బనకచర్లకు బీఆర్ఎస్సే కారణం: డిప్యూటీ సీఎం భట్టి

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ రూ. 1 లక్ష కోట్లు దాటించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పీసీ ఘోష్ నివేదికపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం చర్చలో పాల్గొన్నారు

బనకచర్లకు బీఆర్ఎస్సే కారణం: డిప్యూటీ సీఎం భట్టి

విధాత: బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్లతో కట్టిన ఏకైక ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును దగ్గరుండి కట్టించినందుకు హరీశ్ రావును కాళేశ్వరరావుగా పిలిచారని ఆయన గుర్తు చేస్తూ ఇవాళ నిజాలు చెప్పలేక మేడిగడ్డ ప్రాజెక్టు మాదిరిగానే హరీశ్ రావు కూడా కుంగిపోతున్నారని ఆయన అన్నారు.  పీసీ ఘోష్ నివేదికపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం చర్చలో పాల్గొన్నారు. తాను మాట్లాడే ప్రతి అంశం జస్టిస్ ఘోష్ నివేదికలోని అంశాలేనన్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు పోయాయి.. డబ్బులు పోయాయని ఆయన అన్నారు. ఇప్పుడు బనకచర్ల నుంచి నీళ్లు వాడుకుంటున్నామని కిందవాళ్లు అంటున్నారన్నారు. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటున్నామని అంటున్నారని ఆయన చెప్పారు. దిగువ రాష్ట్రం బనకచర్ల కట్టుకుంటామని అనడానికి బీఆర్ఎస్ కారణమని ఆయన విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ రూ. 1 లక్ష కోట్లు దాటించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలిందని ఆయన విమర్శించారు. కమీషన్లు దండుకొనేందుకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుకుంటూ పోయారని ఆయన ఆరోపించారు. దేశంలో హిరాకుడ్, భాక్రానంగల్, శ్రీశైలం,జూరాల, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టాయని ఆయన అన్నారు. 50,60 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా అలాగే ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు సాగు,విద్యుత్ ను అందిస్తోందన్నారు. నిజాం కాలంలో కట్టిన పోచారం ప్రాజెక్టు కూడా భారీ వరదను తట్టుకొని నిలబడిందని ఆయన గుర్తు చేశారు. కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలంతా చూశారన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిందని ఆయన అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ విచారణకు పిలిస్తే వెళ్లి.. వాదనను వినిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న తర్వాతే పీసీఘోష్ నివేదికను ఇచ్చిందని డిప్యూటీ సీఎం తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజల సొమ్ము పట్ల బాధ్యత, జవాబుదారీతనం ఉందని చెప్పారు. రూ. 27 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత -చేవేళ్ల పూర్తి చేసి ఉంటే ఎంతో మేలు జరిగేదని ఆయన అన్నారు. కక్షసాధింపు ధోరణి ఉంటే ప్రాజెక్టు కూలినప్పుడే చర్యలు తీసుకొనేవాళ్లమన్నారు. అత్యంత పారదర్శకంగా న్యాయవిచారణ కమిషన్ వేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ తప్పులున్నందునే కోర్టుకు వెళ్లి నివేదిక అడ్డుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు. ఏ ప్రాజెక్టు అయినా ఇంజనీర్లు, సబ్జెక్టు నిపుణులు డిజైన్ చేస్తారని… కాళేశ్వరానికి మాత్రం కేసీఆర్, హరీశ్ రావు కలిసి డిజైన్లు చేశారని ఆయన విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకున్న నీళ్లకంటే లిఫ్ట్ చేసి వృధాగా వదిలేసినవే ఎక్కువ అని ఆయన అన్నారు. నీటిని లిఫ్ట్ చేసేందుకు వేల కోట్ల కరెంట్ బిల్లులు చేసి నీళ్లను వృధాగా వదిలేశారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఈ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బరాజ్ నిర్మాణం విషయంలో తమ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లారని సీడబ్ల్యూసీ ఆరోపించిందని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ప్రజాధనం రూ. 1.27 లక్షల కోట్లు వృధా చేయడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు. కాళేశ్వరం రిపోర్టును బయటకు రాకుండా ఆపాలని కోర్టుకు వెళ్లారని ఆయన విమర్శించారు. రిపోర్టు బయటకు వస్తే తప్పులన్నీ బయటకు వస్తాయని కోర్టుకు వెళ్లారని ఆయన దుయ్యబట్టారు. 20కిపైగా ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరిట అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు. రూ. 1400 కోట్లతో పూర్తయ్యే ఇందిరాసాగర్ ను రూ. 19 వేల కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి సాగునీరు ఇస్తున్న ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినవేనని ఆయన అన్నారు.