మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నేడు లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌ అన్నీ తానై

లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. కార్యాచరణ రూపొందించుకుని నేతలకు, పార్టీ శ్రేణులకు నియోజకవర్గాల

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నేడు లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌ అన్నీ తానై

విధాత‌: లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. కార్యాచరణ రూపొందించుకుని నేతలకు, పార్టీ శ్రేణులకు నియోజకవర్గాల వారీగా దిశా నిర్దేశం చేస్తున్నారు. ఒకవైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. మరోవైపు అన్ని స్థానాలపై ఫోకస్‌ పెట్టి నియోజకవర్గాల వారీగాసమీక్ష చేస్తున్నారు. నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ స్థానాల నేతలతో చర్చించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులను, ఇతర ముఖ్య నేతలు కూడా ఆహ్వానించి అందరినీ సమన్వయం చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు స్థానాలకు బాధ్యులను ఎంపిక చేయడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినట్టే లోక్‌సభలోనూ పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా పోషిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు తో కలిసి నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థులపై సర్వేల ఆధారంగా వ్యూహ రచన చేస్తున్నారు. వీటితో పాటు ఇంటెలిజెన్స్‌ నుంచి ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాలు, బలహీనతలపై స్పష్టమైన నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రచారం, అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు అధిష్ఠాన పెద్దలకు సమాచారం ఇస్తూ వారి సలహాలు, సూచనలను అమలు చేస్తున్నారు. 14 సీట్లకు తగ్గకుండా గెలిపించి అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నారు.

అలాగే పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్త, నేతలకు రానున్న రోజుల్లో క్షేత్రస్థాయి రోజుల్లో నేతల పనితీరు ఆధారంగా అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష విషయంలో సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్‌ అధిష్ఠాన నిర్ణయాన్ని వ్యతిరేకించి తనపై విమర్శలు చేసినా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి రేవంత్‌ రెడ్డి అవన్నీ మరిచిపోయి వెనక్కి తగ్గిన విషయం విదితమే. ఇదే సమయంలో నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతోనే రేవంత్‌ ప్రభుత్వానికి ముప్పు ఉన్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పదే పదే చేస్తున్నవ్యాఖ్యలు వాస్తవం కాదని నిరూపించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోనే తమ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉంటుందని, పదేళ్లు రేవంతే సీఎంగా ఉంటారని అనేలా చేశారు. అలాగే రాజగోపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడే భువనగిరి లోక్‌సభ ముఖ్యనాయకులతో చర్చించారు. నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ని ఎంపీగా గెలిపించాలని సూచించారు. బూత్‌ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు మూడంచెల సమన్వయ కమిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఐక్యంగా పనిచేయాలన్నారు. భువనగిరి టికెట్‌ కోసం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మీ టికెట్‌ కోసం చివరి వరకు పోటీ పడ్డారు. అయితే నేతల మధ్య విభేదాలున్నాయని, అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్‌ సహకరించకపోవచ్చనే విపక్ష నేతలు చేస్తున్న ప్రచారానికి చెక్‌ పెట్టారు. నేతలంతా ఒక్కతాటిపైనే ఉన్నారని, పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి అందరూ కృషి చేస్తున్నారనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపారు.

లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని సీఎం ధైర్యంగా చెప్పారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన జనజాతర సభ నుంచే ఎన్నికల శంకారావాన్ని పూరించారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అధిష్ఠానం అభ్యర్థులను ఎంపిక చేస్తున్నదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ గత పాలనా వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ… సామాజిక న్యాయం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమౌతుందని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఎన్నికల హామీలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే కొన్ని అమలు చేశామని లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మరిన్ని ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. ఇట్లా ప్రచారంలో తనదైన మాటలతో ప్రత్యర్థులపై తూటాలు పేలుస్తూనే పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.