దళిత మహిళపై అగ్రవర్ణాల వివక్షకు అడ్డుకట్ట వేయాలి
సూర్యాపేట మున్సిపాలిటీ చరిత్రలో ఓ దళిత మహిళ చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టడం అగ్రవర్ణాలకు దళితులు, మహిళల పట్ల ఉన్న వివక్షతను తెలియజేస్తుందని మాల మహానాడు

– ఏం అవినీతికి పాల్పడిందని మున్సిపల్ చైర్ పర్సన్ పై
అవిశ్వాసం పెట్టారో చెప్పాలి
– దళిత చైర్ పర్సన్ పై అవిశ్వాసాన్ని వెనక్కు తీసుకోవాలి
– మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్న నిఖిల దిలీప్ రెడ్డి
నివాసం ఎదుట దళిత మహిళల బైఠాయింపు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సూర్యాపేట మున్సిపాలిటీ చరిత్రలో ఓ దళిత మహిళ చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టడం అగ్రవర్ణాలకు దళితులు, మహిళల పట్ల ఉన్న వివక్షతను తెలియజేస్తుందని మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ అన్నారు. దళిత మహిళా మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో చైర్మన్ రేసులో ఉన్న 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి నివాసం ముందు మహిళలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించి బైఠాయించారు. ఈ సందర్భంగా భాగ్యమ్మ మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు దళిత చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన పెరుమాళ్ళ అన్నపూర్ణ నాలుగేళ్ల కాలంలో ఎలాంటి అవినీతి లేకుండా అందరికీ అందుబాటులో ఉండి పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారన్నారు.
రెండేళ్ల కరోనా కాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి, ప్రతి చిన్న విషయానికి స్పందించారని అన్నారు. అగ్రవర్ణాలకు చెందిన నాయకులు దళితుల పట్ల వివక్షను ప్రదర్శిస్తూ మహిళ అని చూడకుండా దళిత మహిళను పీఠంపై నుంచి దింపేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దళిత బిడ్డ పట్ల ఇలా చేయడం సరికాదని, అవిశ్వాసాన్ని వెనక్కు తీసుకొని పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు దళిత చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాసాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో అవిశ్వాసానికి మద్దతు పలికే ప్రతి కౌన్సిలర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణకు మద్దతుగా కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి ఇంటి వద్దకు పెద్దఎత్తున మహిళలు చేరుకోగా పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు కలగజేసుకుననారు. మహిళా కానిస్టేబుళ్ళచే మహిళలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో దళిత మహిళా నాయకురాలు బొడ్డు రజిని, జయమ్మ, షేక్ భాను శ్రీ, బోలెద్దు విజయ, వాంకుడోత్ నీలమ్మ, దళిత మహిళలు పాల్గొన్నారు.