రామగుండం థర్మల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

- కాలిన పవర్ కేబుళ్లు
- నిలిచిన విద్యుత్తు ఉత్పత్తి
- ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
విధాత ప్రతినిధి, పెద్దపల్లి: రామగుండం పట్టణంలోని జెన్కో 62.5 మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్లాంటులోని ఎ-కోల్ లింక్ ద్వారా బాయిలర్ కు బొగ్గు పౌడర్ సరఫరా జరుగుతుండగా, అధిక వేడిమితో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కింద ఉన్న రిజెక్టు కోల్ అంటుకొని మరింతగా మంటలు వ్యాపించాయి.
దీంతో మిల్లు నుంచి బాయిలర్ కు అనుసంధానమై ఉన్న పవర్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ కేబుళ్లు 30 మీటర్ల మేర కాలిపోయాయి. ముందుజాగ్రత్తగా విద్యుత్తు ఉత్పత్తిని అధికారులు వెంటనే నిలిపివేశారు. ప్లాంటులో ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షిఫ్టు డ్యూటీలో ఉన్న కార్మికులు రిజెక్టు కోలు ఎప్పటికప్పుడు తొలగిస్తారని.. అధిక వేడిమితో మంటలు ఒక్కసారిగా అంటుకొని వ్యాపించినట్లు బీ-ధర్మల్ ఎస్ఈ విజేందర్ తెలిపారు. వారం, పది రోజుల్లో మరమ్మతులు చేపట్టి తిరిగి విద్యుత్తు ఉత్పత్తి చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మంగళవారం ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శుభ్రపరిచే పనులు ప్రారంభించామన్నారు. బాయిలర్, కంట్రోల్ రూమ్ వద్ద కాలిపోయిన కోలి మిల్లులోని బాయిలర్ కేబుళ్లను పరిశీలించి వాటి వద్ద దగ్ధమవుతున్న కేబుళ్లు పునరుద్ధరణ కోసం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సద్దుల బతుకమ్మ పండుగ రోజున అగ్ని ప్రమాదం జరగడంతో పండుగ సంబరాల్లో ఉన్న అధికారులు, కార్మికులు, వారి కుటుంబసభ్యులు, పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు.