హరిప్రియకు బీఫాం గండం.. ఇల్లందు బీఆరెస్‌లో పెరుగుతున్న అసమ్మతి

హరిప్రియకు బీఫాం గండం.. ఇల్లందు బీఆరెస్‌లో పెరుగుతున్న అసమ్మతి
  • ఏకమవుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు
  • మూకుమ్మడి రాజీనామాలకు హెచ్చరిక


విధాత ఇల్లందు ప్రతినిధి : ఇల్లందు బీఆరెస్‌లో అసమ్మతి సెగ రోజు రోజుకూ పెరుగుతున్నది. ఎమ్మెల్యే హరిప్రియకు బీ ఫాం ఇవ్వొద్దంటూ పదుల సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఆమెకే బీఫామ్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమని హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం ఆలోచించి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థి మార్పు జరిగితే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల గార్ల, బయ్యారం మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యారు.


షాడో ఎమ్మెల్యే?


ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్‌.. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న అరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కబ్జాలు, దందాలు, బెదిరింపులకు సంబంధించిన కేసులు ఆయనపై ఉన్నాయంటున్న అసమ్మతి వర్గం.. వాటిని చూపుతూ హరిప్రియకు టికెట్ ఇవ్వద్దంటూ డిమాండ్‌ చేస్తున్నది. గార్ల, బయ్యారం మండలాల్లో నిర్వహించిన సదస్సుల్లో స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అసమ్మతిని ప్రకటించారు.


కీలక నేతలు దమ్మలపాటి వెంకటేశ్వరరావు, పులిగండ్ల మాధవరావు తదితరులు వ్యతిరేక వర్గాన్ని ఏకం చేస్తున్నారు. ఇటీవల దాదాపు వందమంది అసమ్మతి నేతలు మంత్రి హరీశ్‌ను కలిసి తమ అసమ్మతిని వ్యక్తం చేశారని సమాచారం. వారితో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత తదితరులు పలుమార్లు చర్చలు జరిపారు.


 



అధిష్ఠానం దృష్టికి?


ఇల్లందు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అధిష్ఠానం దృష్టిసారించినట్టు తెలుస్తున్నది. ఎన్నికల పరిశీలకుడితోపాటు మంత్రులతో చర్చిస్తున్నదని సమాచారం. రెండు, మూడు రోజులలో పరిస్థితి అదుపులోకి రాకపోతే మార్పుపై తీవ్రంగా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని అసమ్మతి వాదులు బహిరంగంగానే చెబుతున్నారు. తన వ్యతిరేకులను ఎమ్మెల్యే భర్త భయపెట్టడం, బెదిరించడం ఆనవాయితీగా వస్తున్నదని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఆరోపిస్తున్నది. కీలకమైన నేతలపై కేసులు పెట్టించి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని అంటున్నారు.


ఉద్యమకారులపై సైతం కేసులు పెట్టించి, నరకయాతన చూపించిన దాఖలాలు ఉన్నాయని చెబుతున్నారు. భూకబ్జాలు, దందాలతోపాటు.. ప్రతి పనిలో కమీషన్‌ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఓసిలో ట్రాన్స్‌పోర్ట్‌ను అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ సొమ్ముతోనే హరిప్రియ ఫౌండేషన్ స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేశారని అంటున్నారు. అసమ్మతి నాయకుల అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటే హరిప్రియకు బీఫాం లభించడం కష్టమేనని అంటున్నారు.