పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

విధాత: మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గం అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కార్యాలయాలపై ఏకకాలంలో 30 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాదులోని పొంగులేటి నివాసంతో పాటు కుమారుడి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. నందగిరి హిల్స్ లో, జ్యోతి హీల్ రెడ్జ్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి.


రాఘవ కన్ స్ట్రక్షన్ కార్యాలయాలలో, హైదరాబాదులోని పొంగులేటి నివాసంతో పాటు ఆయన స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం లోని నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకే ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు పొంగులేటి సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఇదే రోజు పాలేరులో నామినేషన్ వేసేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఐటి దాడులు నిర్వహించడం పట్ల పొంగులేటి అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి నివాసం వద్దకు భారీగా చేరుకున్న ఆయన అనుచరులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మోడీ , కేసీఆర్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


పొంగులేటి నామినేషన్ అడ్డుకునేందుకు ఐటి దాడులతో కుట్ర చేశారని నిరసనకు దిగారు. అటు పొంగులేటి సైతం తనపై త్వరలో ఐటీ దాడులు జరుగుతాయని నిన్ననే వ్యాఖ్యానించడం ఆ వెంటనే ఐటీ దాడులు కొనసాగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.


ఎన్నికలవేళ ప్రతిపక్ష అభ్యర్థుల పై ఐటి దాడులు కొనసాగడం రాజకీయ కక్షపూరిత చర్యగా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఓటమి భయంతోనే బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ అభ్యర్థులపై ఐటి దాడులు జరిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.