మునుగోడు గడ్డ నా ఊపిరి: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు గడ్డ నా ఊపిరి: రాజగోపాల్ రెడ్డి

– ఆత్మగౌరవం కోసమే కాంగ్రెస్ పార్టీలోకి

– కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ పంపడమే లక్ష్యం

– మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మునుగోడు గడ్డమీద మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ కు పంపడమే తన ఏకైక లక్ష్యమని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం చండూరు మండలకేంద్రంలో అశేష జనవాహిని మధ్య కార్యకర్తలు, అభిమానులతో భారీ ప్రదర్శనగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, కార్యకర్తల కోసం తన ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. అభివృద్ధి విషయంలో నిధులు ఇవ్వకపోతే ప్రజల కోసం పదవిని త్యాగం చేశానన్నారు. ఆత్మగౌరవం కోసమే పార్టీ మారాను తప్ప, స్వలాభం కోసం కాదన్నారు. తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాను తప్ప, పదవిని అడ్డం పెట్టుకుని పార్టీలు మారలేదని ప్రజలకు స్పష్టం చేశారు. తాను రాజీనామా చేయడంతోనే నియోజకవర్గానికి కేసీఆర్ నిధులు కేటాయించారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.


18 వేల కోట్లకు అమ్ముడుపోయానని నాపై ప్రచారం చేసిన కేటీఆర్.. ఇంకో నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నీ లక్ష కోట్ల అవినీతిని కక్కిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణలో ఎగరేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పదవిలోఉన్నా చేయలేని పని, నేను రాజీనామా చేసి ఆ పనులను చేశానని.. ఈసారి నల్గొండలో ఒక్క బీఆర్ఎస్ సీటు కూడా గెలవదన్నారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామని, బీఆర్ఎస్ దుకాణం మొత్తం ఖాళీ అయిపోయిందన్నారు. బీజేపీ, బీఆరెస్ ఒకటయ్యాయని, అందుకే కవిత కేసు పక్కకు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజలంతా తనకు ఓట్లు వేసి గెలిపిస్తే మరో సిరిసిల్లగా మునుగోడును తయారు చేస్తారని చెప్పారు. కమ్యూనిస్టులు కూడా తోడయ్యారు కనుక ఈసారి గెలుపు తనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు.