కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యకు 15% నిధుల కేటాయింపు పట్ల హర్షం

విధాత: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యారంగం, బాలల సంక్షేమం కోసం బాలల హక్కుల సంక్షేమ సంఘం (బీహెచ్ఎస్ఎస్) ప్రతిపాదించిన అనేక అంశాలను పొందుపర్చడం పట్ల బీహెచ్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ. రఘునందన్ హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మండలానికో స్కూల్ ఏర్పాటు, విద్యార్ధులకు ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం, మూసివేసిన వేలాది ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడం, విద్యార్థులకు ఫ్రి ఇంటర్నెట్ సౌకర్యం, విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధుల కేటాయిస్తామని ప్రకటించడం పట్ల పేద బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యా ప్రగతికి ఈ చర్యలు ఎంతగానో తోడ్పడుతాయని అన్నారు.
మిగతా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిస్తే విద్యారంగానికి, బాలల విద్యా ప్రగతికి ఏమేం చేస్తామో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం వస్తున్న అభ్యర్థులు విద్యారంగ ప్రగతికి, బాలల వికాసానికి తామేం చేస్తామో ప్రకటించాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. బాలలకు ఓటు హక్కు లేకున్నా వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతా ఓటర్లేననీ, అది మర్చిపోవద్దని అన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను చిత్తశుద్ధితో అమలుకు కట్టుబడి ఉండాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం కోరుతోంది.