కర్ణాటకకు రండి చూపిస్తాం..కేటీఆర్, కేసీఆర్‌కు డీకేసీ ఛాలెంజ్

- తేదీ చెప్పండి.. బస్సులో తీసుకెళతాం
- 5 గ్యారెంటీలు అమలు మీరే చూడొచ్చు
- కేసీఆర్, కేటీఆర్‌కు డీకే ప్రతిసవాల్
- నెలరోజుల్లోనే హామీలన్నీ అమలు చేశాం
- తెలంగాణలోనూ అమలు చేస్తాం
- ప్రజల కోసం రాష్ట్రం ఇచ్చిన సోనియా
- వారి ఆకాంక్షలు నెరవేర్చని కేసీఆర్
- రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం
- కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో రెస్టు తీసుకోవడమే
- కాంగ్రెస్ విజయభేరి సభలో కర్ణాటక నేత
విధాత, హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టంచేశారు. తాము చెప్పంది నిజమో కాదో తెలుసుకోవడానికి కర్నాటకలో ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి.. మీకే తెలుస్తుందన్నారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లైనా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. శనివారం తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్… మంత్రి కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
“మీరు కర్ణాటకకు రండి… మేం ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తాం.. తేదీ, సమయం మీరు చెప్పండి.. మిమ్మల్ని బస్సులో తీసుకెళ్లి నిరూపించడానికి మేం సిద్ధం.” అని చెప్పారు. కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. గృహజ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో ప్రతి మహిళకు నెలకు రూ. 2000 అందిస్తున్నామన్నారు. మీ ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, సీఎంగా అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని ఆరోపించారు.
డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఎన్నికల తరువాత కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రతి మహిళకు కాంగ్రెస్ ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామన్నారు. బీజేపీకి బీ టీమ్ లా బీఆరెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు.