విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి భ‌విష్య‌త్ నా బాధ్య‌తే.. హామీ ఇచ్చిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి భ‌విష్య‌త్ నా బాధ్య‌తే.. హామీ ఇచ్చిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి భ‌విష్య‌త్ త‌న బాధ్య‌త అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. నాగం జ‌నార్ధన్ రెడ్డి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించి ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో 14కు 14 స్థానాలు గెల‌వాల‌ని సీఎం సూచించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ విష్ణు, నాగంతో పాటు వారి అనుచ‌రుల‌కు, మ‌ద్ద‌తుదారుల‌కు కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.


ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి పీజేఆర్ త‌న‌యుడు.. పీజేఆర్ తెలంగాణ గురించి అద్భుత‌మైన పోరాటం చేశారని గుర్తు చేశారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌లు, సామాన్యుల‌ కోసం రాజీ ప‌డ‌కుండా పోరాడిన పాపుల‌ర్ నాయ‌కుడు పీజేఆర్. వారి కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి చాలా ఉత్సాహ‌వంతుడు. ఫాలోయింగ్ ఉన్న వ్య‌క్తి. క్రియాశీల‌కంగా మీతో పాటు ప‌ని చేస్తాన‌ని చెప్పారు. వారిని హృద‌య‌పూర్వ‌కంగా ఆహ్వానించాను. ఆయ‌న భ‌విష్య‌త్ నా బాధ్య‌త‌. ఎందుకంటే పీజేఆర్ వ్య‌క్తిగ‌తంగా నాకు మిత్రుడు, విష్ణు కూడా నా కుటుంబ స‌భ్యుడే. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. వారి భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇస్తున్నాను అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.


తెలంగాణ కోసం నాగం జైలుకెళ్లారు..


తెలంగాణ కోసం నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి పోరాటం చేశార‌ని కేసీఆర్ తెలిపారు. 1969 ఉద్య‌మంలో పోరాటం చేసి నాగం జైలుకు వెళ్లిన సంద‌ర్భాలు ఉన్నాయి. అనేక పోరాటాల త‌ర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ ప‌దేండ్ల‌లో అద్భుతంగా పురోగ‌మించాం. తెలంగాణ గురించి పోరాడిన వారు.. తెలంగాణ భ‌విష్య‌త్ కోసం మీరు తోడుగా రావాల‌ని నాగంను కోరితే పార్టీలో చేరారు అని కేసీఆర్ పేర్కొన్నారు.


ఉమ్మ‌డి పాల‌మూరులో 14కు 14 గెల‌వాలి..


నిరంజ‌న్ రెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నాయ‌కుల‌కు మ‌న‌వి.. ఇప్పుడు నాగం మ‌న‌కు మంచి అసెట్. వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొని ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో 14కు 14 గెలిచే విధంగా క‌లిసి ప‌ని చేయాలి. రాబోయే రోజుల్లో మ‌ళ్లీ క‌లుసుకుందాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్‌కు మ‌న‌వి చేస్తున్నా. విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు వారి అనుచ‌రుల‌ను క‌డుపులో పెట్టుకొని చూసుకోవాలి. పాత కొత్త క‌లిసి కొత్త శ‌క్తితో ముందుకు పురోగ‌మించాలని కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు.


హేయ‌మైన దాడులు స‌రికాదు..


తెలంగాణ రాష్ట్రం అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది అని సీఎం పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో ఎంతో పురోగ‌తి సాధించింది. కొన్ని వ్య‌తిరేక శ‌క్తులు ఉంటాయి. ఎంపీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై దాడి చేశారు. భ‌గ‌వంతుడి ద‌య‌వల్ల ఆయ‌న ప్రాణాల‌కు ప్ర‌మాదం త‌ప్పింది. సేఫ్‌గా ఉన్నాడు. హేయ‌మైన దాడులు స‌రికాదు. మీరంతా త‌గిన బుద్ధి చెప్పాలి. అద్భుత‌మైన విజ‌యం సాధించాలి. ఐక‌మ‌త్యంతో ముందుకు పోవాల‌ని కోరుతున్నాను అని కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.