హరీశ్ అల్లుడు కాబట్టి బచాయించిండు: ఈటల
హరీశ్‌రావు అల్లుడు కాబట్టి బచాయించాడు.. లేకుంటే కేసీఆర్ పార్టీలో ఉండనిచ్చే వాడు కాదని బీజేపీ గజ్వెల్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు

లేకుంటే కేసీఆర్ పార్టీలో ఉండనిచ్చేవాడు కాదు
బయటివాన్ని కాబట్టి నన్ను నెట్టేసిండు
కేసీఆర్‌పై మండి పడ్డ బీజేపీ గజ్వెల్ అభ్యర్థి ఈటల రాజేందర్
విధాత, మెదక్ ప్రతినిధి: హరీశ్‌రావు అల్లుడు కాబట్టి బచాయించాడు.. లేకుంటే కేసీఆర్ పార్టీలో ఉండనిచ్చే వాడు కాదని బీజేపీ గజ్వెల్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తాను ఆకుటుంబానికి సంబధం లేని బయటి వాన్ని కాబట్టే పార్టీ నుంచి నెట్టి వేశాడని కేసీఆర్‌పై మండి పడ్డారు. శనివారం గజ్వేల్ నియోజకవర్గంలోని చిన్న కిష్టపూర్ లో గోవా ఎమ్మెల్యే దయానంద్, మండల అధ్యక్షుడు శశిధర్ రెడ్డిలతో కలిసి ఈటల రాజేదర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము దొరల కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం కాదు… ఆకలి దుఃఖం తెలిసిన వాళ్ళం… వారు మాటలు మాత్రమే చెప్తున్నారు. మేము చేతల్లో చేసి చూపిస్తామన్నారు. మాటలకు చేతలకు పొంతనలేని వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. దళితబంధు, బీసీబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, మూడు ఎకరాల భూమి, నౌకర్లు, విద్య, వైద్యం ఏది ఇవ్వలేదని తెలిపారు. 10 ఏళ్ల నుండి ఇళ్ళు కట్టడం చేతగాని కేసీఆర్ ఇప్పుడు మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ ఇస్తున్నారట. మూడోతారేఖు అయితే చెల్లని కాగితాలు ఎం చేసుకుందామని ప్రజలను అడిగారు. పంట పొలాలకు కూడా పూర్తిగా నీళ్లు రాలేదని, కాళేశ్వరం నీళ్లు వస్తాయనుకుంటే అది కూడా కుంగిపోయిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న నన్ను పక్కకు పిలుచుకుని బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారన్నారు. పేదలకు కావాల్సినవి అన్నీ చేస్తామని హామీ ఇవ్వమని మోదీ తనకు చెప్పారన్నారు. “బీఆరెస్ వాళ్ళ తాత జాగీరు కాదు. నిజాం సర్కార్ కాదు.రాచరికం అంతకంటే కాదు. ఎంతోమంది సీఎంలు మారారు. అందులో కేసీఆర్ ఒకరు. గజ్వేల్ మన జాగీరు. మన ఓట్లకు పుట్టింది ఎమ్మెల్యే పదవి. గజ్వేల్ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యారు.. సీఎం అయ్యారు.” అని ఈటల అన్నారు.