మ‌న ఓటు స‌న్నాసికి వేస్తున్నామా.. స‌రైన వ్య‌క్తికి వేస్తున్నామా ఆలోచించాలి

మ‌న ఓటు స‌న్నాసికి వేస్తున్నామా.. స‌రైన వ్య‌క్తికి వేస్తున్నామా ఆలోచించాలి
  • ఎవ‌రో ఒక‌రు గెలుస్తారు!..
  • కానీ.. నిజ‌మేదో ఆలోచించి ఓటేయండి
  • ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే గెలిచే ప‌రిస్థితి రావాలి
  • అప్ప‌టిదాకా దేశం ఇలానే ఉంటుంది
  • ద‌ళితుల్ని ఓటు బ్యాంకులా వాడారు
  • వారి స్థితి మార్చాల‌నే ద‌ళిత‌బంధు
  • ప్ర‌ధాని మోదీకి ప్రైవేటైజేష‌న్ పిచ్చి
  • ఇల్లెందు, స‌త్తుప‌ల్లి స‌భ‌ల్లో సీఎం కేసీఆర్‌

విధాత : ఎన్నిక‌ల్లో ఎవ‌రో ఒక‌రు గెలువ‌టం ఖాయ‌మ‌ని, కానీ.. త‌ల రాత మార్చే, మీ భ‌విష్య‌త్తును తీర్చిదిద్దే ఓటును అల‌వోక‌గా వేయొద్ద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. మంచి ప్ర‌భుత్వం గెలిస్తే మంచి ప‌నులు జ‌రుగుతాయ‌ని, చెడు ప్ర‌భుత్వం గెలిస్తే చెడ్డ ప‌నులు జ‌రుగుతాయ‌ని చెప్పారు. బుధ‌వారం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ఇల్లెందు, స‌త్తుప‌ల్లిలో నిర్వ‌హించిన ప్ర‌జాఆశీర్వాద స‌భ‌ల్లో సీఎం ప్ర‌సంగించారు. ప్రతిపక్ష నేతలు త‌మ‌ను అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నారన్న కేసీఆర్‌.. అసెంబ్లీకి పంపేది మీరా? ఆ సన్నాసులా.? అని ప్ర‌శ్నించారు. బీఆరెస్ తెలంగాణ కోస‌మే పుట్టిన పార్టీ అని సీఎం కేసీఆర్ అన్నారు. త‌మ‌కు ఢిల్లీలో బాసులు లేర‌ని, త‌మ‌కు ప్ర‌జ‌లే బాసుల‌ని చెప్పారు. ‘ఇక్క‌డ వేరే ఏ పార్టీ గెలిచినా వారి క‌ట్క‌లు (స్విచ్‌లు) ఢిల్లీలో ఉంటాయి.



 



స్విచ్ అక్క‌డ వేస్తేనే ఇక్క‌డ బ‌ల్బులు వెలుగుతాయి. వీళ్ల చేతుల ఏం ఉండ‌దు’ అని చెప్పారు. ఇల్లెందులో హ‌రిప్రియ నాయ‌క్‌ను, స‌త్తుప‌ల్లిలో సండ్ర వెంక‌ట వీర‌య్య‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. ‘ఇల్లెందు చాలా ఉద్య‌మాలు జ‌రిగిన ప్రాంతం.. చైత‌న్యం ఉండే ప్రాంతం. పోరాటాల పురిటిగ‌డ్డ. ఎల‌క్ష‌న్లు వ‌చ్చిన‌ప్పుడు పార్టీకి ఒక‌రు నిల‌బ‌డుతారు. బీఆర్ఎస్ త‌ర‌పున హ‌రిప్రియ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ త‌ర‌ఫున‌ ఎవ‌రో ఒక‌రు నిల‌బ‌డుతారు. న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌రిగేది ఖాయం.. డిసెంబ‌ర్ 3న‌ ఎవ‌రో ఒక‌రు గెలిచేది ఖాయం’ అని కేసీఆర్ చెప్పారు. స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏండ్లు గ‌డుస్తున్న‌ద‌ని, రాజ‌కీయ ప‌రిణితి, ప్ర‌జాస్వామి ప‌రిణితి రావాల్సిన అస‌వ‌రం ఉంద‌ని అన్నారు. పైస‌ల‌కు, ప్ర‌లోభాల‌కు లోబ‌డి ఓటు వేయొద్ద‌ని చెప్పారు. చైత‌న్యంతో నిజ‌మేదో ఆలోచించి ఓటు వేయాల‌న్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గెలిచే స్థితి రానంత వ‌ర‌కు ఈ దేశం ఇలానే ఉంటుంద‌ని పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యేల‌ ద్వారా రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది. మంచి ప్ర‌భుత్వం గెలిస్తే మంచి ప‌నులు జ‌రుగుతాయి. చెడు ప్ర‌భుత్వం గెలిస్తే చెడ్డ ప‌నులు జ‌రుగుతాయి. అంద‌రి చ‌రిత్ర‌లు మీ చేతిలో ఉన్నాయి. ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగం కావొద్దు. స్థిరంగా ఆలోచించాలి. ఏం చేస్తే లాభం జ‌రుగుత‌దో ఆ దారి ప‌ట్టాలి. అదే ప్ర‌జాస్వామ్యానికి దారి’ అని అన్నారు. ప్ర‌జ‌ల చేతిలో ఉన్న వ‌జ్రాయుధం ఓటు అని, అది మీ త‌లరాత మార్చేద‌ని అన్నారు. మ‌న అమూల్య‌మైన ఓటు స‌న్నాసికి వేస్తున్నామా..? స‌రైన వ్య‌క్తికి వేస్తున్నామా..? అని ఆలోచ‌న చేయ‌క‌పోతే మ‌న‌మే ఓడిపోతామ‌న్నారు. బీఆరెస్ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు ఆయ‌న వివ‌రించారు. ‘హరిప్రియ నాయక్‌ చరిత్రలో ఉంటది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటైమ్‌లో ఇల్లెందు నియోజకవర్గంలో 48వేల ఎకరాలకుపైగా పొడు భూములను మీకు అందించడం జరిగింది. పొడు భూముల‌ కేసులన్నీ రద్దు చేశాం. రైతుబంధు కూడా ఇచ్చాం’ అని సీఎం చెప్పారు.

మోదీకి ప్రైవేటైజేష‌న్ పిచ్చి

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్‌ పిచ్చి పట్టుకుంద‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ‘విమానాశ్రయం, ఓడరేవులు, రైళ్లు ప్రైవేటు. చివరకు దేశాన్ని ఏం చేస్తడో తెల్వదు. కరెంటు కూడా ప్రైవేటీకరణే. నన్ను కూడా బెదిరించారు. మీ రైతుల మోట‌ర్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి రూ.5వేలకోట్ల బడ్జెట్‌ను కట్‌ చేస్తే.. ఐదేళ్లలో రూ.25వేలకోట్లు పోతయ్ అన్నారు. కానీ తలకాయ తెగిపడ్డా సరే మీటర్లు పెట్టా అని చెప్పిన’ అని తెలిపారు. గ‌తంలో వ్య‌వ‌సాయం చేసుకునేవారికి పిల్ల‌నిచ్చేవారు కాద‌ని, ఇవాళ భూమి ఉన్న‌వారికే పిల్ల‌నిస్తున్నార‌ని చెప్పారు.

ద‌ళిత బంధును పుట్టించిందే తాన‌ని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిని అల్లాట‌ప్పాగా తీసుకురాలేద‌ని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు గ‌డిచినా.. ద‌ళితుల ప‌రిస్థితి మార‌లేద‌ని చెప్పారు. యుగ‌యుగాలు, త‌ర‌త‌రాల నుంచి అణిచివేత‌కు, వివ‌క్ష‌కు గుర‌య్యార‌ని అన్నారు. ఇవాళ పెడ‌బొబ్బ‌లు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్రెర్ర‌ జెండాలు, ప‌చ్చ ప‌చ్చ‌ జెండాలు.. ద‌ళితుల‌ను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి త‌ప్ప‌.. వారి గురించి ఆలోచించ‌లేద‌ని మండిప‌డ్డారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంద‌ని, పైరవీకారుల చుట్టూ తిర‌గాల్సి ఉంటుంద‌ని కేసీఆర్ అన్నారు. ధ‌ర‌ణి, రైతుబంధు ఉండొద్ద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నార‌న్న సీఎం.. ‘దాని అర్థమేంది? కాంగ్రెస్‌ మీకు హింట్ ఇస్తున్న‌ది. గొడ్డలి భుజం మీదున్నది. బట్టకప్పారు గంతే.. ఒక్క దెబ్బతో కాంగ్రెస్‌ గెలిస్తే.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్‌.. కరెంటు కాటకలుస్తుంది’ అని హెచ్చ‌రించారు.

బీఆరెస్ గెలుపు ఆప‌డం ఎవ‌నిత‌రం కాదు

ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్‌ఎస్‌ పార్టీయేన‌ని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదు. ‘ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు కరటక దమ్మదగ్గులున్నరు. బీఆర్‌ఎస్‌ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా నేను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని ఒకడంటడు. అది అయ్యేపనేనా..? మీరంతా తలుచుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంలో దుమ్మురేగదా..? సండ్ర వెంకట వీరయ్య ఒక్కసారి కాదు, నాలుగోసారి సత్తుపల్లి పహిల్వాన్‌లా శాసనసభలో అడుగుపెట్టడా..? నామా నాగేశ్వర్‌రావు ఖమ్మం పహిల్వాన్‌లా లోక్‌సభలో అడుగుపెట్టడా..? ఒక్కొక్కనికి ఎంత అహంకారం? నాలుగు పైసలు జేబులో పడితే ఇంత అహంకారం పెరుగుతదా..? పదేళ్లు సీఎంగా పని చేసిన నేను కూడా అంత అహంకారంతోటి మాట్లాడలేదు’ అని సీఎం చెప్పారు.