Crop loan waiver | రైతు రుణమాఫీ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో రైతు రుణమాఫీ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జులై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించబడుతాయి. 77 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూ. 31 వేల కోట్ల రుణమాఫీ జరగలేదు.

హైదరాబాద్ : తెలంగాణలో రైతు రుణమాఫీ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జులై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించబడుతాయి. 77 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూ. 31 వేల కోట్ల రుణమాఫీ జరగలేదు. ఇది తెలంగాణలో మా ప్రభుత్వం చేసింది.. ఇది దేశ చరిత్రలోనే రికార్డు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో రెండో విడుత రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా రేవంత్ ప్రసంగించారు.
ఇవాళ తెలంగాణలో ఉన్న రైతుల ఇండ్లలో పండుగ జరుగుతుంది. రైతుల రుణాలు మాఫీ చేయడంతో మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. పార్టీలకు అతీతంగా రైతులకు యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే సీపీఐ, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే రైతు ప్రయోజనమే ముఖ్యమని పాల్గొన్నందుకు వారిని అభినందిస్తున్నా. దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల అప్పులు పొంది వ్యాపారాల్లో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకులకు రుణాలు ఎగవేసి దేశం వదిలి పారిపోతున్నారు. బ్యాంకులను మోసగించాలనే ఉద్దేశంతో వారిని మభ్యపెట్టి ఈ పదేండ్లలో 14 లక్షల కోట్ల రూపాయాలు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేశాయి. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా హర్యానా కావొచ్చు, పంజాబ్ కావొచ్చు.. మహారాష్ట్ర కావొచ్చు, తెలంగాణ కావొచ్చు.. రైతు పది మందికి సహాయ పడేందుకు, పది మందికి పట్టేడు అన్నం పెట్టేందుకు.. తాను అప్పుల పాలైన సరే మిగతా వారికి ప్రయోజనం చేకూరాలని రుణాలు తీసుకుని పంటలు పండిస్తే వాటికి గిట్టుబాటు ధర రాకపోవడం, ఉత్పత్తి సరిగా రాకపోవడమో వివిధ కారణాల చేత రైతులు నష్టపోయి, అప్పులు చెల్లించలేక, కుటుంబ సభ్యుల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరులు పండాలనే ఆలోచన చేస్తారో.. అదే పొలంలో ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకర సంఘలను ఎన్నో చూశామని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది మా చిత్తశుద్ధి.. ఇది మా పరిపాలన దక్షత..
రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దు అనే ఆలోచనలతో 2 లక్షల మాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మేం మాట్లాడిన అంశాలను చాలా మంది అవహేళన చేశారు. ఈ దేశంలో ఎవరూ చేయలేదు.. గత ప్రభుత్వం లక్ష మాఫీ చేస్తామని 5 ఏండ్లలో నాలుగు విడతల్లో చేశారు. ఆ పైసలు మిత్తీలకు సరిపోలేదు. ఆనాడు ధనిక రాష్ట్రం, నిధులకు కొరత లేకపోయినా.. రైతులకు న్యాయం జరగలేదు. రెండో సారి కూడా ఎన్నికలప్పుడు రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చి నాలుగు విడతల్లో చెల్లించి రూ. 7 వేల కోట్ల మొండి బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంది. ఏది ఏమైనా రెండు విడుతలుగా కలిపి రూ. 25 వేల కోట్ల గత ప్రభుత్వం చెల్లించకలేకపోయింది. మేం అధికారంలోకి రాగానే బ్యాంకుల నుంచి వివరాల తెప్పించుకుంటే రైతుల అప్పులు రూ. 31 వేల కోట్లు ఉందని తేలింది. ఈ రుణమాఫీ చేసి తీరుతామని చెప్పాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఏ విధంగా రుణమాఫీ చేస్తారని మాట్లాడారు.. శాపనార్థాలు పెట్టారు. అప్పుల గురించి తెలుసు కాబట్టి.. మేం చెల్లించలేమని చెప్పి మాకు సవాల్ చేశారు. మొత్తానికి వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపి రుణమాఫీ చేయాలని ఆదేశించాం. ప్రణాళికలు రచించి, అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి రెండో విడతలో 6198 కోట్లు నిధులు విడుదల చేశాం. ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది మా చిత్తశుద్ధి.. ఇది మా పరిపాలన దక్షత అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశ భద్రత, ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం..
కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత, ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్లాం. నెహ్రూ హరిత విప్లవాన్ని తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. భాక్రానంగల్ డ్యాం నుంచి నల్లగొండలోని నాగార్జున సాగర్ వరకు నెహ్రూ ప్రధానిగా తొలినాళల్లోనే రైతుల కష్టాలను గుర్తించి ఎడారిగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులుగా మార్చాలని సాగునీటి ప్రాజెక్టులను తీర్చిదిద్దారు. ఇందిరా గాంధీ హయాంలో రైతాంగానికి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారు. సోనియా, మన్మోహన్ సింగ్ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి 72 వేల కోట్ల రుణాలు ఏకకాలంలో మాఫీ చేశారు అని సీఎం రేవంత్ గుర్తు చేశారు.
31 వేల కోట్ల రుణాలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రం మాఫీ చేయలేదు..
ఈ రోజు వేదిక మీద నుంచి గర్వంగా చెబుతున్నాను. ఆహార భద్రత చట్టాన్ని, ఎరువులు, విత్తనాల సబ్సిడీని, ఉచిత కరెంట్‌ను, రైతు రుణమాఫీ, పంటల బీమా, రైతు బీమా, కనీస మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలను అమలు చేశాం. ఇది మా చిత్తశుద్ధి.. మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. మా ప్రణాళికలను ప్రశ్నించలేరు. జులై 18న మొదటి విడతలో భాగంగా లక్ష లోపు రుణాలు మాఫీ చేశాం. రెండు వారాలు కూడా పూర్తి కాలేదు ఇవాళ లక్షన్నర వరకు మాఫీ చేస్తున్నాం. నెల తిరగక ముందే 18 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ది నిరూపించుకున్నాం. 2 లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు నెలలోనే చేసి చూపిస్తాం. జులై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించబడుతాయి. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో 31 వేల కోట్ల రుణమాఫీ చేయలేదు. ఇది మా ప్రభుత్వం చేసింది ఇది దేశ చరిత్రలోనే రికార్డు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.