బీఆరెస్‌ ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలవడం వెనుక హరీశ్‌ స్కెచ్?

మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌కు చెందిన నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది

బీఆరెస్‌ ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలవడం వెనుక హరీశ్‌ స్కెచ్?
  • సీఎంతో నలుగురు బీఆరెస్‌ ఎమ్మెల్యే భేటీ వెనుక హరీశ్‌?
  • పార్టీ మార్పా? బీఆరెస్‌ పార్టీలో విభేదాలా?
  • మాజీ సీఎం సొంత జిల్లాల ఎమ్మెల్యేల వైఖరిపై సందేహాలు
  • సంచలనం రేపిన సీఎం రేవంత్‌రెడ్డితో బీఆరెస్ ఎమ్మెల్యేల కలయిక
  • మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై పావులు కదుపుతున్న హరీశ్‌రావు
  • బీఆరెస్‌లో పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు
  • ఎంపీ అభ్యర్థిగా వెంకట్ రాంరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న హరీశ్‌

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి : మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌కు చెందిన నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్‌కు తెలియకుండా ఇప్పటిదాకా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు ఎవరైనా ఒక్క అడుగు కూడా వేయని కట్టుదిట్ట పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అధినేతకు తెలియకుండా ఆ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని కలిసే ధైర్యం చేశారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంతో అసలు బీఆరెస్ పార్టీ లోపల ఏం జరుగుతుందన్న చర్చల రచ్చకు తెరలేచింది.

మెదక్ లోక్‌సభ సీటు పెట్టిన చిచ్చు?

ఇటీవల హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్, హరీశ్‌ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్‌ టికెట్ విషయమై చర్చకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. కానీ మాజీ సీఎం కేసీఆర్‌ మాత్రం మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని మెదక్ పార్లమెంటు బీఆరెస్‌ అభ్యర్థిగా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పనిలో పనిగా మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయించాలని కూడా అధిష్టాన వర్గం ఆలోచనగా తెలుస్తున్నది. అదే విధంగా కేటీఆర్‌ను మల్కాజిగిరి బరిలో నిలపాలని మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనగా తెలుస్తున్నది. ఇది గమనించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు మెదక్ లోక్‌సభ బరిలో వెంకట్రామ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా తన వర్గంగా భావిస్తున్న ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కే మాణిక్యరావులను సీఎం వద్దకు హరీశ్‌ రావునే పంపినట్లు ప్రచారం జరుగుతున్నది. తద్వారా పార్టీ అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి తేవాలన్న వ్యూహాన్ని హరీశ్‌ అమలు చేసినట్టు చర్చించుకుంటున్నారు. తనను రాష్ట్ర రాజకీయాల నుంచి క్రమంగా కనుమరుగు చేసేందుకే కేసీఆర్ తన పేరును ఎంపీగా పరిశీలిస్తున్నారన్న అసంతృప్తి ఒకవైపు, తన పరిధిలోని మెదక్‌లో తన ప్రమేయం లేకుండా అభ్యర్థి ఎంపిక కసరత్తు చేయడం మరొకవైపు హరీశ్‌రావులో అసహనం రేకెత్తించి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. అవునన్నా కాదన్నా మెదక్ పార్లమెంటు బీఆరెస్‌ పార్టీ సమావేశం నుంచే బీఆరెస్‌లో రచ్చ మొదలైందని, ఆ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డి పేరు ప్రతిపాదనకు రావడం మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించడం.. లేదా హరీష్ రావు ని పోటీ చేయమనడం హరీశ్‌రావుకు మింగుడు పడలేదని, అందుకే ఆయన తన వర్గంగా ఉన్న ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు పంపించారన్నవాదన వినిపిస్తున్నది. ఇటీవల పలువురు కాంగ్రెస్ మంత్రులు తమ అధిష్ఠానం అంగీకరిస్తే బీఆరెస్‌కు చెందిన 30మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మాట్లాడిన మాటలు సైతం ఈ సందర్భంగా గమనార్హం.

రేవంత్‌కు హరీశ్‌రావు అండనిస్తారా

రాష్ట్ర రాజకీయాల్లో మూడు రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లండన్ పర్యటన ఉన్నప్పుడు సీఎంకు వ్యతిరేక వర్గంగా భావిస్తున్న కొంతమంది మంత్రులు మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తూ చర్చలు జరిపారు. ఇది గమనించిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం సొంత జిల్లాలోని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. ఆ స్కెచ్‌లో భాగంగా హరీశ్‌ రావు నేరుగా రేవంత్ రెడ్డితో అంతరంగిక చర్చలు జరిపి తన వర్గం నలుగురు ఎమ్మెల్యేలను సీఎం వద్దకు మర్యాదపూర్వకంగా కలిసేందుకు పంపినట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్నది. ఇది ఇలా ఉండగా రేవంత్ రెడ్డికి, హరీష్ రావులకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరికీ మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా తిరుపతిలో సమావేశమైన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి అండగా ఉండేందుకు తన వర్గం ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డికి అనుకూలంగా హరీష్ రావు మారుస్తున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది.

కేటీఆర్, హరీశ్‌రావు మధ్య విబేధాలు?

బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య విబేధాలు గతం నుండే కొనసాగుతున్నాయన్న చర్చ ఉన్నది. హరీశ్‌రావకు తెలియకుండా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసే సాహసం చేయరనేది రాజకీయంగా అందరికీ తెలిసిన విషయమేనని అంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశామని చెబుతున్నప్పటికీ లోపల విషయాలు వేరుగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. బీఆరెస్‌ అధినేత కేసీఆర్ ఈ ఉదంతంపై దిద్దుబాటు చర్యలకు దిగి, వెంటనే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్‌మీట్ పెట్టి తాము అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామంటూ సన్నాయి రాగం వినిపింపచేశారు. అయితే అప్పటికే రాజకీయంగా జరుగాల్సిన నష్టం పార్టీకి, అధినేత కేసీఆర్‌కు జరిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు ఏ ఉద్ధేశంతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినా అధినేత కేసీఆర్‌కు తెల్వకుండా వారు సీఎంను కలిసే ధైర్యం చేయడమంటేనే బీఆరెస్‌లో ఏదో జరుగుతుందన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లయ్యింది.