పథకాల అమలుకు త్రిముఖ వ్యూహం!
గత బీఆరెస్ ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారం మోస్తూ తన హామీల అమలుకు ఆదాయం సమకూర్చుకోవాల్సిన ప్రభుత్వం.. అందుకు బహుళ మార్గాలు అన్వేషిస్తున్నది

- కొత్త అప్పులు, కేంద్ర నిధులు, సొంత ఆదాయం పెంపు..
- ఎఫ్‌ఆర్బీఎం పరిమితి సడలిస్తేనే కొత్త అప్పులు
- తగ్గిన కేంద్రం గ్రాంట్లు, రాష్ట్ర సొంత రాబడి
- ఆశాజనకంగాలేని రిజిస్ట్రేషన్ల ఆదాయం
- రియల్ బూమ్ పెంచేందుకు భారీ కసరత్తు
- ఆఖరి అంశంగా విద్యుత్తు చార్జీల పెంపుదల!
విధాత: గత బీఆరెస్ ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారం మోస్తూ తన హామీల అమలుకు ఆదాయం సమకూర్చుకోవాల్సిన ప్రభుత్వం.. అందుకు బహుళ మార్గాలు అన్వేషిస్తున్నది. ఒక వైపు కొత్త అప్పుల కోసం ప్రయత్నం చేస్తూనే మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంపై దృష్టిసారించింది. దానితోపాటు రాష్ట్ర ఆదాయ వనరులను పెంపొందించుకోవడం అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్రమోదీని కలవడం ఇందులో భాగమే.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల మంజూరుకు వినతిపత్రం అందించిన ఉభయ నేతలు.. ప్రధానంగా 2015 -19; 20 -21 కి సంబంధించి 450 కోట్ల రూపాయల గ్రాంట్లతో పాటు రాష్ట్రానికి రావాల్సిన మరో 2,250 కోట్ల రూపాయల గ్రాంట్లు త్వరగా విడుదల చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.2,233.54 కోట్ల 15 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారుల అప్‌గ్రెడేషన్ కోసం పంపిన 14 ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి 1900 కోట్లు నిధులు కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడా కోరారు.
తగ్గిన రాబడులు.. పెంచుకోవడంపై ఫోకస్
కాగ్ నవంబర్ నెల నివేదిక ప్రకారం రాష్ట్ర రాబడులు నవంబర్ నాటికి 1,49,316.40 కోట్లు వచ్చాయి. ముందుగా అంచనా వేసుకున్నదాంట్లో ఇది 57.46% మాత్రమే. మూలధన రెవెన్యూ రాబడుల కింద మొత్తం 2,59,861.91 కోట్లు అంచనా వేస్తే 1,49,316.41 కోట్లు వచ్చాయి. రెవెన్యూ రాబడుల కింద 2,16,586.97 కోట్లు వస్తాయని అంచనా వేయగా 1,11,141.37 కోట్లు వచ్చాయి. ఇందులో జీఎస్టీ 30.47 వేల కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్లద్వారా 93,505 కోట్లు, ఎక్సైజ్ సుంకాల ద్వారా 14,607 కోట్లు ఉన్నాయి. కేంద్ర పన్నుల్లో వాటా కింద 8,177 కోట్లు వచ్చాయి. వాటిలో పథకాల కోసం 56,037 కోట్లు, వేతనాల కోసం 26,548 కోట్లు, పెన్షన్ల కోసం 11,316 కోట్లు, సబ్సిడీల కోసం 6,156 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం 14,687 కోట్లు వ్యయం జరిగాయి.
కొత్త రుణాలకు గత ప్రభుత్వం దెబ్బ
కొత్త రుణాల దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గత ప్రభుత్వ విధానాలు గుదిబండగా తయారయ్యాయి. 2023 -24 బడ్జెట్‌లో గత బీఆరెస్ ప్రభుత్వం 40,615 కోట్ల అప్పును ప్రతిపాదిస్తే ఇందులో డిసెంబర్ నాటికి 39,551 కోట్లు తీసుకుంది. నవంబర్ నెల దాకా రాష్ట్రం 38,151 కోట్లు అప్పులు చేసిందని గురువారం విడుదల చేసిన కాగ్ నివేదిక పేర్కొంది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12న 500 కోట్లు, 19న మరో 900 కోట్లతో కలిపి మొత్తంగా 1400 కోట్ల రుణాన్ని తీసుకుంది. దీంతో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో అప్పులు పుట్టడం కష్టంగా మారిందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.
ఎఫ్‌ఆర్బీఎం పరిమితి సడలిస్తేనే కొత్త అప్పులు
రాష్ట్ర రుణ సేకరణ పరిమితి పూర్తి కావడంతో ఇకపై రుణం తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇచ్చే అవకాశం లేదు. దీంతో కొత్త రుణాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని కేంద్ర ఆర్థిక శాఖ సడలిస్తేనే మార్చి వరకు కొత్త రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నాయి. అప్పుడప్పుడు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేంద్రం సడలింపు ఇస్తున్నందున ఈ ఏడాది కూడా సడలింపు ఇవ్వవచ్చని భావిస్తున్నామని ఆ వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వం 2022 -23 రుణ సేకరణలో ఆ ఏడాది నవంబర్ నాటికి 49.7% మాత్రమే రుణాలు తీసుకోగా.. 2023-24లో ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగానే 99.78% రుణాలు తీసుకోవడం గమనార్హం.
తగ్గిన గ్రాంట్లు
గత బడ్జెట్లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 41,258 కోట్లు వస్తాయని అంచనా వేసింది. డిసెంబర్ ప్రారంభం నాటికి అందులో 10.98 శాతంగా 4,532 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా కింద రావాల్సిన సొమ్ము కూడా 58.29% మాత్రమే వచ్చాయి. 14,528 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా నవంబర్ నాటికి 58.29 శాతం మాత్రమే వచ్చాయి. రాష్ట్ర పన్నుల రాబడి కూడా 1,52,000 కోట్లకు బడ్జెట్లో అంచనా వేయగా డిసెంబర్ ప్రారంభం నాటికి 57.10% మాత్రమే వచ్చాయి.
రిజిస్ట్రేషన్లు పెరిగితేనే ఆదాయం
రాష్ట్ర సర్కార్‌కు ఆదాయం తెచ్చిపెట్టే వాటిలో స్టాంపుల రిజిస్ట్రేషన్ల శాఖ కీలకమైనది. దీనిద్వారా ఈ ఆర్థిక సంవత్సరం 18,500 కోట్ల రాబడి తీసుకురావాలని గత ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటివరకు 10,500 కోట్లు వచ్చాయి. మార్చి చివరి నాటికి ఇంకో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగితేనే అది సాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం రిజిస్ట్రేషన్లు కొనసాగితే టార్గెట్‌కు దాదాపు 4000 కోట్లు తగ్గే చాన్స్ ఉన్నదని పేర్కొంటున్నారు. గతేడాది నవంబర్‌లో దాదాపు 1.54 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా ఈసారి నవంబర్‌లో లక్ష మాత్రమే అయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి చివరినాటికి 8,000 కోట్లు రాబట్టడం కష్టంగానే కనిపిస్తున్నదని చెబుతున్నారు.
రియల్ బూమ్‌పై కసరత్తు
ఖాళీ అయిన రాష్ట్ర ఖజానాను నింపేందుకు కొత్త ప్రభుత్వం రియల్‌ఎస్టేట్ రంగంపైనా ఆశలు పెట్టుకున్నది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు వరుసగా లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో భూ క్రయవిక్రయాలు ఆశించిన స్థాయిలో జరిగే అవకాశం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇది రాష్ట్ర రాబడిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తేవడం ద్వారా భూములు ఇండ్ల విక్రయాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు.. కసరత్తులు కొనసాగిస్తుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు అవతల రీజినల్ రింగ్ రోడ్డు లోపల పరిశ్రమల ఏర్పాటుకు తగిన భూములు గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా కొంతమేర రియల్ ఎస్టేట్ బూమ్ పెంచేందుకు ఫోకస్ పెట్టిందని అంటున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్లు తీసుకురావడం, భవన నిర్మాణ అనుమతుల మంజూరులో మరిన్ని వెసులుబాట్లు కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పనతో రియల్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా అదాయాన్ని సమీకరించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని అధికారవర్గాలు తెలిపాయి. అటు రంగారెడ్డి ఫార్మాసిటీని రద్దు చేసి దాని స్థానంలో టౌన్‌షిప్ డెవలప్‌మెంట్ ద్వారా ఆ ప్రాంతంలో రియల్ బూమ్ పెంచే ఆలోచన ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఫార్మా సిటీని రద్దుచేయబోమని, దానిని స్ట్రీమ్‌లైన్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
కబ్జాకోరల్లో సర్కారీ భూములు
రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం హయాంలో 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లుగా గుర్తించిన ప్రభుత్వం విచారణలకు ఆదేశించింది. ఎక్కువగా జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లక్షల కోట్ల భూ స్కాంలను బయటపెట్టి, అదంతా కక్కిస్తామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో కబ్జాలకు గురైన భూములను రికవరీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాన్ని కూడా అన్వేషిస్తుందని అధికారులు తెలిపారు.
పన్నుల వడ్డనపైనా ఫోకస్?
రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం, అప్పులు భారం మీదపడటంతోపాటు.. ఎన్నికల నేపథ్యంలో రాబడి తగ్గిపోయింది. ఈ సమయంలో ఆరు గ్యారంటీల కోసం ప్రజల నుంచి లక్షల్లో దరఖాస్తులు వస్తుండటంపై ప్రభుత్వం పైకి గంభీరంగా కనిపిస్తున్నా.. లోలోన మథన పడుతున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆదాయ వనరులు పెంచేందుకు పన్నుల వడ్డన తప్పని పరిస్థితి కూడా తలెత్త వచ్చని అధికారులు అంటున్నారు. ఇందులో ప్రధానంగా విద్యుత్తు చార్జీల అంశం చర్చకు వస్తున్నది. ఏటా నవంబర్ 30వ తేదీలోగా తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే విద్యుత్తు టారిఫ్ ప్రతిపాదనలు.. వార్షిక ఆదాయ అవసరాల అంచనాలను డిస్కంలు విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించాల్సి ఉంటుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈఆర్సీ జనవరి రెండు వరకు గడువు పొడిగించింది. గడువు మంగళవారంతో ముగియనున్నా.. నూతన ప్రతిపాదన సమర్పించేందుకు కొత్త ప్రభుత్వం నుంచి డిస్కంలు ఇంకా అనుమతి పొందలేదు. దీంతో ఈ నెలాఖరు వరకు మరోసారి గడువు పొడిగించాలని డిస్కంలు కోరనున్నాయి.
అయితే డిస్కంలు 78,549 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 11,500 కోట్ల విద్యుత్తు సబ్సిడీ కొనసాగిస్తే వచ్చే ఏడాది మరో 16,632 కోట్ల నష్టాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ నష్టాలను అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం 31,632 కోట్ల సబ్సిడీలను డిస్కంలకు ఇవ్వాలి. లేదంటే లోటును పూడ్చుకునేందుకు విద్యుత్తు చార్జీలు పెంచుకునే అవకాశం కల్పించాలి. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేసి ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం.. ఈ మేరకు అదనంగా 3500 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో విద్యుత్తు చార్జీల పెంపు అనివార్యం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం కొసమెరుపు.