ఆధిక్యతలో కాంగ్రెస్…అయినా.. అప్రమత్తత అవసరం
రాష్ట్రంలో నేటికీ కాంగ్రెస్ కు ఆధిక్యత ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చామనే మత్తుతో ఏ మాత్రం అదామరిచినా అధ:పాతాళానికి చేరకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ లక్ష్యంగా బీఆరెస్, బీజేపీలు సకల

తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితి
ఓటింగ్ సరళిలో మార్పులుండే అవకాశం
రసవత్తరంగా పార్లమెంటు ఎన్నికలు
కాంగ్రెస్ కు చెయ్యందించనున్న మైనారిటీలు
కీలకం కానున్న మాదిగలు..ఆదివాసీలు
కాంగ్రెస్ వ్యతిరేకత పై కారు కేంద్రీకరణ
ప్రధాని మోదీ ఛరిష్మా పైన్నే బీజేపీ ఆశలు
విధాత : రాష్ట్రంలో నేటికీ కాంగ్రెస్ కు ఆధిక్యత ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చామనే మత్తుతో ఏ మాత్రం అదామరిచినా అధ:పాతాళానికి చేరకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ లక్ష్యంగా బీఆరెస్, బీజేపీలు సకల ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. ఈ రెండు పార్టీల ప్రయత్నాలు విఫలం కావాలంటే మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రజలను గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ మరోసారి క్షేత్రస్థాయిలో పనిచేస్తే సానుకూల పరిస్థితులు రానున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితులతో పాటు, ప్రతికూలతలు కూడా ఉన్నందున ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతకనబరుస్తున్నప్పటికీ ఆ పార్టీ సర్వే నిపుణులు..కేసీ వేణుగోపాల్ వంటి అధిష్టానం నేతలు మాత్రం విజయంపై అతివిశ్వాసం పనికారాదంటూ చేస్తున్న హెచ్చరికలు లోక్ సభ ఎన్నికల టఫ్ ఫైట్‌కు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పాలన, సిటింగ్ ఎమ్మెల్యేలపైన వ్యతిరేకతతో ప్రజలు ప్రత్యామ్నయంగా కాంగ్రెస్ మెజార్టీ సీట్లు కట్టబెట్టడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం స్వేచ్చాయుత ప్రజాపాలనకు బాటలు వేశారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలుకు అడుగు ముందుకేస్తున్నారు. ప్రజాదరణ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల పై కాంగ్రెస్ ధీమా
కాంగ్రెస్ పాలన..పథకాల అమలు పార్టీ జాతీయ మ్యానిఫెస్టో అంశాలు తోడై పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామన్ని ధీమాతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఆదరణ పార్లమెంటు ఎన్నికల్లోనూ చూపుతారన్న నమ్మకం నాయకత్వం కనబరుస్తుంది. అదిగాక అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆరెస్ నుంచి భారీగా సాగుతున్న బీఆరెస్ ఎంపీలు..ఎమ్మెల్యేల నుంచి నియోజకవర్గంలో కీలకమైన నాయకులు, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల చేరికతో పార్టీ బలం పెరిగిందనే అంచనాతో ఉన్నారు.
కీలకంగా మారిన మైనార్టీలు
మొన్నటి ఎన్నికల్లో మైనార్టీలు అటు బీఆరెఎస్, ఇటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినప్పటికీ తాజాగా మారిన పరిస్థితుల్లో మైనార్టీల్లో కాంగ్రెస్ పై విశ్వాసం పెరుగుతోంది. బీజేపీపై వ్యతిరేకత నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తమకు కాంగ్రెస్‌తో పొత్తు లేదని చెప్పినప్పటికి, అనధికారికంగా ఆ పార్టీతో కలిసి సాగుతున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. అటు అవినీతి ఫోన్ ట్యాపింగ్ కేసులలో పీకలలోతు కూరుకుపోయిన బీఆరెస్ పార్టీ బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి లేదని కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే అంశం రాజకీయ వర్గాలలో చర్చజరుగుతోంది.
రాష్ట్రంలో 14శాతం ముస్లిం మైనార్టీ ఓటర్లు 2014, 2018 ఎన్నికల్లో బీఆరెస్‌కు మద్దతుగా నిలిచారు. 2023లో మాత్రం కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్య మైనార్టీ ఓట్లు చీలిపోయాయి. పాతబస్తీ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెంగ్మెంట్‌లలో ముస్లిం మైనార్టీలు 50నుంచి 80శాతం వరకు ఉన్నారు. పాతబస్తీ బయట మరో 13నియోజవర్గాల్లో 20శాతం, 21నియోజకవర్గాల్లో 15-20శాతం, 28స్థానాల్లో 10నుంచి 15శాతం ఓటర్లున్నారు. జిల్లాల వారిగా చూస్తే గ్రేటర్ పరిధిలో 43శాతం, ఆదిలాబాద్, నిజమాబాద్, మహబూబ్‌నగర్‌లలో 34శాతం, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 20నుంచి 28శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. తాజా ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ ఓటర్లు కీలకం కానున్నారు.
టికెట్ల పై అసంతృప్తిలో మాదిగలు
కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దళిత, గిరిజన, ఆదివాసీలు గట్టి ఓటు బ్యాంకుగా కొనసాగుతుండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆరెస్ వైపు మొగ్గడంతో గత రెండు పర్యాయాలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ, దళితులు కాంగ్రెస్ వైపు రావడం..మరికొందరు బీజేపీ వైపు ఆకర్షితులవ్వడంతో బీఆరెస్ ఆ మేరకు ఎన్నికల్లో నష్టపోయింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదనే విమర్శలున్నాయి. తెలంగాణలో 80లక్షల మంది మాదిగలున్నారు. కీలకమైన మాదిగలను కాంగ్రెస్ విస్మరించినందున ఆ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీకి ఓటెయ్యాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. అయితే కృష్ణమాదిగ మాదిగల పక్షాన మాట్లాడినప్పటికీ బీజేపీకి మద్ధతునివ్వడం విమర్శలకు తావిస్తోంది. కృష్ణమాదిగను మాదిగలు విశ్వసిస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఫలితాలు తారు మారయ్యేవి. ఈ విషయాన్ని గుర్తించి మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారు. ఇది ఏ మేరకు ఫలితమిస్తుందోననే చర్చ సాగుతోంది. వలస అభ్యర్ధులకు టికెట్లు, పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపులు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అతివిశ్వాసంతో వ్యవహరిస్తే మొదటికే మోసమొచ్చే అవకాశం ఉందంటున్నారు.
కాంగ్రెస్ పై బీఆరెస్ విమర్శలదాడి
బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు కాంగ్రెస్ సర్కార్‌పైన విమర్శలు తీవ్రం చేశారు.కరవు, సాగు, తాగునీటి సమస్యలు..కాంగ్రెస్ ఎన్నికల హామీలను అస్త్రాలుగా విమర్శల దాడి ప్రజల్లో కొంత ప్రభావం చూపితే కాంగ్రెస్ ఓట్లకు గండిపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ధరణి రద్దు..కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ సహా పలు బీఆరెస్ పథకాల అక్రమాలపై విచారణ చేపట్టి దోషులను శిక్షిస్తామని చెప్పినప్పటికీ స్ వంద రోజుల పాలనలో ఎలాంటి చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో కొంత అసంతృప్తికి కారణమవుతోంది.
తారు మారైన ఓటు బ్యాంకు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్‌లు సాధించిన ఓట్ల శాతం తాజాఎన్నికల్లో మారితేనే ఆ పార్టీలు పెట్టుకున్న అంచనాలు ఫలించనున్నాయి. కాంగ్రెస్‌కు, బీఆరెస్‌కు మధ్య కేవలం 2 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని, ప్రస్తుతం కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ప్రజల్లో, రైతుల్లో నెలకొన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ ఆ మేరకు ఓట్లు నష్టపోతే తమకు ఈ ఎన్నికల్లో లాభం చేకూరుతోందని బీఆరెస్ ఆశలు పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాలను గెలవలేదని భావిస్తున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజమాబాద్, అదిలాబాద్‌లలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో లోక్‌సభ స్థానాల గెలుపుపై ధీమాగా ఉంది.
మారిన రాజకీయ పరిస్థితి
అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా సాగుతున్న వలసలతో ఆ పార్టీ బలహీన పడిందనే అంచనాతో ఉన్నారు. బీఆరెస్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పడిందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లలో ఎంపీ స్థానాల గెలుపుపై ఆశాభావంతో ఉంది. కాంగ్రెస్ కీలక నేత కే.సీ. వేణుగోపాల్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది. బీజేపీతోనే పోటీ ఉన్నందున ఆ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. ఇదే నిజమైతే బీఆరెస్ నష్టపోయే అవకాశం ఉంది.
మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌కే
2019లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 3, బీఆరెస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానం గెలిచాయి. 2023అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 లోక్‌సభ స్థానాలు పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, మహాబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాల్లో మెజార్టీ అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ సాధించింది. మల్కాజ్‌గిరి, మెదక్, చేవెళ్ల లోక్‌సభ స్థానాల పరిధిలో మెజార్టీ సీట్లు బీఆరెస్ గెలుచుకున్నా అప్పటి ఓట్ల శాతం ఇప్పుడుందన్నది సందేహామేనంటున్నారు .
భారీగా ఉన్న బీజేపీ అంచనా
ఇదిలా ఉండగా బీజేపీ కోణంలో 2018 ఎన్నికలతో పోలిస్తే 7శాతం ఓట్ల నుంచి 14శాతం మేరకు పెరిగిన బలంతో కనీసం ఏనిమిది ఎంపీ సీట్లయినా గెలుస్తామని అంచనా వేస్తుంది. నిజామాబాద్, అదిలాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలు గెలవడంతో పాటు ఆ పార్టీ 58స్థానాల్లో 20వేల నుంచి 1లక్షకు పైగా ఓట్లు సాధించడంతో పార్టీ బలం మరింత పెరిగిందని కమలనాథులు విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి. పెరిగిన ఓట్ల బలం..ప్రధాని మోదీ ఛరిష్మా, కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందనే విశ్వాసంతో ధిక సీట్లు గెలుచుకోవాలన్న ఆశతో బీజేపీ ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు సానుకూలంగా లేవనే విమర్శలున్నాయి.