భూవాతావరణం అతివేడి వల్లే … హరికేన్లు
భూవాతావరణం వేడి పెరిగే కొద్దీ హరికేన్ల స్వభావం కూడా మారిపోతున్నది. ఈ సంవత్సరానికి హరికేన్ల సీజను మొదలైంది. ముందస్తు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే ఇటీవలి బెరిల్ తీవ్రత శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

విధాత : భూవాతావరణం వేడి పెరిగే కొద్దీ హరికేన్ల స్వభావం కూడా మారిపోతున్నది. ఈ సంవత్సరానికి హరికేన్ల సీజను మొదలైంది. ముందస్తు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే ఇటీవలి బెరిల్ తీవ్రత శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణ తుపానుగా గంటలకు డెబ్బమైళ్ల వేగంతో మొదలైన బెరిల్ ఇరవై నాలుగు గంటల్లోనే అసాధారణ హరికేన్‌గా గంటలకు 130 మైళ్ల వేగం అందుకుని కల్లోలం సృష్టించింది. బెరిల్ గ్రెనెడైన్ ఐలండ్‌ను గంటకు 150 మైళ్ల వేగంతో తాకింది. హరికేన్ల తీవ్రతను గుర్తించే స్కేలుపై దీనిని అత్యంత విధ్వంసకరమైన 5వ కేటగిరీ హరికేన్‌గా నమోదు చేశారు. అసాధారణ రీతిలో సముద్ర జలాలు వేడెక్కడం వల్ల తుపాన్లు త్వరితగతిన హరికేన్ల రూపం తీసుకుంటున్నాయని అల్బనీలోని న్యూయార్కు స్టేట్ యూనివర్సిటీ వాతావరణ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ బ్రియాన్ టాంగ్ తెలిపారు. శిలాజ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల భూవాతావరణం అత్యంత వేగంగా వేడెక్కుతున్నదని, రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితులను చూడాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.