ప్రభుత్వం ఏం చేసిందో లెక్క తీయండి: సీఎం కేసీఆర్

- విచక్షణతో మంచిని నిర్ణయించి ఓటేయండి
- పదేళ్ల బీఆరెస్ ప్రభుత్వ అభివృద్ధి మీ కండ్లముందుంది
- కాంగ్రెస్ తో 58 ఏండ్లు గోస పడ్డం… నష్టపోయాం
- సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ రావాల్సిన పరిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే ప్రజాస్వామ్యంలో పరిణితి వచ్చిందో ఆ దేశాలు చాలా బాగా ముందుకు పోతున్నాయి. మన దేశంలో ఇంకా ఆ పరిస్థితి లేదు. రావాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు చాలా వస్తాయి పోతాయి. ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలుస్తరు అందరికీ తెలసు. మీరు చాలా సార్లు ఓట్లేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ప్రతి పార్టీ తరపున ఒకరు నిలబడుతారు. కోనప్ప బీఆర్ఎస్ తరపు ఉన్నారు. 30న ఓట్లు పడుతాయి. 3న లెక్కింపు అయిపోతది. ఫలితం తేలుతుంది.
మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఏందంటే అభ్యర్థి గుణగణాలు, సేవా తత్వం గురించి ఆలోచన చేయాలి. ఆ అభ్యర్థుల వెనుకాల ఏ పార్టీ ఉంది. వాటి చరిత్ర విధానాలు, ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచిస్తుంది..? అధికారం వస్తే ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించాలి. ఎన్నికలు అయిపోగానే ప్రక్రియ ఆగిపోదు. ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మీ ఓటు వజ్రాయుధం, చాలా విలువ ఉంటది. ఐదేండ్లు మీ తలరాతను రాస్తది. భవిష్యత్‌ను నిర్ణయిస్తది. అందుకే జాగ్రత్తగా ఓటు వేయాలి. ఆషామాషీగా, అలవోకగా వేయొద్దు. మంచి ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఏ ప్రభుత్వం ఏం చేసిందో లెక్క తీసి ఓట్లు వేస్తే లాభం జరుగుతది. ప్రజాస్వామ్య పరిణితి పెరిగి, విచక్షణ జ్ఞానంతో ఎవరు గెలిస్తే మంచిదో నిర్ణయించి ఓటేయాలి.
బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ ప్రజల కోసం, హక్కుల కోసం పుట్టింది బీఆర్ఎస్. రాష్ట్రాన్ని సాధించింది. ఈ పదేండ్లు నుంచి ప్రభుత్వం నడుపుతున్నాం. గత ప్రభుత్వాలకు బీఆర్ఎస్ కు తేడా ఆలోచించాలి. అభివృద్ధి మీ కండ్ల ముందుంది. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఉన్న రాష్ట్రాన్ని బలవంతంగా తీసుకెళ్లి ఏపీలో కలిపారు. దాంతో 58 ఏండ్లు గోస పడ్డం. నష్టపోయాం. బాధపడ్డాం.
2004లో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇస్తామన్నారు కాంగ్రెసోళ్లు. నమ్మి కలిశాం. అప్పుడు అధికారం వచ్చింది. తెలంగాణ వెంటనే ఇవ్వలేదు. ఏడాదికి, రెండేండ్లకు కూడా ఇవ్వలేదు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. 14 ఏండ్లు కొట్లాడితే.. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ ప్రకటన వెనక్కి తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు సకల జనుల సమ్మె చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేసి హోరాహోరీ పోరాటం చేస్తే మళ్లీ తెలంగాణ ఇచ్చారు. ఇదంతా మీరు కండ్లారా చూశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కాగజ్‌నగర్ ఎట్ల ఉండేనో.. తెలంగాణ అట్లనే ఉండే. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, పరిశ్రమలు మూతపడటం రకరకాల ఇబ్బంది చూశాం. పొట్ట చేతపట్టుకుని వలసలు పోయారు. ఈ పదేండ్లలో ఒకటి ఒకటి బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మంచినీళ్ల సమస్య లేదు. సిర్పూర్ గురించి మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లంబాడీ, ఆదివాసీ గూడెంలకు భగీరథ నీళ్లు వస్తున్నాయి.
కరెంట్ బాధ కూడా లేదు. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. అన్ని వర్గాలకు కరెంట్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇలా సమస్యలు పరిష్కరించుకున్నాం. పేదలకు మంచి చేసుకున్నాం. ఆరోగ్యం దృష్ట్యా కూడా మంచి పనులు చేపట్టాం. గవర్నమెంట్ హాస్పిటల్‌లో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు అవుతున్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ తగ్గింది.
విద్యా వ్యవస్థను బాగు చేసుకున్నాం. గురుకుల విద్యాసంస్థలు నెలకొల్పాం. కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాం. ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం గురుకులాలు పెట్టుకున్నాం. ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల మీద లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నాం. గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లు ,ఇంజినీర్లుగా తయారవుతున్నారు.
తెలంగాణ అంటేనే వలస పోవుడు. ఇవాళ రైతాంగం బాగుపడాలని, వ్యవసాయాన్ని స్థీరికరించాలని చాలా మంచి పనులు చేశాం. నాలుగైదు సౌకర్యాలు కల్పించాం. గతంలో రైతుకు పిల్లను ఇవ్వకపోయేటోడు. చివరకు చప్రాసీ ఉద్యోగం ఉన్నవారికి ఇచ్చేవారు. ఇవాళ రైతుకు పిల్లను ఇస్తున్నారు. భూమి ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే వ్యవసాయం విలువ భూమి విలువ పెరిగింది. నీటి తీరువా లేదు. ప్రాజెక్టుల ద్వారా ఇచ్చే నీళ్లకు ట్యాక్స్ లేదు. బకాయిలు రద్దు చేసుకున్నాం. రైతులు దర్జాగా వ్వయసాయం చేసుకుంటున్నారు. పెట్టుబడికి ఇబ్బంది ఉండొద్దని రైతుబంధు ఇస్తున్నాం. ఈ పథకం పేద రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
వడ్లు పండితే ఏ ఊరికి ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నాం. దళారీ రాజ్యం ఉండొద్దని చెప్పి ధరణి పోర్టల్ తెచ్చి రైతుల భూములను రక్షించాం. ఈ నియోజకవర్గంలో 16 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. గిరిజనులపై ఉన్న కేసులు ఎత్తేశాం. రైతుబంధు ఇచ్చాం. గిరిజనేతర బిడ్డలకు కూడా పట్టాలు వస్తాయి. దానికి ఆటంకం కేంద్ర ప్రభుత్వమే. కఠినమైన రూల్స్ పెట్టారు. లెక్కలు తీసి కేంద్రానికి పంపించాం. ఎన్నికల తర్వాత పోరాటం చేసి గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మొత్తానికి ఇవాళ రైతుల ముఖాలు తెల్లపడ్దాయి. అప్పులు లేవు. రైతులు సంతోషంగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కేసీఆర్‌కు పని లేక ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులను రైతుబంధు పెట్టి దుబారా చేస్తున్నారాని అంటున్నారు. నాకు దమాక్ ఖరాబ్ అయిందంట. వారికి దమాక్ పెద్దగా ఉందంట.. వాళ్లు చెప్పుతున్నారు రైతుబంధు దుబారా అని.. రైతుబంధు వల్ల లాభం ఉందా..? నష్టం ఉందా..? మీరే నిర్ణయం చేయాలి. 24 గంటల కరెంట్ అక్కర్లేదు మూడు గంటల కరెంట్ సరిపోతదని రేవంత్ రెడ్డి అంటున్నడు. అది కూడా దుబారా అని మాట్లాడుతున్నారు. వాళ్లు ఇవ్వలేదు. ఇచ్చేటోళ్ల మీద నిందలు వేయడం. కరెంట్ షాకులతో పురుగుబూసి కరిచి చనిపోవడం ఇలా పడరాని పాట్లు పడ్డాం. బావుల కాడనే కరెంట్ కావలి ఉండేటోళ్లు.
రైతుల భూములపై ఇంతకు ముందు అధికారం అధికారులకు ఉండే. ఒకరి భూమికి మరొకకరి రాసి తాకట్లు పెట్టేవారు. ఈ బాధ శాశ్వతంగా పోవాలని చెప్పి నేను ధరణి పోర్టల్ తెచ్చాను. ధరణి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదు. ఎవరి భూమి వారికి సురక్షితంగా ఉంది. పావు గంటలో రిజిస్ట్రేషన్, పావు గంటలో పట్టా అయిపోతుంది. భూముల రిజిస్ట్రేషన్ కోసం మునుపు లంచం వసూళ్లు చేసి నెలలు తిప్పేటోళ్లు. మా దగ్గర ఉన్న అధికారాన్ని, పెత్తనాన్ని తీసేసి, మీ బొటనవేలికి అధికారం ఇచ్చాం. మీ బొటనవేలితోనే మీ భూమి హక్కు మారుతది.
దరఖాస్తు లేకుండానే నేరుగా ఖాతాలో రైతుబంధు డబ్బులు పడుతున్నాయి. రైతుబంధు డబ్బులను ఎరువులకు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు రావు. మళ్లీ దళారీలు వస్తరు. మళ్లా లంచాలు మొదలవుతాయి. ధరణిని బంగాళాఖాతంలో వేస్తారట ఇది చాలా ప్రమాదం. అప్పుడు దళారి, పైరవీకారుల రాజ్యం వస్తది. రైతులు ఆగమవుతారు.
కోనప్ప మంచి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అతి కొద్ది మంది గొప్ప ఎమ్మెల్యేల్లో కోనప్ప ఒకరు. అద్భుతమైన ప్రజాసేవాలో ఉంటారు. అంత బ్రహ్మాండంగా పని చేస్తారు. నా దగ్గరికి ఎప్పుడొచ్చినా బ్రిడ్జిలు, కాల్వల పంచాయితీ, పట్టణ అభివృద్ధి గురించి అడిగారు. వ్యక్తిగత పనులు అడగలేదు. ఎమ్మెల్యే అనే గర్వం లేదు. ప్రజలతో మమేకమైపోతారు. అందరికీ అందుబాటులో ఉంటారు. హైదరాబాద్‌లో తక్కువ.. కాగజ్‌నగర్‌లో ఎక్కువ ఉంటారు. గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు. ఎగ్జామ్స్ టైమ్‌లో పిల్లలకు భోజనాలు పెట్టిస్తారు. ఎవరికైనా ఆపద వస్తే అక్కడ వాలిపోయి ఆదుకుంటారు. గొప్ప మనసున్న వ్యక్తి.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాగజ్‌నగర్ నంబర్ వన్.. మన రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్య ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. గెలిచే ఎమ్మెల్యేల్లో కోనప్ప కూడా నంబర్ వన్‌లో ఉన్నారు. అందులో సందేహం లేదు. మిమ్మల్ని చూస్తుంటే ఆయన గెలుపు ఖాయమైపోయిందని అర్థమవుతుంది. ఇంత మంచొళ్లను పొగోట్టుకోవద్దు. కోనప్ప లాంటి మంచి ఎమ్మెల్యే పేపర్ మిల్లు తెరిపించేందుకు ఎంతో కష్టపడ్డారు. ఎంతో బాధపడ్డారు. పది కంపెనీలను పట్టుకురావాలని తిరిగి చివరకు ఒక కంపెనీ పట్టుకొచ్చారు.
మీ ప్రభుత్వం దయ వల్ల, మద్దతుతో మునుపటి కంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం అని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. కాగజ్‌నగర్ ఒకప్పుడు మినీ ఇండియాలాగా ఉండే.. అన్ని రాష్ట్రాల వారు ఇక్కడకు పనికి వచ్చేవారు. కానీ వైభవం కోల్పోయింది. మళ్లీ వైభవం తీసుకురావాలి.. మిగిలిన ఖార్ఖానాలు తెరిపించాలని కోరారు. తప్పకుండా కోనప్ప ఆధ్వర్యంలోనే పరిశ్రమలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. వెంబడి పడితే విడిచే రకం కాదు కోనప్ప. నియోజకవర్గం అభివృద్ధి కోసం పోరాడుతారు.