నియామకాలు, ధరణి, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు, అవినీతి ఆరోపణలు, ఆత్మగౌరవం వంటి అంశాలే బీఆర్‌ఎస్‌ పార్టీని అధికారానికి దూరం చేసినట్టు స్పష్టమౌతున్నది

విధాత : నియామకాలు, ధరణి, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు, అవినీతి ఆరోపణలు, ఆత్మగౌరవం వంటి అంశాలే బీఆర్‌ఎస్‌ పార్టీని అధికారానికి దూరం చేసినట్టు స్పష్టమౌతున్నది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అధికార విపక్ష పార్టీల మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణల్లోని మూడు అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోలేదని అర్థమౌతున్నది. అవేమిటంటే బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీం, దళిత ముఖ్యమంత్రి, హిందుత్వవాదం. ముందుగా బీఆర్‌ఎస్‌ బీజేపీ ఒక్కటే అన్న విషయాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఆ రెండుపార్టీలను ప్రత్యర్థి పార్టీలుగానే చూశారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఓడించింది బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణరెడ్డి. కామారెడ్డి ప్రజలు కేసీఆర్‌, రేవంత్‌లలో ఎవరు గెలిచినా ఇక్కడ ఉండరని, తిరిగి ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమౌతుందని, అందుకే స్థానిక అభ్యర్థికే పట్టం కట్టారు. అలాగే ఆయన అక్కడ ఓడినా నిత్యం ప్రజల్లోనే వారికి అందుబాటులో ఉండటం కూడా ఒక కారణం. బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావులు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. కాబట్టి కాంగ్రెస్‌ ప్రచారం చేసిన బీఆర్‌ఎస్‌ బీజేపీ బీ టీమ్‌ అన్నవాదనకు ప్రజలు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని అర్థమౌతున్నది. అంతేకాదు కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థిపై సానుభూతి ఉన్నప్పటికీ వారికి ఓటు వేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అంతిమంగా అది అధికారపార్టీకి లాభిస్తుందని ఏకపక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారు.


ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన దళిత సీఎం అంశం కథ కూడా ముగిసినట్టే. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ మా ముఖ్యమంత్రి అని ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ వైపల్యాల ఆధారంగానే ప్రచారం చేసింది కానీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది చెప్పలేదు. మరోముఖ్యమైన విషయం నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి రాకముందే ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. 2014 ఎన్నికల వరకే ఆ అంశం ముగిసిపోయిందన్నారు.


2018లో కేసీఆర్‌ సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తే 2014లో కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక బీజేపీ ఈ ఎన్నికల్లో బీసీలను ఆకట్టుకోవడానికి బీసీ సీఎం అస్త్రాన్ని ప్రయోగించింది. దీనికి ఎంఆర్‌పీఎస్‌ కూడా మద్దతు తెలిపింది. బీఎస్పీ తమ పార్టీ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను అధికారికంగా ప్రకటించింది. దళిత సీఎం అభ్యర్థిత్వం అనేది జాతీయ పార్టీలతోనే సాధ్యం. పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అమరిందర్‌సింగ్‌, సిద్ధుల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో సీఎం ను మార్చి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి ఆ అవకాశం ఇచ్చిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలిచింది అది వేరే విషయం. దీన్నిబట్టి అధికార మార్పు ప్రజలు బలంగా కోరుకున్నప్పుడు కేసీఆర్‌ తర్వాత రేవంత్‌కు, లేదా ఆపార్టీ ఎవరైనా సరే అనే అభిప్రాయాన్నే ప్రజలు వ్యక్తం చేశారు.


బీజేపీ హిందుత్వ వాదం ఉత్తరాది రాష్ట్రాల్లో ఓట్లను రాలుస్తుంది. కానీ దక్షిణాదిలో ఆ మంత్రం పనిచేయదని కర్ణాటక , తెలంగాణ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. గంగా జెమునా తెహజీబ్‌ సంస్కృతికే ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే ఈటల రాజేందర్‌ బీజేపీ సిద్ధాంతాన్ని ఎన్నడూ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించలేదు. అయినా రెండుచోట్లా ఓడిపోయారు. ఇక నిత్యం హిందుత్వవాదం వినిపించే బండి సంజయ్‌ కరీంనగర్‌లో, ధర్మపురి అర్వింద్‌ కోరుట్లలోనూ పనిచేయలేదు. కరీంనగర్‌లో సంజయ్ ఓటమికి కారణంగా చెబుతున్న ముస్లిం ఓట్లు కూడా ఏపక్షంగా బీఆర్‌ఎస్‌కు పడలేదు. కాంగ్రెస్‌ వైపు కూడా ఆ వర్గం ఓట్లు బదిలీ అయ్యాయి.


ఇక బీజేపీ గెలిచిన 8 అసెంబ్లీ స్థానాల్లో హిందుత్వవాదం అన్నది ఒక అంశం మాత్రమే. కానీ అదొక్కటే గెలుపోటములను ప్రభావితం చేయదని ఆ పార్టీ నేతలకూ తెలుసు. ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌లలో మహారాష్ట్ర నుంచి ఇక్కడ స్థిరపడిన వారు, ఉత్తరాది ఓటర్లు, వ్యాపార వర్గాలతోపాటు స్థానిక పరిస్థితులు కూడా వారి గెలుపునకు దోహదపడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాలోని ఆదిలాబాద్‌, ముధోల్‌, నిర్మల్‌, సిర్పూర్‌లలో మెజారిటీ ఎస్సీ, ఎస్టీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేసినట్టు తెలుస్తోంది.


తెలంగాణ ఎన్నికల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకతకు కారణం వారి వ్యవహారశైలి. అందుకే చాలామంది ఓటర్లు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకున్నా స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలనే బలంగా కోరుకున్నారు. ప్రచారంలో ప్రజల నాడిని తెలుసుకోవడానికి వెళ్లిన సర్వే సంస్థల ప్రతినిధులకు ఇదే అనుభవం ఎదురైంది.


అయితే త్రిముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీఆర్‌ఎస్‌కు మేలు జరుగుతుందని ఆశించిన అధికారపార్టీ అభ్యర్థులక కాదు బీజేపీకి కూడా షాక్‌ ఇచ్చేలా ఓటర్లు గంప గుత్తగా కాంగ్రెస్‌ ఓట్లు వేశారు. అందుకే ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated On 7 Dec 2023 11:55 AM GMT
Somu

Somu

Next Story