మంచిర్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా?

శాసనసభ ఎన్నికల గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మున్సిపాలిటీలపై కన్నేసింది. మంచిర్యాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు హస్తగతమయ్యేలా పావులుకదుపుతున్నారు

మంచిర్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా?

– బీఆరెస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను పీఠం దించే వ్యూహం

– ఇప్పటికే కారుదిగిన పలువురు బీఆరెస్ కౌన్సిలర్లు

– మెజార్టీ స్థానాల కోసం మరికొందరిపై వల

– అవిశ్వాస తీర్మానంతో హస్తగతమయ్యే చాన్స్

– వేగంగా పావులుకదుపుతున్న కాంగ్రెస్ పెద్దలు

– మంచిర్యాలలో ఇప్పటికే కాంగ్రెస్ కౌన్సిలర్ల నోటీసులు

– లక్షెట్టిపేట, నస్పూర్ మున్సిపాలిటీల్లోనూ రంగం సిద్ధం?

– ఉనికి కోల్పోనున్న గులాబీ పార్టీ

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: శాసనసభ ఎన్నికల గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మున్సిపాలిటీలపై కన్నేసింది. మంచిర్యాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు హస్తగతమయ్యేలా పావులుకదుపుతున్నారు. జిల్లాకేంద్రమైన మంచిర్యాలతో పాటు నస్పూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీల్లో బీఆరెస్ పీఠమెక్కింది. ఇప్పటికే పాలకవర్గాలకు సుమారుగా నాలుగేళ్ల పదవీ కాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయా మున్సిపాలిటీల్లో బీఆరెస్ కు చెక్ పెట్టేందుకు స్కెచ్ వేసింది. బీఆరెస్ కౌన్సిలర్లకు గాలం వేసి కాంగ్రెస్ వైపు తిప్పుకోనున్నారు. ఈక్రమంలోనే అవిశ్వాస తీర్మానంతో గద్దె దించి, కాంగ్రెస్ కొలువుదీరేలా ప్రణాళికలు రూపొందించినట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

మారుతున్న రాజకీయ సమీకరణలు

అసెంబ్లీ ఎన్నికలు ముగియగా, మంచిర్యాలలో కాంగ్రెస్ జెండా ఎగరేసింది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీ మంచిర్యాలలో కాంగ్రెస్ తన అడ్డాగా మార్చుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. 4 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మంచిర్యాల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ కు నోటీసులు అందజేయడం దుమారం రేపింది. చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముకేశ్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నోటీసులిచ్చారు. ఈమున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా, కాంగ్రెస్ 26 మంది కౌన్సిలర్ల సంతకాలతో నోటీసులివ్వడంతో బీఆరెస్ పాలకవర్గం కుప్పకూలడం తథ్యమైంది. కలెక్టర్ 15 రోజులు గడువు ఇచ్చినా, 17 మంది బీఆరెస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో మంచిర్యాల పురపాలక సంఘంలో స్పష్టమైన మెజార్టీ వచ్చినట్లయ్యింది. అవిశ్వాసానికి క్యాంపు రాజకీయాలు కూడా అవసరంలేదని ఆపార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

లక్షెట్టిపేటలో గోడదూకిన ఇద్దరు బీఆరెస్ కౌన్సిలర్లు?

లక్షేట్టిపేట మున్సిపాలిటీలో సైతం అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పావులుకదుపుతోంది. ఈ మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్లు ఉండగా, గతంలో 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో నల్మాస్ కాంతయ్య చైర్మన్‌గా, శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజగా బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ లోకి రావడానికి రంగం సిద్ధమైంది. ఈక్రమలో ఒకటో వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరొక బీఆర్‌ఎస్ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీలో సైతం అతి త్వరలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి ఇద్దరు కౌన్సిలర్లు వస్తే 14 మంది కౌన్సిల్ లో 8 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉంటుంది. ఈనేపథ్యంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానం నెగ్గి, కాంగ్రెస్ పీఠమెక్కాక.. మరో మున్సిపాలిటీ నస్పూర్ ను కూడా వదిలేలా లేదు. ఇక్కడ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముచ్చటగా మూడో మున్సిపాలిటీ నస్పూర్?

నస్పూర్ మున్సిపాలిటీలో పాగా వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుండే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈమున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు సభ్యులుగా ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ కౌన్సిలర్ ఆరుగురు మాత్రమే. అయినప్పటికీ మరో 2 సీపీఐకి ఉండడంతో కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ బలం 8కి చేరనుంది. దీనికి తోడు బీఆర్ఎస్ కు చెందిన 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నలుగురితో మంతనాలు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానానికి తెరలేపాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఒకటి, రెండు నెలల్లో మంచిర్యాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు హస్తగతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు స్థానికంగా చర్చ జోరందుకుంది. ఇదే జరిగితే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఉనికి కోల్పోనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.