వరాల హామీలకు వేళాయే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనాకర్షక పథకాల వరాలను గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు సుదీర్ఘంగా కసరత్తు చేసి పోటాపోటీ హామీలతో మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి

వరాల హామీలకు వేళాయే..!
  • రేపు కాంగ్రెస్ మ్యానిఫెస్టో
  • ఎల్లుండే బీజేపీ మ్యానిఫెస్టో


విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనాకర్షక పథకాల వరాలను గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు సుదీర్ఘంగా కసరత్తు చేసి పోటాపోటీ హామీలతో మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. అధికార బీఆరెస్ పార్టీ ఇప్పటికే తన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించే ప్రచార పర్వంలో దూసుకెలుతుంది. బీఎస్పీ సైతం ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది. అందరికంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తొలుత ఆరు గ్యారంటీలను ప్రకటించి ప్రచార క్షేత్రంలో కదనోత్సహంతో సాగుతుండగా, వాటికి తోడుగా తన ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించేందుకు సిద్ధమైంది.


రేపు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగ సభలో ఖర్గే పాల్గొంటారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. ఇందుకోసం ఆయన రెండు నెలలుగా సుదీర్ఘ కసరత్తు చేసి, వివిధ వర్గాల ప్రజలతో భేటీయై వారి అవసరాలు, ప్రాధాన్యాతలను అనుసరించి మ్యానిఫెస్టోకు మెరుగులద్దారు.


ఆరు గ్యారంటీలకు అదనంగా మ్యానిఫెస్టోలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరిన్ని జనాకర్షక హామీలను పొందుపరిచింది. వాటిలో ప్రధానంగా ఆడపిల్లల పెళ్లికి పసుపు కుంకుమ పథకం కింద లక్ష ఆర్ధిక సహాయంతో పాటు తులం బంగారం, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ, అమ్మహస్తం పేరుతో 9నిత్యావసర సరుకుల పంపిణీ, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, అభయ హస్తం పథకం పునరుద్దరణ, ఎంబీసీలకు ప్రత్యేక కార్పోరేషన్‌, విద్యార్థులకు ఉచిత ఇంటర్ నెట్‌, ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు, ఉద్యోగాల కల్పన, ఆటో వాళ్లకు ఆర్ధిక సహాయం, ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డు, గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం, ధరణి స్థానంలో భూ భారతి పేరుతో సరికొత్త యాప్‌, సిటిజన్ చార్ట్‌కు చట్టబద్ధత, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు ఫ్రీ మెట్రో ప్రయాణ వసతి కల్పన, రైతులకు 2లక్షల రుణమాఫీ వంటి సరికొత్త హామీలున్నాయి.


ఎల్లుండే బీజేపీ మ్యానిఫెస్టో విడుదల


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలకు సంబంధించి బీజేపీ రూపొందించిన మ్యానిఫెస్టోను శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా విడుదల చేయనుంది. 18వ తేదీన ఉదయం హైద్రాబాద్‌లో 9గంటలకు అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం గద్వాల, ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎన్నికల సభల్లో అమిత్ షా పాల్గొంటారు.


అదే రోజు సాయంత్రం ఎమార్పీఎస్ నేతలతో అమిత్ షా భేటీ అవుతారు. బీజేపీ మ్యానిఫెస్టోలో బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ, పంటల బీమా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, పెళ్లయిన మహిళలకు ఏడాదికి 12,000, , 500కే సిలిండర్, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 20000, టీఎస్పీఎస్సీ ద్వారా రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ వంటి పథకాలతో పాటు మరికొన్నివివిధ వర్గాల ప్రజలకు సంబంధించి సరికొత్త సంక్షేమ పథకాలను బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.