Harish Rao | రాజకీయ విమర్శలు కట్టిపెట్టి కాళేశ్వ‌రాన్ని పున‌ర్ వినియోగంలోకి తీసుకురండి … ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి హిత‌వు ప‌లికిన హ‌రీశ్‌రావు

రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను క‌ట్టిపెట్టి కాళేశ్వ‌రం ప్రాజెక్టును పున‌ర్ వినియోగంలోకి తెచ్చేందుకు శ్రద్ధ పెట్టాల‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు హిత‌వు ప‌లికారు.

Harish Rao | రాజకీయ విమర్శలు కట్టిపెట్టి కాళేశ్వ‌రాన్ని పున‌ర్ వినియోగంలోకి తీసుకురండి … ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి హిత‌వు ప‌లికిన హ‌రీశ్‌రావు

విధాత‌, హైద‌రాబాద్‌:రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను క‌ట్టిపెట్టి కాళేశ్వ‌రం ప్రాజెక్టును పున‌ర్ వినియోగంలోకి తెచ్చేందుకు శ్రద్ధ పెట్టాల‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు హిత‌వు ప‌లికారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై జాతీయ డ్యాం సేఫ్టీ  అథారిటీ సమావేశం ముగిసిన అనంతరం ఢిల్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేలార‌ని, తన అవగాహనా రాహిత్యాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నారని విమ‌ర్శించారు. ఒకవైపు మేడిగడ్డ  పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం అని అంటూనే  మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదని త‌ప్పించుకుంటున్నార‌న్నారు. గత ప్రభుత్వంపై, తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజి పునరుద్దరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ దారుణంగా విఫలమైంద‌న్నారు. వారి నుంచి నివేదికను తెప్పించుకోవడంలో ప్రభుత్వం కూడా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందన్నారు. ఈ వరదల్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేన‌న్నారు. రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందడమే కాగా, బీఆరెస్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం ఇంకా ఎంతకాలం చేస్తారుని ప్ర‌శ్నించారు. వానాకాలం ముగిసే నాటికి ఎన్‌డీఎస్ఏ నుంచి శాశ్వత రక్షణ చర్యలకు సంబందించిన నివేదికను తెప్పించుకోవడం పట్ల శ్రద్ధ వహించాలని ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని కోరారు.