కోడ్ వచ్చే లోపే కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి
పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చే లోపే కాంగ్రెస్ తన ఎన్నికల హామీలు నెరవేర్చాలని, కోడ్ బూచీ చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోందని హరీశ్‌రావు డిమాండ్

- భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమే
- రేవంత్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలి
మాజీ మంత్రి టి.హరీశ్‌రావు
విధాత : పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చే లోపే కాంగ్రెస్ తన ఎన్నికల హామీలు నెరవేర్చాలని, కోడ్ బూచీ చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోందని బీఆరెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని, భవిష్యత్‌లో వచ్చేది మళ్ళీ మనమేనని కేడర్‌కు భరోసానిచ్చారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మించి అమలు చేయలేరన్నారు. కర్ణాటక లో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందన్నారు. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో కొనసాగి మళ్ళీ అధికారంలోకి రావడం అరుదని, రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌లలో ఐదేళ్లకే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందన్నారు.
మల్కాజ్ గిరిలో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడని, రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని, ఒక్క పైసా నిధులు తేలేదన్నారు. సీఎం రేవంత్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈ సారి గులాబీ జెండా ఎగిరి తీరాల్సిందేనన్నారు. మల్కాజిగిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలిచామని, ఇప్పుడు ఎంపీ సీటు గెలవాలన్నారు. ఇది పరీక్షా సమయమని, మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన అవసరముందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, కొన్ని చిన్న చిన్న కారణాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. 2009లో మనకు పది సీట్లే వచ్చాయని, ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా ? గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అన్నారు. బీఆరెస్‌కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కు అయ్యాయని, ఆ రెండు పార్టీల డ్రామాలు ఎండగట్టి పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు ఇప్పట్నుంచే నడుం బిగించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్దాలు ప్రచారం చేసి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయన్నారు. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కార్యకర్తలు ఈ సమావేశంలో అద్భుతంగా మాటాడారని, క్షేత్ర స్థాయి వాస్తవాలు చెబుతున్నారని, ఉద్యమకారులు మాట్లాడిన మాటలు పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేలా చేశారన్నారు. కీలకమైన పార్లమెంటు ఎన్నికల్లో మీరు కష్టపడి పని చేయాలని కేడర్‌ను కోరారు.