జోగు రామన్న కు గుణపాఠం చెప్పాలి
ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆరెస్ ఎమ్మెల్యే జోగు రామన్న గత 10 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడని, ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు

– సంక్షేమ పథకాల్లో బీఆరెస్ అవినీతి
– దళిత బంధు ఎంతమందికిచ్చారు?
– కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆరెస్ ఎమ్మెల్యే జోగు రామన్న గత 10 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడని, ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్‌లో నియోజకవర్గంలోని తర్నం గ్రామస్తులతోపాటు రూరల్ మండలం పరిధిలోని చిచ్‌ధరి ఖానాపూర్, పట్టణంలోని కేఆర్‌కే కాలనీ, దుర్గానగర్, ఇందిరానగర్, డాల్డా కంపెనీ కాలనీవాసులు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఆయన కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మ్మెల్యే జోగు రామన్న ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నాడని, అవి తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసిభారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతామని, అందరికీ న్యాయం చేసే దిశగా పథకాలను రూపొందిస్తామని అన్నారు. జోగు రామన్న నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. అవినీతి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరితే వెనకడుగు వేశాడని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత పాయల శంకర్, జోగు రామన్న ఇద్దరు దొంగలేనని, శరీరాలు వేరైనా వారివురి ఆత్మ ఒక్కటేనన్నారు. వారిని నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దని హితవు పలికారు. అర్హులైనవారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, దళితబంధు ఎందరికి ఇచ్చారని ప్రశ్నించారు. బీసీలకు ,మైనార్టీలకు ఆర్థికసాయం అందిందా అంటూ నిలదీశారు.
నవంబర్ 30న జోగు రామన్నకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అన్నారు. ఆరు గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేస్తామని భరోసా కల్పించారు. అందరూ చేతిగుర్తుకే ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఐనేని సంతోష్‌రావు, సయ్యద్ సుజాత్ అలీ, ఎంఏ షకీల్, ఆదివాసీ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షెడ్మకి ఆనంద్ రావు, నాగర్కర్ శంకర్, కొండూరి రవి, మానే శంకర్, రాజ్ మహమ్మద్, పెందూర్ ప్రభాకర్, యెల్టీ సన్నీరెడ్డి, శ్రీరామ్,షేక్ మన్సూర్, బూర్ల శంకర్, అన్నెల శంకర్, సమీ ఉల్లాఖాన్, రమేష్, జంగిలి ప్రవీణ్, మహమూద్, ఎంఏ ముఖీమ్, అంజద్ ఖాన్, కర్మ,రహీమ్ ఖాన్, అస్బాత్ ఖాన్, యాసం రాము, మజర్‌మైఉద్దీన్, మారుతీ, వసంత్ పవార్, సంజీవ్ రెడ్డి, పోతారాజు సంతోష్, ఆశారెడ్డి, సుభాష్‌రెడ్డి, గంగారాం పాల్గొన్నారు.