25న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ
తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితాపై ఢిల్లీ వేదికగా ఆదివారం సుదీర్ఘ కసరత్తు సాగింది. స్క్రీినింగ్ కమిటీ సమావేశంలో రెండో విడత అభ్యర్థుల ఖరారుపై చర్చించింది

- ముగిసిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం
- లెఫ్ట్‌తో తేలని సీట్ల సర్ధుబాటు
విధాత : తెలంగాణ కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితాపై ఢిల్లీ వేదికగా ఆదివారం సుదీర్ఘ కసరత్తు సాగింది. స్క్రీినింగ్ కమిటీ సమావేశంలో రెండో విడత అభ్యర్థుల ఖరారుపై చర్చించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, మాణిక రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, భట్టిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వరుసగా రెండో రోజు భేటీయైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు నిర్వహించింది. ఇప్పటికే 55మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస పార్టీ మిగిలిన 64మంది అభ్యర్థుల ఖరారుపై కసరత్తు ముమ్మరం చేసింది.
35-40సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తుంది. అలాగే సీపీఐ, సీపీఎంలకు, టీజేఎస్‌కు కేటాయించే సీట్లపై కూడా చర్చించారు. అయితే సీపీఐ కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించగా, ఆ పార్టీ మునుగోడు స్థానాన్ని కోరుతుంది. సీపీఎంకు వైరా, మిర్యాలగూడలు ఇస్తామనగా ఆ పార్టీ పాలేరు, మిర్యాలగూడ కోరుతుంది. దీంతో లెఫ్ట్ సీట్లపై ప్రతిష్టంభన కొనసాగుతుంది.
ఈ భేటీలో కూడా కాంగ్రెస్ రెండో జాబితాపై స్పష్టత రాకపోవడంతో ఈనెల 25న జరుగనున్నపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)లో చర్చించి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. అదే రోజు లేక మరుసటి రోజున కాంగ్రెస్ రెండో జాబితాతో పాటు లెఫ్ట్ సీట్లను వెల్లడిస్తారని పార్టీ వర్గాల కథనం.