కాంగ్రెస్ వస్తే రైతుబంధు పోతుంది: సీఎం కేసీఆర్
కాంగ్రెస్‌తో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు పోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు

- సాగుకు 24 గంటల కరెంటూ ఉండదు
- తిప్పల్ కోటి రిజర్వాయర్‌కు పెన్ గంగ నీళ్లు తెస్తం
- బోథ్ ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్
విధాత : కాంగ్రెస్‌తో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు పోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. సాగుకు 24 గంటల కరెంటు కూడా ఇవ్వరని, మూడు గంటలతో సరిపెడతారని అన్నారు. గురువారం బోథ్‌లో నిర్వహించిన బీఆరెస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం.. గులాబీ జెండా ఎగిరిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం. 15 ఏండ్లు రాజీ లేకుండా మడమతిప్పకుండా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో కలిపిస్తే 58 ఏండ్లు అరిగోస పడ్డాం. 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చారు. కానీ 15 ఏండ్ల వరకు తెలంగాణ ఇవ్వకుండా మోసం చేశారు. చివరకు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ దీక్ష చేపడితే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేశారు. మళ్లీ ఏడాదిన్నర పాటు ఉప్పెనలా పోరాటం చేస్తే అప్పుడు తెలంగాణ ఇచ్చారు.
ఈ ప్రాంతంలో బోర్లు వేసి, పత్తి వేసి, రైతుల అప్పుల పాలయ్యారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 80 చెరువులను బాగు చేసుకున్నాం. కొత్తగా 10 చెరువులు కట్టుకున్నాం. భూగర్భ జలాలు పైకి వచ్చాయి. చనకా – కొరటా కంప్లీట్ అవుతుంది. మీ ప్రాంతంలో తిప్పల్ కోటి రిజర్వాయర్‌కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం జరుగుతది. ఆ పని తప్పకుండా చేయిస్తా అని హామీ ఇస్తున్నా.
ఒకప్పుడు ఆదిలాబాద్‌లో వర్షాకాలం వచ్చిందంటే అంటురోగాలు. మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. అంటురోగాలతో సతమతమయ్యేది. ఆ అంటు రోగాలు, చావులు ఇవాళ లేవు. కాంగ్రెస్ రాజ్యంలో సాగు, తాగునీళ్లకు బాధలు అవనుభవించాం. తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయం బాగుపడాలని ఒక ప్రణాళిక వేసుకున్నాం. నీటి తీరువా రద్దు చేశాం. 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఇస్తున్నాం. ఇవాళ రైతులు అప్పులు చేసే బాధ తప్పింది. రైతు చనిపోతే 5 లక్షల బీమా వారంలోపే జమ చేస్తున్నాం. అది కాకుండా రైతు పండించిన ధాన్యాన్ని గవర్నమెంటే కొంటోంది. మద్దతు ధర ఇస్తుంది. దీంతో వ్యవసాయం మంచిగ అయింది.
ఒక పెద్ద ప్రమాదం రాబోతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నాడు. రైతుబంధు ఉండాలంటే అనిల్ జాదవ్ గెలవాలి. రైతుబంధు పది వేల నుంచి 16 వేలు అవుతుంది. రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ వల్ల నష్టం.. మూడు గంటల సరిపోతది అంటున్నడు. మూడు గంటలతో పొలం పారుతాదా..? 24 గంటల కరెంట్ ఉండాలంటే అనిల్ జాదవ్ గెలవాలి. లేకపోతే ఉన్న కరెంట్ గ్యారెంటీగా ఊడగొడుతారు.
ధరణి తెచ్చి మీ భూములకు రక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నారు. ధరణి ఎత్తేస్తే రైతుబంధు ఎలా వస్తదో ఆలోచించాలి.
‘అనిల్ జాదవ్‌ను గెలిపిస్తే నెల రోజుల్లోనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇస్తున్నా. డిగ్రీ కాలేజీ వందశాతం ఇస్తామని మనవి చేస్తున్నా. ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన కోల్డ్ స్టోరీ పెట్టిస్తమని మనవి చేస్తున్నా. గిరిజనులకు పోడు భూములు ఇచ్చాం. గిరిజనులు కానివారివద్ద కూడా పోడు భూములు ఉన్నయ్. అవి ఇవ్వాలని కేంద్రానికి పంపితే వాళ్లు అడ్డంపెట్టుకొని కూసున్నరు. వచ్చే టర్మ్‌లో కేంద్రంతో పోరాడి వారికి తప్పకుండా పట్టాలు ఇప్పిస్తమని హామీ ఇస్తున్నా. ఈ టర్మ్‌లో కుఫ్టి రిజర్వాయర్‌ను కూడా మొదలుపెట్టించి పూర్తి చేయించే బాధ్యత నాది.’
బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటంటే ఒక్కటిఈ తెలంగాణకు ఇవ్వలేదు. నవోదయ పాఠశాలల కూడా ఇవ్వలేదు. ప్రతి కొత్త జిల్లాకో పాఠశాల ఇవ్వాలని పార్లమెంట్లో చట్టం ఉన్నది. మనం 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. నేను వంద ఉత్తరాలు నరేంద్ర మోదీకి రాశాను. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వనటువంటి బీజేపీ.. ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది ? ఇక్కడి నుంచే బీజేపీకి ఎంపీ ఉన్నడు. ఏం చేస్తున్నరు.. గడ్డికోత్తున్ర. ఎంపీలు నోరు తెరువరు. నరేంద్ర మోదీ ఒక్కటీ ఇవ్వడు. ఒక్క స్కూలు, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. మనం చెడిపోతం తప్ప. మంచిది కాదు’ . అనిల్ జాదవ్‌ను గెలిపిస్తే బ్రహ్మాండంగా బోథ్ నియోజకవర్గంలో కోరిన పనులన్నీ చేసేపెట్టే బాధ్యత నాది’ .