ఇంకో పదేళ్లకు తెలంగాణకు సీఎం అవుతా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

దసరా ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించారు.
సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి.. అవునా..? కాదా..? దీన్ని ఎవరైనా కాదనగలరా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. విజయదశమి నాడు తన మనసులో ఉన్నమాట చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరందరూ కడుపులో పెట్టుకుని కాపాడుకోండి. ఇంకో పదేళ్లకు అయినా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా అని జగ్గారెడ్డి రెండుమూడు సార్లు ప్రకటించారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో నోరు, చేతులు కట్టేశారని లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేకపోయినా తన భార్యతో పాటు అనుచరులు ఉంటారని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడ వాలిపోతానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనపై ఉండాలని జగ్గారెడ్డి కోరారు.