మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి

– ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
– కార్యకర్తల్లో ఆనందోత్సాహం
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎట్టకేలకు కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సామాజికవేత్త బత్తుల లక్ష్మారెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. గత కొద్దిరోజులుగా మిర్యాలగూడ స్థానానికి పోటీ అధికంగా ఉండడంతో పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి బీఎల్ఆర్ ను ప్రకటించింది.
దీంతో మిర్యాలగూడ పట్టణంలోకాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. కొద్దిరోజులుగా నరాలు తెగే ఉత్కంఠకు తెరపడడంతో కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అర్ధరాత్రి నుంచి పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు, మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈస్థానం కోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తో పాటు బత్తుల లక్ష్మారెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో ఇరువర్గాల కాంగ్రెస్ పెద్దలు తమ అనుచరుడికే కావాలంటూ పట్టుబట్టినప్పటికీ, చివరకు కాంగ్రెస్ అధిష్టానం బీఎల్ఆర్కే మొగ్గు చూపడంతో మిర్యాలగూడలో ఉత్కంఠ సమసిపోయింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించక ముందే బీఎల్ఆర్ వేలాది మంది అభిమానులతో నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.