మీటర్లు పెట్టాలని మోదీ బెదిరించాడు: సీఎం కేసీఆర్
బావుల కాడ మీటర్లు పెట్టాలని మోదీ బెదిరించాడు. చచ్చినా పెట్టను అని చెప్పాను. మీటర్లు పెట్టాలి.. బిల్లులు వసూళ్లు చేయాలన్నాడు.

బావుల కాడ మీటర్లు పెట్టాలని మోదీ బెదిరించాడు. చచ్చినా పెట్టను అని చెప్పాను. మీటర్లు పెట్టాలి.. బిల్లులు వసూళ్లు చేయాలన్నాడు. పెట్టను అని చెప్పాను. సంవత్సరానికి రూ. 5 వేల కోట్లు బడ్జెట్ కట్ చేస్తా అని అంటే కట్ చేసుకో అని మోదీకి చెప్పాను. ఐదేండ్లకు రూ. 25 వేల కోట్లు మనకు వచ్చేవి కట్ చేసిండు మోదీ.
అయినా కూడా నేను కాంప్రమైజ్ కాలేదు.. మీటర్లు పెట్టలేదు. 24 గంటల కరెంట్ ఆపలేదు. రేపు బీజేపోడు వచ్చి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగతడు. ఎందుకు వేయాలి మనం బీజేపీ ఓటు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కేంద్రం. మనం దేశంలో భాగం కాదా..? ఒక కాలేజీ అన్న మనకు ఇవ్వొద్దా..? ఇవ్వలేదు.
ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల పెట్టాలని చట్టం ఉంది. ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించాడు మోదీ. నవోదయ పాఠశాలల కోసం 100 ఉత్తరాలు రాశాను. మన ఎంపీలు పార్లమెంట్‌లో గడిబిడి చేసిండ్రు. మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. మీరు వీటిపై చర్చ చేయాలి. ఆగమాగం ఓటు వేయొద్దు. విచక్షణతో ఓటేస్తే మనకు మేలు జరుగుతది.
పెద్ద ప్రమాదం పొంచి ఉంది. పొరపాటున కాంగ్రెస్ వస్తే అప్పుడు నేను కూడా చేసేది ఏమీ ఉండదు. కాంగ్రెస్ నేతలు ఓపెన్‌గా చెప్తున్నారు.. ఏం దాచి చెప్పట్లేదు. మేం ఓపెన్‌గా చెప్పంగ కూడా ప్రజలు మాకు ఓటేశారు. మా పాలసీ ఇదే.. ఇంప్లీమెంట్ చేస్తామని చెప్తారు. అప్పుడు ఎవడేం చేయాలి. ఎంత మొత్తుకున్నా లాభం లేదు. ప్రజాస్వామ్యంలో పరిణితి పెరిగి, ఆలోచనా శక్తితో ఏది మంచిది, ఏది చెడ్డది అని ఆలోచించాలి.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి సుమారు రూ. 700 కోట్లతో రోడ్లన్నీ అభివృద్ధి చేశారు. కొన్నింటిని డబుల్ చేశారు. మంచి ఎమ్మెల్యే ఉన్న వద్ద మరింత అభివృద్ధి జరగాలని కోరుకోవడంలో తప్పు లేదు. అద్భుతమైన రీజినల్ రింగ్ రోడ్డు వస్తుంది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముఖచిత్రం మారిపోతది. కలెక్టరేట్ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాం. కోహెడలో పండ్ల మార్కెట్ మీ నియోజకవర్గంలో వస్తున్నది. లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే ఫాక్స్ కాన్ పరిశ్రమ కూడా ఇక్కడే వస్తుంది.
600 ఎకరాల భూమి తీసిపెట్టాం.. పొల్యూషన్ లేని ఇండస్ట్రీ పెట్టాలని ఎమ్మెల్యే కోరారు. మీకు గ్యారెంటీగా వస్తాయి. ఎవడు ఆపిన ఆగవు. హైదరాబాద్ పక్కనే ఉంది కాబట్టి జాగ చూపిస్తే ఆ పరిశ్రమోడు కాలు మొక్కి ఇక్కడికి వస్తడు. అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే కిషన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. దళిత బంధు ఎక్కువ మోతాదులో ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఇప్పటికే అన్ని ఆఫీసులు తెచ్చి పెట్టుకున్నాం. నియోజకవర్గానికి మంచి భవిష్యత్ ఉంది.
ఇబ్రహీంపట్నంలో చాలా వరకు భూములు రియల్ ఎస్టేట్‌కు పోయినయ్. మిగిలిన రైతాంగం నీళ్లు లేక కష్టపడుతున్నరు. ఈ విషయం నాకు తెలుసు. కరెంటు, బోర్లపైనే ఆధారపడ్డం. ఇబ్రహీంపట్నం చెరువు బాగాలేక ఎండిపోయి ఎడారిగా ఉంటే.. కిషన్‌రెడ్డి నాప్రాణం తీసి.. హైదరాబాద్‌కు వెళ్లే నల్లా నీళ్లతోనైనా ఒకసారైనా నింపాలని పట్టువట్టి మెట్రోవాటర్‌తోని చెరువు నింపించారు. ఆ తర్వాత చెరువు ఎందుకు నిండుతలేదు చెరువు.. మామూలు వర్షానికే నిండాలి. 30 కిలోమీటర్ల నుంచి వాగు వస్తుందని చూస్తే.. దానిపై అన్నీ ఇసుక ఫిల్టర్లు. అనేక ఆటంకాలు కాంగ్రెస్ రాజ్యంలో గందరగోళంగా ఉండేది’.
‘కిషన్‌రెడ్డి పట్టుపట్టి 36 కిలోమీటర్ల నదిని క్లీన్ చేయించారు. దేవుడి దయతో వర్షాలు పడుతుండడంతో నిండుకుండలా ఇబ్రహీంపట్నం చెరువు బ్రహ్మాండంగా కనిపిస్తున్నది. హెలీకాప్టర్ దిగుతుంటే కండ్లకు ఆనందం కలిగేలా చెరువు నిండా నీళ్లు కనిపిస్తున్నయ్. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు కృష్ణా నది నీళ్లే రావాలి.
మనం కృష్ణా బేసిన్‌లోనే ఉంటం. మన వాటా కూడా అలాగే ఉంటది. దాన్ని తేవాలని చెప్పి విశ్వప్రయత్నం చేసి పాలమూరు-రంగారెడ్డి పథకం పెడితే.. 196 కేసులు కాంగ్రెస్ నాయకులు. గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టు అని.. కాలికి పెడితే మెడకు పెట్టి.. మెడకు పెడితే కాలుకు పెట్టి ఆపారు. అయినా ధైర్యంతో కొన్ని పనులు చేశాం.
దేవుడి దయతో మొన్నమొన్ననే అన్ని క్లియరెన్స్‌లు వచ్చాయి. మొన్ననే ట్రిబ్యునల్ అపాయింట్ అయ్యింది. నేనుపోయి పాలమూరు ఎత్తిపోతల పథకం స్విచ్ ఆన్ చేశాను. ఒకసారి అది వస్తే ఆటోమెటిక్‌గా మునుగోడు వద్ద రిజర్వాయర్ ఏదైతే నిండుతుందో.. దాన్ని నుంచి మీకు నీరు వస్తయ్. సుమారు లక్ష ఎకరాలు పారుతుంది. దాని నుంచి దాదాపు వంద చెరువులను నింపుకొని.. ఆ చెరువుల ద్వారా పారకం చేసుకుంటాం’
‘రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. దాని కోసం ఆలోచన చేసి రైతుబంధు పథకం తీసుకువచ్చాం. ఈ పథకం ఇండియాలో లేదు. బయటి దేశాల్లో కూడా లేదు. దాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్‌ఎస్ గవర్నమెంట్. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని చూశాం. కరెంటు, నీళ్లులేక చాలాబాధలు పడ్డాం. చెరువుల ద్వారా నీరు ఇచ్చినా నీటి తీరువా లేదు.
పాత బకాయిలు రద్దు చేశాం. ఏడాదిన్నరలోనే నాణ్యమైన విద్యుత్‌ను సంపాదించి.. 24గంటలు సరఫరా చేస్తున్నాం. రైతుబంధు కింద పెట్టుబడి ఇస్తున్నాం. రైతులకు బీమా సదుపాయం సైతం వర్తింపజేస్తున్నాం. దాదాపు లక్ష కుటుంబాలకు బీమా సదుపాయం వచ్చింది. పంటలు రైతులు పండితే ఎక్కడో పోయి అమ్ముకోకుండా 7500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసి పంపుతున్నాం’ .
మీకు బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర తెలుసు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు. కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో 50 ఏండ్లకు పైగా పాలన చేసింది. ఆ కాలంలో ఏపాటి అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. బీఆర్‌ఎస్ పార్టీ 24 ఏండ్ల కింద పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం. బీఆర్‌ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన్నాడు ఇక్కడ ఏదీ సరిగా లేదు. చాలా గందరగోళ పరిస్థితి ఉండె. కరెంటు లేదు. సాగునీళ్లు లేవు. మంచి నీళ్లు లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.
కొత్త రాష్ట్రం, కొత్తకుండలో ఈగ జొచ్చినట్లు కొత్త సంసారం. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు. బతుకుదెరువు లేక జనం వలస పోవుడు. ఇవన్నీ ఉండె. ఇవన్నీ పోవాలంటే పేదల సంక్షేమం జరగాలె, వ్యవసాయ స్థిరీకరణ జరగాలె అని ఆలోచించినం. ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నం. పెన్షన్‌లు తెలుగుదేశం హయాంలో రూ.70 ఉండె. తర్వాత కాంగ్రెసోళ్లు రూ.200 చేసిండ్రు.
బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక ముందుగా రూ.1000 ఇచ్చినం. ఇప్పుడు రూ.2000 ఇస్తున్నం. భవిష్యత్తులో రూ.5000 చేయాలని నిర్ణయించినం. భారతదేశంలో పెన్షన్‌లను వందల రూపాయల నుంచి వెయ్యిల రూపాయలకు తీసుకపోయిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర రెవెన్యూ పెరిగినా కొద్దీ పేదలకు ఇచ్చే పెన్షన్‌లను పెంచుతూ పోతున్నం’ .
‘కళ్యాణలక్ష్మి మొదలుపెట్టినప్పుడు నిధులు సరిపోతయో.. లేదోనన్న భయంతోటి రూ.50 వేలు పెట్టుకున్నం. తర్వాత రూ.75 వేలు చేసుకున్నం. ఆ తర్వాత రూ.1 లక్షకు పెంచుకున్నం. విదేశాల్లో చదువుకునేందుకు సీటొస్తే ఇదివరకు డబ్బులు లేక వెళ్లే అవకాశం లేకుండె. ఇప్పుడు రూ.20 లక్షలు ఇచ్చి బయటి దేశాల చదువుకు పంపిస్తున్నం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే తేడా లేకుండా వేల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో విదేశాల్లో చదువుతున్నారు.
అంతేగాక ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టుకున్నం. రంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ ఇబ్రహీంపట్నంలోనే ప్రారంభం కాబోతున్నది. ఇటీవలే మీర్‌ఖాన్‌పేటలో శంకుస్థాపన కూడా పూర్తయ్యింది. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది..? ఎట్లున్న తెలంగాణ ఎట్లయ్యింది..? ఇవన్నీ మీరు ఆలోచన చేయాలె’.
‘విద్యారంగంలో ఘననీయంగా అభివృద్ధి జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టుకున్నం. వాటినే రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చుకున్నం. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 1,018 కాలేజీలు లేవు. ఒక రాష్ట్రమైనా, దేశమైనా బాగుపడిందా.. లేదా చూడటానికి రెండు గీటురాళ్లు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది తలసరి ఆదాయం. రెండోది తలసరి విద్యుత్ వినియోగం.
తెలంగాణ వచ్చిన్నాడు తలసరి ఆదాయంలో మన ర్యాంకు 19, 20వ స్థానంలో ఉండె. ఇయ్యాల 3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలో నెంబర్ 1గా తెలంగాణ ఉన్నది. తెలంగాణ వచ్చిన్నాడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1,140 యూనిట్లు ఉండె. ఇయ్యాల 2,200 యూనిట్లుగా ఉన్నది. ఇలా అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంట వస్తున్నం. ఓటేసేటప్పుడు ఇవన్నీ బేరీజు వేసుకుని మీరు ఓటేయాలె’.
‘హేరాపేరీ లేకుండా.. ఒకరి భూమిని ఒకరు కాజేయకుండా.. ఎవరికి కోపం వచ్చినా కిందిమీద చేయకుండా ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చాం. ఈ పోర్టల్‌తో రైతులు ఇవాళ నిశ్చింతగా ఉన్నరు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి.. గవర్నమెంట్ తన వద్ద ఉన్న అధికారాన్ని మీకు అప్పగించింది. మీ భూమిపై యజమాన్యం మీ చేతుల్లో ఉంది.
మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కూడా లేదు. ఇవాళ పెరిగిన భూముల ధరలకు.. ఒకవేళ ధరణి లేకపోతే వీఆర్వోలు చేసిన గోల్‌మాల్‌కు ఎన్ని హత్యలు అయితుండే.. ఎంత గందరగోళం జరుగుతుండే.. ఎంత గడబిడ జరుగుతుండే. ధరణి పుణ్యమాని ఎవరి భూమి వాళ్లకే ఉన్నది. ఎవడూ ఎరాపేరి చేసే అవకాశం లేదు’
‘ధరణితోనే రైతుబంధు, రైతుబీమా, వడ్ల డబ్బులు వస్తున్నయ్. కానీ, రాహుల్‌గాంధీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తరట. వేస్తరు సంతోషమే.. తర్వాత రైతుబంధు డబ్బులు ఎలా వస్తయ్. కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ పాత పద్ధతే వస్తది. ఇది ప్రమాదకరం. ప్రజలు ఆలోచించాలి.
ఇబ్రహీంపట్నంలాంటి చోట గందరగోళం జరిగిపోతయ్. మళ్లీ దళారులు, పైరవీకారులు వస్తరు. ఎల్లయ్య భూమి మల్లయ్యకు రాసి.. మల్లయ్యది పుల్లయ్యకు రాసి జుట్లు ముడేసి.. కోర్టులచుట్టూ తిరుగుతూ లక్షల రూపాలు ఖర్చు పెట్టుకోవాలి. ఇదే కదా జరిగేది. మరి ధరణి ఉండాలా? పోవాల్నా? ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న వారిని ఏం చేయాలి. ధరణి ఉండాలంటే ఇబ్రహీంపట్నంలో కిషన్‌రెడ్డి గెలవాలి. ఎవరు గెలువాలో ప్రజలు మీరే ఆలోచించాలి.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన మాట్లాడుతున్నడు. కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతుబంధు పెట్టి దుబారా చేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు దుబారానా? రైతుబంధు ఉండుడు కాదు.. కిషన్‌రెడ్డిని గెలిపిస్తే రూ.16వేలు అవుతుంది. కిషన్‌రెడ్డి గెలిస్తే బీఆర్‌ఎస్ గవర్నమెంట్ వస్తది. ఇవన్నీ విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టాలి. పీసీసీ అధ్యక్షుడు కరెంటుపై చెబుతున్నడు.
అమెరికాలో చెప్పిండు. ఇక్కడ చెబుతున్నడు. పట్టుబట్టి చెబుతున్నడు. రైతులకు 24గంటల కరెంటు వేస్ట్ ఇస్తున్నడు కేసీఆర్ అంటున్నడు. 24 గంటలు అవసరం లేదు. మూడు గంటలు ఇస్తే చాలు అంటున్నడు. మూడు గంటలతో పారుతుందా? కాంగ్రెస్ గెలిస్తే మూడు గంటలు కాదు.. 10హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలట. రైతులు 10హెచ్‌పీ మోటర్ పెట్టుకుంటడా? ఈ మోటర్ ఎవరు కొనివ్వాలే.
తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. 30లక్షల 10హెచ్‌పీ పంపుసెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఈ పంపుసెట్లు కొనాలంటే వీని తాత ఇస్తడా? అయ్య ఇస్తడా? ఎక్కడి నుంచి రావాలి. వాళ్లు ఉన్నప్పుడు కరెంటు ఇవ్వచేత కాలేదు.. ఇవ్వలేదు. నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి రైతుల బాధేందో బతుకేందో నాకు తెలుసు.