బిడ్డ కోసమే కామారెడ్డి?, కామారెడ్డి ఓటర్లకేం చెపుతారో..!
రాష్ట్ర రాజకీయాలలో సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేయడం రాజకీయంగా చర్చనీయాశంమైంది

- గజ్వేల్‌ను వీడనన్న కేసీఆర్
- సీటు మారే సీఎంకు ఓటేస్తారా?
- కేసీఆర్ కోసమే ఈటల పోటీ
- గజ్వేల్‌లో ముదిరాజ్‌లే కీలకం
- వాటిని చీల్చడమే టార్గెట్!
- కాంగ్రెస్ వర్గాల సందేహాలు
- పరిశీలకుల్లో పసందైన చర్చలు
విధాత, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలలో సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేయడం రాజకీయంగా చర్చనీయాశంమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత నియోజక వర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేయడం.. తన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ నియోజకవర్గానికి తీసుకు రావడం కోసమేనన్న చర్చ ఒక వైపు జరుగుతున్నది. మరో వైపు గజ్వేల్‌లో తనకు అంత అనుకూల పరిస్థితులు లేవని భావించిన కేసీఆర్.. సురక్షితంగా ఉంటుందని కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారన్న చర్చ ఇంకో వైపు జరుగుతోంది. గజ్వేల్‌లో ముదిరాజ్‌ల ఓట్లు అత్యధికంగా ఉన్నాయని, ఈ ఓట్లు సీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు పడితే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే.. ముదిరాజ్ ఓట్లను చీల్చి, కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసేందుకు, తద్వారా పరోక్షంగా కేసీఆర్‌ను కాపాడేందుకు బీజేపీలో పాపులర్ లీడర్ ఈటల రాజేందర్‌తో పోటీ చేయిస్తున్నారనే అనుమానాలను కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేక కారణాలున్నాయట!
రెండు సీట్ల నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్.. రెండింటిలోనూ విజయం సాధిస్తే దేన్ని వదులుకుంటారు? ఏ నియోజక వర్గాన్ని ఉంచుకుంటారన్నది హాట్ టాపిక్‌గా మారింది. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీలో ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాను గజ్వేల్‌ను విడిచిపోనని అక్కడి పార్టీ నాయకులకు అభయం ఇచ్చారు. కామారెడ్డిలో పోటీకి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు. అయితే.. ఎన్నికల్లో రెండింటిలోనూ గెలిస్తే.. ఏదో ఒకటి తప్పక వదులుకోవాల్సి ఉంటుంది. గజ్వేల్‌ను విడిచిపోను అంటున్న కేసీఆర్.. కామారెడ్డిని విడిచిపెడతారా? కామారెడ్డిని విడిచిపెట్టే పక్షంలో అక్కడి ఓట్లడిగే సమయంలో ఏమని చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
గజ్వేల్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్న కారణంతో సీఎం కామారెడ్డి నుంచి పోటీ చేశారని ఒక వాదన ఉంటే.. కామారెడ్డిలో కూడా పోటీ చేసి, అనంతరం గజ్వేల్‌కు పరిమితం కావడం ద్వారా కవితకు అవకాశం ఇస్తారనే చర్చ కూడా ఉన్నది. ఇది ప్రచారంలో గట్టిగా వెళితే.. కామారెడ్డి ప్రజలకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏం చెబుతారో తెలియాల్సి ఉన్నది. గజ్వేల్ సభలో కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయని అన్నారేగానీ.. అవేంటో చెప్పలేదు. ఆ ప్రత్యేక కారణాలు అనివార్య కారణాలైతే.. ముఖ్యమంత్రి కామారెడ్డి స్థానాన్ని దగ్గర పెట్టుకుని.. గజ్వేల్‌కు రాజీనామా చేయాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంత మందితో సభ పెట్టి, అనేక వాగ్దానాలు చేసి, నెలకో రోజు సమావేశం పెట్టుకుందామని చెప్పి, గెలిచిన తర్వాత గజ్వేల్‌ను వదిలి కామారెడ్డిని ఉంచుకుంటే మరి ఇక్కడి పార్టీ శ్రేణులకు ఏం సంకేతాలు వెళతాయి? అన్న చర్చ జరుగుతోంది.
నిర్వాసితుల్లో ఆగ్రహం
గజ్వేల్‌లో అనుకున్నంత సానుకూల వాతావరణం లేదని, దానికి తోడు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం లేదన్న అసంతృప్తి కూడా ఉన్నదని చెబుతున్నారు. ప్రత్యేకించి కొండ పోచమ్మ, మల్లన్నసాగర్ నిర్వాసితుల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నదని అంటున్నారు. ఒకవైపు తమ భూములు పోవటం ఒక ఎత్తయితే, భూమి కోల్పోని వారు చక్కగా పంటలు పండించుకోవడం కూడా వారిలో ఆవేదనకు కారణమవుతున్నదని పేర్కొంటున్నారు. వీరి పునరావాస కార్యక్రమాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల గజ్వేల్ పార్టీ శ్రేణుల విస్తృత సమావేశంలో ప్రస్తావిస్తూ.. నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఈ హామీ నేపథ్యంలో నిర్వాసితులు కేసీఆర్‌కే ఓటేస్తారా? లేక తమ భూములు గుంజుకున్నందుకు వ్యతిరేకంగా స్పందిస్తారా? అన్నది కూడా కీలక అంశమని విశ్లేషకులు చెబుతున్నారు.
ముదిరాజ్ ఫ్యాక్టర్
మరోవైపు ఈటల రంగంలోకి దిగుతున్నారని ముందే సంకేతాలు ఉండటంతో కొందరు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు సీఎం కేసీఆర్‌తో సంప్రదింపుల్లోకి వెళ్లారనే చర్చ సాగింది. గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఈటల సొంత నియోజకవర్గం హుజురాబాద్‌తో పాటు సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నావని హుజూరాబాద్ ఓటర్లు అడిగితే
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించేందుకే పోటీ చేస్తున్నానని ఓటర్లకు చెప్పుకొనే అవకాశం ఉన్నది. కానీ కేసీఆర్ ఏం చెబుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
గజ్వేల్‌లో ఈటల పోటీపై అనుమానాలెన్నో..
గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఈటల పోటీ చేయడం వెనుక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ ఓట్లు కాంగ్రెస్‌కు పడకుండా చీల్చి, కేసీఆర్‌కు మేలు చేయడానికే ఈటల పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య ఒప్పందంలో భాగమంటున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా ఫర్వాలేదు కానీ కాంగ్రెస్ గెలువ కూడదన్న అభిప్రాయంతో బీజేపీ ఉన్నదని గుర్తు చేస్తున్నారు. అందుకే పరోక్షంగా కేసీఆర్ గెలుపు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు.
పరస్పర సహకారం! ‘
‘నన్ను హుజురాబాద్‌లో గెలిపించండి.. నేను గజ్వేల్‌లో గెలిపిస్తా’ అనే ఒప్పందంలో భాగంగానే గజ్వేల్‌లో కూడా ఈటల పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముదిరాజ్‌లు బీఆరెస్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కేసీఆర్‌తోపాటు ఈటలకూ తెలుసని అంటున్నారు. నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముదిరాజ్‌లు బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే.. అక్కడ కాంగ్రెస్ గెలుపు ఆపడం ఎవరి తరం కాదంటున్నారు. దీనిని గమనించిన బీఆరెస్, బీజేపీనేతలు అవగాహనకు వచ్చారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. హుజురాబాద్‌లో ఈటలకు ఎదురు గాలి వీస్తుండటంతో .. పరస్పర అవగాహన మేరకే ఈ డబుల్ పోటీలని వారు తేల్చేస్తున్నారు.