కేసు తేలేదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీ బ్రేక్
హైకోర్టులో కేసు తేలేదాకా గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ వాయిదా వేయాలని గవర్నర్ తమిళి సై నిర్ణయించారు

- గవర్నర్ తమిళి సై నిర్ణయం
విధాత : హైకోర్టులో కేసు తేలేదాకా గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ వాయిదా వేయాలని గవర్నర్ తమిళి సై నిర్ణయించారు. గత బీఆరెస్ ప్రభుత్వం హయాంలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి సీఎం కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ తమిళిసై ఆమోదానికి పంపించింది. అయితే వారి పేర్లను గవర్నర్ తిరస్కరించగా, గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ అర్హతను తేల్చేందుకు హైకోర్టు ఈనెల 23వ తేదీకి విచారణ వాయిదా వేసింది. కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని పిటిషనర్ వాదించగా, గవర్నర్ అధికారాలను ప్రశ్నించే అధికారం పిటిషనర్‌కు లేదంటూ గవర్నర్ న్యాయవాది వాదించారు. ఈ నేపధ్యంలో హైకోర్టులో ఈ కేసు విచారణ తేలేంత వరకు ఖాళీగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను భర్తీ చేయరాదని గవర్నర్ నిర్ణయించుకున్నారు. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి ఇప్పటికే కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తాజా నిర్ణయం నిరాశకు గురి చేయగా, దీనిపై ఏలా ముందుకెళ్లాలన్నదానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తుంది.