Balalatha | స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలి: మాజీ అధికారిణి బాలలత డిమాండ్
దివ్యాంగులను ఐఏఎస్ పోస్టులలో పరిగణలోకి తీసుకోరాదంటూ తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను మాజీ అధికారిణి బాలలత తీవ్రంగా ఖండించారు

విధాత, హైదరాబాద్ : దివ్యాంగులను ఐఏఎస్ పోస్టులలో పరిగణలోకి తీసుకోరాదంటూ తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను మాజీ అధికారిణి బాలలత తీవ్రంగా ఖండించారు. సోమవారం బాలలత సోమాజీ గూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడటానికి స్మితా సబర్వాల్‌కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని, అసలు ఫీల్డ్ లో పరిగెత్తుతూ స్మితా సబర్వాల్ ఎంతకాలం పనిచేసిందని ప్రశ్నించారు. వివక్షకు గురవుతున్న దివ్యాంగులను స్మితా సబర్వాల్ మాటలు మరింత కుంగదీశాయని, చట్య వ్యతిరేకంగా ఆమె మాట్లాడారని విమర్శించారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మొదటి అపాయింట్ మెంట్ దివ్యాంగురాలికి ఇచ్చారని గుర్తు చేశారు.
స్మితా తన మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతుందా.. ప్రభుత్వం తరపున మాట్లాడుతుందా అనేది తేల్చాలన్నారు. కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వీసెస్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మితా సబర్వాల్‌పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. స్టీఫిన్ హాకింగ్, సుధా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారని, సూదిని జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటరీయన్‌గా నిలిచారని,అంగవైకల్యంతో పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డులు తీసుకున్నవారు ఉన్నారని గుర్తు చేశారు. మీరు రాజీనామా చేసి రండి.. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దాం. మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామని స్మీతా సభర్వాల్‌కు బాలలత సవాల్ విసిరారు. ఆమె పిజికల్లీ ఫిట్.. మెంటల్లీ అన్‌ఫిట్‌గా ఉందని, కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసి కనీసం అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకరమన్నారు.
24 గంటల్లో స్మితా సబర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నామని, రేపటి లోగా ప్రభుత్వం ఈ అంశం పైన రియాక్ట్ అవ్వకపోతే టాంక్ బండ్ పైన జైపాల్ రెడ్డి స్మృతి వనం వద్ధ నిరసన దీక్ష చేపడుతామని హెచ్చరించారు. స్మితా సభర్వాలపై సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తగిన చర్యలు తీసుకోవాలని బాల లత డిమాండ్ చేశారు. మరోవైపు స్మితా సబర్వాల్.. బాలలత వ్యాఖ్యలపై ట్విటర్ వేదిగా స్పందిస్తూ ఐఏఎస్ మాదిరిగా ఐపీఎస్, ఐఎఫ్‌వో, రక్షణ దళాల్లో కూడా దివ్యాంగులను పరిగణలోకి తీసుకోవడం లేదని, వాటికి ఐఏఎస్ భిన్నం కాదని నా వ్యాఖ్యల కోణంలో ఈ అంశాన్ని కూడా హక్కుల సంఘాలు పరిశీలించాలన్నారు. సున్నితత్వానికి నా మనసులో స్థానం లేదంటూ వ్యాఖ్యానించారు.