కేసీఆర్ పై ఈటల పోటీ

ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ శాసన సభ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంటోంది. బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈస్థానం నుంచే పోటీకి దిగనున్నారు

కేసీఆర్ పై ఈటల పోటీ

– గజ్వేల్ కు ఈటల అభ్యర్థిత్వం ఖరారు

– మరో 3 స్థానాలకూ టికెట్ల కేటాయింపు

– మెదక్ లో మరో 6 నియోజవర్గాల్లో పెండింగ్

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ శాసన సభ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంటోంది. బీఆరెస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈస్థానం నుంచే పోటీకి దిగనున్నారు. అధికార పార్టీని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఆయా పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి హస్తం గుర్తుపై పోటీకి సై అంటున్నారు. ఈక్రమంలో ఎన్నికల ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. తాజాగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. తొలి జాబితాలోనే గజ్వేల్ అభ్యర్థిగా ఈటల రాజేందర్ కు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది.

దీంతో గజ్వేల్ నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొననుంది. ఈటల రాజేందర్ కు గజ్వేల్ నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు రాజకీయంగా ప్రజల్లో గట్టి పట్టు ఉంది. మొదటగా ఆయనకు ఈ నియోజకవర్గంలోనే ఫౌల్ట్రీ వ్యాపారం ఉండేది. ఆ తర్వాత రాజకీయంగానూ బలపడిన ఈటల… గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ, వ్యాపారపరంగా, మాజీ మంత్రిగా సత్సంబంధాలను మరింత బలపర్చుకున్నారు. బీజేపీ అధిష్టానం సీఎం కేసీఆర్ పై పోటీకి ఈటలను బలమైన నాయకుడిగా ఎంపిక చేసి, బరిలోకి దించనుంది. ఈ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో రసవత్తర పోటీకి రంగం సిద్ధమైంది.

4 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు

ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీజేపీ అధిష్టానవర్గం ఆదివారం విడుదల చేసిన మొదటి జాబితాలో 4 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్, పటాన్ చెరువు – మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, నర్సాపూర్ – మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పేర్లు ప్రకటించారు. మెదక్ నియోజకవర్గం నుండి స్క్రీనింగ్ కమిటీకి 4 పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు నందా రెడ్డి, నందు జనార్ధన్ రెడ్డి, నిజాంపేట్ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు.

మరోవైపు సినీనటి విజయశాంతి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, అసెంబ్లీకి తాను పోటీ చేయనని అధిష్టాన వర్గానికి చెప్పినట్లు సమాచారం. సిద్దిపేటకు దూది శ్రీకాంత్ రెడ్డి, నరోత్తం రెడ్డి పోటీ పడుతున్నారు. జహీరాబాద్ కు ఢిల్లీ వసంత్ పేరు పరిశీలనలో ఉంది. ఆందోల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బాబూమోహన్ కు ఇవ్వనున్నారు. కానీ మొదటి జాబితాలో ఆయన పేరు లేకపోవడం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.