CM KCR | జానారెడ్డి మాట మీద నిల‌బ‌డ‌లేదు : సీఎం కేసీఆర్

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. జానారెడ్డి గురించి విమ‌ర్శ చేయ‌ద‌లుచుకోలేదు. కానీ జానారెడ్డి పీరియ‌డ్‌లో ఆయ‌న ఆర్ అండ్ బీ మినిస్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు నాలుగు రోడ్లు త‌ప్ప ఆ త‌ర్వాత ఎటువంటి కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేదు.

CM KCR | జానారెడ్డి మాట మీద నిల‌బ‌డ‌లేదు : సీఎం కేసీఆర్

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. జానారెడ్డి గురించి విమ‌ర్శ చేయ‌ద‌లుచుకోలేదు. కానీ జానారెడ్డి పీరియ‌డ్‌లో ఆయ‌న ఆర్ అండ్ బీ మినిస్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు నాలుగు రోడ్లు త‌ప్ప ఆ త‌ర్వాత ఎటువంటి కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌లేదు. రేపు కూడా జ‌రిగేది ఏం ఉండ‌దు. భ‌గ‌త్ యువ‌కుడు మీ మ‌ధ్య‌లో ఉంట‌డు. బ‌ల‌హీన‌వ‌ర్గాల బిడ్డ. వాళ్ల తండ్రి న‌ర్సింహ‌య్య క‌మ్యూనిస్టు పార్టీ యోధుడు. చాలా రోజులు ప్ర‌జా సేవ చేశారు. ఆయ‌న ఆకస్మాత్తుగా చ‌నిపోతే ఆయ‌న కొడుక్కే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం. మంచి ఉత్సాహ‌మైన యువ‌కుడు.. విద్యావంతుడు. విన‌యం ఉన్న వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తి ఎమ్మెల్యే అయితే కులం, మ‌తం లేకుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గుత‌ది.. లాభం జ‌రుగుతంది. భ‌గ‌త్‌ను గుండెల‌కు హ‌త్తుకుని 80 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండి. అభివృద్ధి నా బాధ్య‌త అని మ‌న‌వి చేస్తున్నాను.


ఇప్ప‌టి కూడా ప్ర‌జాస్వామ్యంలో ప‌రిణితి రాలేదు. ఎల‌క్ష‌న్లు చాలా వ‌స్తాయి.. చాలా పోతాయి. మీరు కూడా చాలాసార్లు చాలా మందికి ఓటేశారు. గెలిపించారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌కు ఉండే ఒకే ఒక హ‌క్కు ఓటు. ఈ ఓటు ఆషామాసీగా వేసేది కాదు. ఎవ‌రి చేతుల్లో రాష్ట్రం క్షేమంగా ఉంటుందో ఆలోచించాలి. పార్టీల గురించి కూడా లోచించాలి. ఏ పార్టీకి అధికారం ఉంటే ఏం చేశారు. ఎవ‌రి చేతుల్లో ఉంటే సుర‌క్షితం, ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుందో ఆలోచించి ఓటు వేయాలి. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గెల‌వాలి. అప్పుడే నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం వ‌చ్చిన‌ట్లు. కాంగ్రెస్ పార్టీ కొత్త‌ది కాదు. 50 ఏండ్లు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది. ప‌దేండ్ల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఎవ‌రి కాలంలో ఏం జ‌రిగిందో ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. మీ తండాల‌కు, గ్రామాల‌కు వెళ్లిన త‌ర్వాత ప‌ది మందితో చ‌ర్చ పెట్టాలి.


కాంగ్రెస్ పార్టీ ఎన్నుడూ కూడా ధైర్యంతో ప‌ని చేసి అన్ని వ‌ర్గాల‌ను ఆదుకునే ప‌ని చేయ‌లేదు. జానారెడ్డి పెద్ద నాయ‌కుడిగా ఉండే. మినిస్ట‌ర్‌గా ఉండే. అపోజిష‌న్ లీడ‌ర్‌గా ఉండే. నేను సీఎం అయిన ప్రారంభంలో క‌రెంటో క‌ష్టాలు ఘోరంగా ఉండే. మీకు అప్పుడ‌ప్పుడు సాగ‌ర్ నీళ్లు వ‌చ్చేవి. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, మెద‌క్ జిల్లాల ప్ర‌జ‌లు వ‌ల‌స‌పోయారు. ప‌శువుల‌కు గ‌డ్డి లేక క‌బేళాల‌కు అమ్మేసి అన్న‌మో రామ‌చంద్ర అని పొట్ట చేత‌బ‌ట్టుకుని బ‌తుక‌పోయేది. దుర్భ‌రంగా ఉండే. చాలా క‌ష్ట‌ప‌డి మూడు నాలుగు నెల‌లు ఆర్థిక నిపుణుల‌తో చ‌ర్చించి ముందుకు వెళ్లినం.


క‌చ్చితంగా క‌రెంట్ విష‌యంలో మంచి నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించాం. నేనే అసెంబ్లీలో మాట్లాడుతూ.. రెండేండ్ల‌లో వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రెంట్ ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేశాను. ఆనాడు జానారెడ్డి అపోజిష‌న్ లీడ‌ర్‌గా ఉండే. కేసీఆర్ రెండేండ్ల‌లో కాదు.. నాలుగేండ్ల‌లో క‌రెంట్ ఇచ్చినా నేను కాంగ్రెస్ కండువా తీసి గులాబీ కండువా క‌ప్పుకుని మీ కార్య‌క‌ర్త‌లా ప‌ని చేస్తాన‌ని మాట్లాడిండు. కానీ ఏడాదిన్న‌ర లోపే 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చాను. నేను స‌క్సెస్ అయ్యాను. జానారెడ్డి మాట మీద నిల‌బ‌డ‌లేదు. ఆయ‌న పార్టీ మార‌లేదు, గులాబీ కండువా క‌ప్పుకోలేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఉల్టా భ‌గ‌త్ మీద నిల‌బ‌డ్డారు. మీరంతా జానారెడ్డికి త‌గిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా పార్టీల వైఖ‌రి గురించి ఆలోచించి నిర్ణ‌యం చేయాలి. అప్పుడే మేలు జ‌రుగుత‌ది. నిజంగా ఎవ‌రి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే బాగుంటుందో ఆలోచించాలి. మీ నిర్ణ‌యం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి..


జానారెడ్డి మంత్రిగా ఉండే.. పెద్ద నాయ‌కుడిగా ఉండే.. ఇక‌ ఇప్పుడు కూడా క‌ల కంటున్నాడు ముఖ్య‌మంత్రి అయితా అని. కానీ ఆయ‌న హ‌యాంలో నాగార్జున సాగ‌ర్‌లో ఓ డిగ్రీ కాలేజీ కూడా దిక్కు లేకుండే. నోముల భ‌గ‌త్ ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కాలేజీ మంజూరు చేశాను. హాలియాలో 50 ప‌డ‌క‌ల ద‌వాఖానా దిక్కు లేకుండే. అది కూడా భ‌గ‌త్ చేయించారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రెండు లిఫ్ట్ గిరిగేష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఎనిమిది నెల‌ల్లో పూర్త‌వుతాయి. నేనే వ‌చ్చి ప్రారంభం చేస్తాను.


‘కాంగ్రెస్‌ రైతుబంధును దుబారా.. ఇది వద్దంటున్నరు. రైతుబంధు ఇచ్చేటోడు ఉండాల్నా..? రైతుబంధు వేస్ట్‌ అనేటోడు ఉండాలా? మీరే నిర్ణయం తీసుకోవాలి. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నడు. 24గంటల కరెంటు కేసీఆర్‌ వేస్ట్‌గా ఇస్తున్నడు అని మాట్లాడుతున్నడు. మూడు గంటల కరెంటుతో పొలాలు పారుతయా? మరి ఎన్నిగంటల కరెంటు ఉండాలి? 24 గంటల కరెంటు ఉండాలంటే భగత్‌ గెలవాలి’


‘వాళ్లు డైరెక్టర్‌గా చెబుతున్నరు. ఇంకో డేంజర్‌ మాట చెబుతున్నరు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరటా. ఎవరి కోసం ధరణిని బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ తెచ్చింది. రైతుల కోసమే కదా.. రైతుబంధు ఇవాళ ఎలా వస్తుంది ? అక్కడ మీరు పేరుమీద ఎన్ని డబ్బులు వేస్తున్నమో మీ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నయ్‌. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతుబీమా సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతున్నయ్‌. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు లేకుండా ఖాతాల్లో పడుతున్నయ్‌. ధరణి తీసివేస్తే మరి ఖాతాల్లో డబ్బులు ఎలా పడాలి ? ఇది సీరియస్‌ విషయం ఆలోచించాలి. ఇది చెబుతున్నది ఎవరో ఆషామాషీగాళ్లు చెప్పడం లేదు. కాంగ్రెస్‌ వస్తే తీసివేస్తమని రాహుల్‌ గాంధీ చెబుతున్నడు. సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క చెబుతున్నడు’ .


‘పదెకరాల భూమి ఉందనుకో.. ఎమ్మార్వో ఆఫీసు, అగ్రికల్చర్‌ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఇవాళ ఎక్కడికి వెళ్లే అవసరం లేకుండా, దరఖాస్తు లేకుండా.. రూపాయి లంచం ఇవ్వకుండా.. రూపాయి తక్కువ కాకుండా ఎంత వేసినమో అంత డబ్బు నీ కడుపుల చల్ల కదలకుండా నీ చేతికి వస్తుంది. ధరణిని తీసివేస్తే మళ్లీ ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాలి. ఎన్ని ఎకరాలున్నది నీకు.. ఎంత వస్తది.. లక్ష వస్తదంటే రూ.30వేలుతే అంటడు. మళ్లీ దళారీల రాజ్యం. కాంగ్రెస్‌ రాజ్యంలో ఎలాగైతే రిజిస్ట్రేషన్‌ ఆఫీసులకాడ పడిగాపులు పడ్డమో.. భూమి పట్టా కావాలంటే ఏడాది రెండేళ్లు తిరిగినమో.. అదే రాజ్యం కావాలా? ఆలోచించాలి’.



‘మూడు గంటల కరెంటుతో పది హెచ్‌పీ మోటర్‌తో పారుతదట. పది హెచ్‌పీల మోటర్‌ ఎవరు కొనివ్వాలి. రైతులదగ్గర పది హెచ్‌పీల మోటర్‌ ఉంటదా? రైతులకు ఉండేది మూడు హెచ్‌పీ, ఐదుహెచ్‌పీల మోటర్. మరి మోటర్‌ ఎవరు కొనివ్వాలి. వీని తాత కొనిస్తడు. ఎవడు కొనిస్తడు. ఇంత సీరియస్‌ మాటలు వాళ్లు చెబుతున్నరు. ధరణి తీసివేస్తం.. దళారీ రాజ్యం తెస్తం. మళ్లీ పైరవీకారుల రాజ్యం తెస్తం. కరెంటు మూడుగంటలే ఇస్తం అంటున్నరు. ఇంకా విచిత్రం తెలుసా మీకు. కర్నాటక నుంచి ఓ పెద్ద కాంగ్రెస్‌ లీడర్‌ వచ్చింది. ఆయన పేరు డీకే శివకుమార్‌, ఆయన కర్నాటకల ఉప ముఖ్యమంత్రి.. ఆయన వచ్చి నాకు చెబుతున్నడు. కేసీఆర్‌ కావాలంటే కర్నాటకకు వచ్చి చూడు.. మేం ఐదుగంటలు కరెంటు ఇస్తున్నం అంటున్నడు. సన్నాసి మేం 24గంటల కరెంటు ఇస్తున్నం.. నేను నీ ఐదుగంటల కరెంటును చూసేందుకు నేనేం రావాలని అని చెప్పిన’.



‘కాంగ్రెస్‌ ఉన్న నాడు ఎవరినీ చూడలేదు. రూ.200 పెన్షన్‌ మొఖాన కొట్టి మీ చావు మిమ్మల్ని చావమ్మనది. మొదట రూ.1000 చేసి ఇవాళ రూ.2వేల పెన్షన్‌ చేసింది ఎవరు? ఓన్లీ బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌. ఇవాళ మళ్లీ రూ.5వేల పెన్షన్‌ పెంచుతామని ప్రకటించాం. భగత్‌ను గెలిపించండి అందరి పెన్షన్లు రూ.5వేలకు పెరుగుతయ్‌. ఎవరు మంచి చేస్తరు.. ఎవరు చెడు చేస్తరు అనే ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఆగమాగం ఓట్లు వేయొద్దు’.


‘ప్రజలందరికీ ఈ విషయం ప్రజలకు తెలిసేలా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పని చేయాలి. మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఏది నిజం.. ఏది రాయి.. ఏది రత్నమో చర్చపెట్టి ఓట్లు వేయించాలి. చర్చపెట్టండి.. భగత్‌ 70-80వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తడు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గ్రామగ్రామం 30 తేదీలోగా ప్రతి గడపకూ ఈ సందేశం అందాలే. మన గెలుపును ఎవడూ ఆపలేడు. ఎన్ని మంచి కార్యక్రమాలు అమలు చేశాం. పేదవాళ్లు ఉంటరు. ఉన్నవాళ్లు ఉంటరు. కంటి వెలుగు కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడైనా నిర్వహించారా? కనీసం ఎవరైనా ఆలోచించారా? 3కోట్ల మంది కండ్ల పరీక్షలు చేసి బ్రహ్మాండంగా 8లక్షల మందికి కండ్ల అద్దాలు బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఇచ్చింది. కేసీఆర్‌ కిట్‌ పెట్టాం. అమ్మ ఒడి వాహనాలు పెట్టాం. ప్రసవానికి గతంలో ప్రైవేటు దవాఖానాలకు వెళ్తే దోపిడీ పాలయ్యేది. ఇవాళ అమ్మ ఒడి వాహనం వచ్చి తీసుకెళ్లి ప్రసూతి చేయించి.. ఇంటికాడ దిగబెడుతున్నది. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, పిలగాడు పుడితే రూ.12వేలు బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఇస్తున్నది’



‘కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ ఎప్పుడన్నా ఆలోచించిందా? ఆనాడు దోపిడీకి గురైతే పట్టించుకున్నదా? ఆ నాడు వాళ్లు ఇచ్చిన బియ్యం ఎంత ? ఇవాళ ఇచ్చే బియ్యం ఎంత? ఎన్నికలు కాంగనే మార్చి నుంచి రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యమే సప్లయ్‌ చేస్తమని ప్రకటించాం. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. భగత్‌ కోరిన కోర్కెలను తీర్చలేనివి కావు. వందశాతం భగత్‌ను గెలిపించండి.. ఆయన అడిగిన పనులన్నీ చేయిస్తా. పొరపాటున కాంగ్రెస్‌ వస్తే కరెంటు పోవడం ఖాయం.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌. ఎవడు ఎక్కడపోతడో తెలియదు. వాళ్ల చేతిలో రాజ్యం పడితే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే అయితది. ఆలోచించి ఓటు వేయాలి.. నిర్ణయం తీసుకోవాలి. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ప్రజల దృష్టిలోకి కార్యకర్తలు తీసుకెళ్లాలి.