వరంగల్ పశ్చిమలో బరిలో రెబల్స్

వరంగల్ పశ్చిమలో బరిలో రెబల్స్

– రసవత్తరంగా మారిన రాజకీయం

– కాంగ్రెస్ నుంచి జంగా రాఘవరెడ్డి

– భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న రాకేష్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచేందుకు సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు పార్టీల నుంచి టికెట్ ఆశించిన నాయకులు ఆ పార్టీలను కాదని పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు పోటీల్లో నిలవడం వల్ల ఆ రెండు పార్టీల అధికార అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రాకేష్ రెడ్డి పోటీ చేస్తారా? లేదా? మరే పార్టీలోనైనా చేరుతారా? వేచి చూడాల్సిన అంశం. తన భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. రాకేష్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా జంగా రాఘవరెడ్డి మాత్రం తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

ఫార్వార్డ్ బ్లాక్ నుంచి రాఘవరెడ్డి

కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన జంగా రాఘవరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. రాఘవరెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకపోయినప్పటికీ బుధవారం తన అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పశ్చిమ బరిలో ఉంటానని ప్రకటించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు కార్యకర్తలు హాజరయ్యారు. తనకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఓడిపోయే అభ్యర్థులను పోటీలో నిలిపిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు అనుకూలమైన రాజేందర్ రెడ్డి కి పశ్చిమలో టికెట్ ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై భూకబ్జాతో పాటు పలు ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు.

బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

బీజేపీ నేత రాకేష్ రెడ్డి

బీజేకీ భవిష్యత్ లేదని ఆ పార్టీలో యువతకు ఆదరణ లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి విమర్శించారు.

సిద్ధాంతాల పేరుతో యువతను బానిసలుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. హన్మకొండ హరిత కాకతీయలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఏనుగుల రాకేశ్ రెడ్డి రాజీనామా చేశారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రావు ప‌ద్మ‌కు టికెట్ ద‌క్క‌డంతో భంగ‌ప‌డిన రాకేష్‌రెడ్డి అధిష్టానంపై ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. ఈనేప‌థ్యంలోనే అభిమానులు, అనుచరుల‌తో చ‌ర్చ‌లు జ రిపారు. వారంద‌రి సూచ‌న‌ల మేర‌కు బీజేపీకి రాకేష్‌రెడ్డి రాజీనామా చేశారు. వరంగల్ వెస్ట్ టికెట్ రాకపోవడంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. పొమ్మన లేక పొగ పెట్టారని ఆవేదన వ్య‌క్తం చేశారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన త‌న‌కు టికెట్ ఇవ్వకపోగా కనీసం పలకరించడంలేదని విచారం వ్య‌క్తం చేశారు. దీంతో మ‌న‌స్థాపం చెంది తన కార్యకర్తలతో కలిసి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాకేష్‌రెడ్డి రాజీనామా పార్టీలో క‌ల‌క‌లంరేప‌గా, జిల్లాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశగా మారింది.