అదానీతో రేవంత్‌ అలయ్‌ బలయ్‌.. కేటీఆర్‌ ఫైర్‌

కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

అదానీతో రేవంత్‌ అలయ్‌ బలయ్‌.. కేటీఆర్‌ ఫైర్‌
  • బీజేపీ ఆదేశాలతోనే అదానీతో ఒప్పందాలు
  • కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు
  • వాటిని రాష్ట్ర ప్రజానీకానికి వివరించాలి
  • ఎన్నికలప్పుడు అదానీని విమర్శించిన రేవంత్‌
  • ఇప్పుడు పెట్టుబడుల కోసం రెడ్‌కార్పెట్‌
  • అదానీపై కాంగ్రెస్‌ వైఖరి ఎందుకు మారింది?
  • ఆర్నెల్లలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఖాయం
  • మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ 

విధాత: కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆరెస్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకు ప్రధాని, అదానీ ఒకటే అని రేవంత్‌రెడ్డి మాట్లాడారని, ఇవాళ దావోస్‌ సాక్షిగా అదానీతో అలయ్‌ బలయ్‌ చేసుకున్నారని విమర్శించారు. బీజేపీ ఆదేశాల మేరకే అదానీతో రేవంత్‌రెడ్డి కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. 13 లక్షల కోట్ల రూపాయలు దోచిన అదానీ డబ్బులన్నీ ప్రధానమంత్రికి, బీజేపీకి పోతాయని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడారని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఎన్నికల ముందు అదానీని ఒక దొంగ అన్నరేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన పెట్టుబడులకు రెడ్‌కార్పెట్‌ పరిచారని ఆరోపించారు. ఇలాంటి అవకాశవాద, దిగజారుడు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదని విమర్శించారు.


ఒకవైపు రాహుల్ గాంధీ.. మోదీ-అదానీ ఒక్కటే అంటున్నారని, కాంగ్రెస్ ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ.. ఇక్కడ మాత్రం ఎందుకు కలిసి పనిచేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలో లేనప్పుడు అదానీ దేశానికి శత్రువు అన్న కాంగ్రెస్ పార్టీ.. మరి ఇప్పుడు అదే అదానీతో ఎందుకు పనిచేస్తున్నదని నిలదీశారు. అదానీ పట్ల మారిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి కారణాలు ఏంటో చెప్పాలన్నారు. బండి సంజయ్ బహిరంగంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేసి బీఆరెస్‌ను బొందపెట్టాలనడం ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని, కాంగ్రెస్‌ 420 హామీలను ప్రజలకు పార్టీ శ్రేణులు ఎప్పుడూ గుర్తు చేస్తుండాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రూ.2లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారని.. ఇప్పుడు రుణమాఫీ దశలవారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని విమర్శించారు. ఎరువుల కోసం రైతులు లైన్‌లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. 

అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించాం

బీఆరెస్‌ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రైతుబంధు చెల్లిస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేయలేదని విమర్శించారు. ఎరువుల కోసం రైతులు మళ్లీ లైన్లలో నిలబడే రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు పార్టీకి బలమైన నాయకత్వం, ప్రాతినిధ్యం ఉందని, ఇంతటి బలమైన పార్టీని తిరిగి గెలుపు బాటలో నడపడం పెద్ద కష్టమేమీ కాదని స్పష్టం చేశారు.