మీ స్పందనతో తల్లి బిడ్డ క్షేమం ఆర్టీసీ సిబ్బందికి … సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
కరీంనగర్ బస్ స్టేషన్‌లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సకాలంలో సిబ్బంది స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఆర్టీసీ సిబ్బందికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
విధాత, హైదరాబాద్ : కరీంనగర్ బస్ స్టేషన్‌లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సకాలంలో సిబ్బంది స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని, వారికి అభినందనలు తెలుపుతూ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఊరి కెళ్లేందుకు వచ్చిన ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండ్‌లో నొప్పులు పడుతుంటే ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వాహనం వచ్చే లోపే సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. దీంతో వీరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ ఘటనకు సంబంధించి ఆర్టీసీ సిబ్బందిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. పరిమళించిన మానవత్వం అంటూ తాజాగా ట్వీట్ చేశారు. టీజీఎస్ ఆర్టీసీ మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయమని, మీరు సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడం లోనే కాదు.. మానవత్వం చాటుకోవడంలోనూ మేం ముందు ఉంటామని ఆర్టీసీ సిబ్బంది మరోసారి నిరూపించారని హర్షం వ్యక్తంచేశారు.