చాం. సదాశివ్‌నగర్ చెరువులో నేను కూడా తట్టమోసిన. ఐటీరంగం, పారిశ్రామికరంగం ముందుకు తీసుకెళ్లాలని దానికి ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాం. పంటలు పెరిగాయ్, పారిశ్రమలు పెరిగాయి. పెట్టుబడులు వస్తున్నయ్. ఐటీరంగం విస్తరించింది. ఐటీ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం’.
‘రాష్ట్రం వచ్చిన ఏడాదిన్నర లోపే 24గంటల కరెంటును అన్నిరంగాలకు ఇస్తున్నాం. దాని తర్వాత మంచినీళ్ల బాధను పోగొట్టుకున్నాం. అంతకుముందు ఎండకాలం వచ్చిందంటే సర్పంచులకు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు బిందెల ప్రదర్శన కనిపించేది. మారుమూల తండా, గూడేల్లోని ఇంటింకి నల్లా పెట్టి నీరిస్తున్నాం. ఆ తర్వాత సాగునీటి కోసం ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి వెనుబడి ఉన్నది. అందుకే నేను కామారెడ్డికి వచ్చిన. కామారెడ్డిలో పోటీ చేస్తున్నంటే ఎల్లారెడ్డి వేరే కాదు.
రెండింటికి కలిపి ఎమ్మెల్యేగా ఉన్నట్టే లెక్క. సురేందర్ నాకు తమ్ముడు లాంటోడు. కుటుంబ సభ్యుడిలాంటోడు. నాకు దగ్గరి వ్యక్తి. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కష్టపడి చేసిన వ్యక్తి. ఎల్లారెడ్డిలో సురేందర్ ఎమ్మెల్యేగా ఉన్నా నేనే పని చేస్తా. ఇక్కడ అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి చూడబోతున్నరు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు ప్రతి విషయంలో తెలంగాణలోనే నెంబర్ వన్‌గా అయ్యింది ఎల్లారెడ్డి, మా కామారెడ్డి అని గర్వపడేలా చేస్తా’.
ఉద్యమ సమయంలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదు. ఉద్యమంలో మనతో కలిసి రాలేదు. అసెంబ్లీలో రూపాయి కూడా ఇవ్వను అని కిరణ్ కుమార్ రెడ్డి అంటే రోషంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కడు కూడా రాజీనామా చేయలేదు. వారు నోరు మూసుకున్నారు కాబట్టే 58 ఏండ్లు తెలంగాణ నాశనం కావాల్సి వచ్చింది. మళ్లీ ఇవాళ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఆషామాషీగా ఓటు వేయొద్దు.
ధరణి, రైతుబంధు ఎత్తేస్తాం.. 24 గంటల కరెంట్‌కు బదులు 3 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ మూడు ఎత్తేస్తే రైతాంగం తీవ్రంగా నష్టపోతారు. ఈ మూడింటింతో రైతుల ముఖం తెల్లవడుతుంది. గ్రామాలకు వాపస్ వ చ్చి వ్యవసాయం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా గ్రామాలకు వస్తున్నారు. అంతకు ముందు 20 ఎకరాలు భూమి ఉన్నోడికి పిల్లను ఇవ్వలేదు. చప్రాసీ నౌకరి ఉన్నోడికి పిల్లను ఇచ్చారు.
ఇవాళ అడుగుతున్నారు.. భూమి ఉంటే పిల్లను ఇస్తున్నారు. ఇప్పుడు అలా భూమి విలువ పెరిగింది. ఎక్కడికి పోయినా ఆదిలాబాద్ బోర్డర్‌లో కూడా ఎకరా భూమి ధర 25 లక్షలు ఉంది. ఐదు ఎకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడు అయిపోతుండు. ఎల్లారెడ్డిలో మూడు ఎకరాలు ఉంటే కోటీశ్వరుడు అయితుండు అని సురేందర్ చెబుతున్నాడు. వ్యవసాయ స్థీరికరణ జరిగి రైతులు కుదుటపడ్డారు. ఒక ఐదు, పదేండ్లు ఇవన్నీ అమలవుతే బాధ లేకుండా పోతది. మొండిపట్టుగా ఇవన్నీ చేశాను. రైతుల బాధలు నాకు తెలుసు.
24 గంటల కరెంట్ బంద్ చేస్తాం.. 3 గంటల కరెంట్ ఇస్తాం. కాబట్టి 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. రైతుల వద్ద 10 హెచ్‌పీ మోటార్ ఉంటదా..? 3 హెచ్‌పీ, లేదంటే 5 హెచ్‌పీ పెట్టుకుంటాం. నీళ్లు బాగా ఉంటే 5 హెచ్‌పీ పెట్టుకుంటాం. ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి తెలంగాణలో. 30 లక్షల 10 హెచ్‌పీ మోటార్లు కొనాలంటే ఎవడు కొనివ్వాలి. అందుకు రూ. 30 వేల కోట్లు కావాలి. అంత డబ్బు ఎవడు ఇవ్వాలి నాకు అర్థం కాదు.
ధరణి, రైతుబంధును బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి ఎవర్ని బంగాళాఖాతంలో వేయాలో ప్రజలు నిర్ణయించాలి. తెలంగాణ ప్రజలు క్షేమంగా ఉండాలంటే పార్టీల నడవడిక, చరిత్ర గురించి ఆలోచించి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతాంగం నష్టపోతారు. కాబట్టి రైతులు నిర్ణయం తీసుకోవాలి. అనాలోచితంగా ఓటు వేయొద్దు. ఈ విషయాలపై చర్చ చేయండి. ఎల్లారెడ్డి, కామారెడ్డికి రెండేండ్లలో బ్రహ్మాండంగా ఒక ఎకరం కూడా మిగలకుండా పారించే బాధ్యత నాది.