సింగరేణిని ముంచిన ఘనుడు కేసీఆర్: ఈటల

– బీఆరెస్ పాలనలో మూడింతలు కాంట్రాక్టు కార్మికులు
– బూటకపు మాటలతో కాంగ్రెస్ మోసం
– బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఉద్యమ సమయంలో సింగరేణిలో కాంట్రాక్ట్ అనే పదం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. సింగరేణిని నిండా ముంచాడని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి గెలుపునకు ఆయన ప్రచారం చేశారు. భారీ బైక్ ర్యాలీ ద్వారా తెలంగాణ తల్లి విగ్రహం, శిర్కే సెంటర్, రాయల్ టాకీస్, చేపల మార్కెట్, సంగ మల్లయ్య పల్లె, శ్రీరామ్ పూర్ బస్ స్టాండ్ నుండి సీసీసీ కార్నర్ వరకూ కొనసాగింది. అనంతరం సీసీసీ కార్నర్ వద్ద ప్రజలను ఉద్దేశించి ఈటల మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడిన రూ.28 వేల కోట్లు చెల్లించకపోతే సింగరేణి ప్రాంతం నుండి ఈఎన్నికల్లో బాఆర్ఎస్ కు ఒక్క ఓటు కూడా పడకుండా చేస్తామని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థను నిట్టనిలువునా ముంచిన ఘనుడు కేసీఆర్ అని, ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాడని అన్నారు. 60 ఎండ్ల పాలనలో పేదలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా పేదల సంక్షేమం అని భూటకపు మాయమాటలతో మరొకసారి ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఘనత బీజేపీ పార్టీ మోదీకి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం చేశారని, ఏఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అని డ్రామాలు చేస్తున్నదని ఆరోపించారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు తపించే, ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునాథ్ కు ఓటు వేయాలని కోరారు.