బీఆర్ఎస్‌లోకి ఎర్ర శేఖర్.. గులాబీ కండువా కప్పిన కేటీఆర్

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: జడ్చర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆదివారం బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆయన జడ్చర్ల స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించారు. ఆపార్టీ అధిష్టానం అనిరుధ్ రెడ్డికి రెండో జాబితాలో టికెట్ ఖరారు చేసింది. దీంతో మనస్థాపం చెందిన ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనతో ఆ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉంటాయి. ఆయా స్థానాలు టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పార్టీపై తిరుగుబాట్లు చేస్తున్నారు. కొందరు అదే నియోజకవర్గంలో రెబల్ గా పోటీకి దిగుతుండగా, మరికొందరు నేతలు రాజీనామాల బాట పట్టారు. ఈ క్రమంలోనే జడ్చర్చ టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కారు.