అందుకే రైతుబంధు అనుమతి ఉపసంహరణ
అధికార పార్టీ అత్యుత్సాహం వల్లే రైతుబంధు రైతులకు ఇవ్వాల్సిన అందకుండా పోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయంలో బీఆరెస్ బాధ్యతారహితంగా, స్వార్థపూరితంగా వ్యవహరించిందని మండిపడింది

- బీఆరెస్ బాధ్యతారాహిత్యం వల్లే
- రైతుల పాలిట బీఆరెస్ మరో పాపం
- అన్నదాతలు దీనిని క్షమించబోరు
- ఎక్స్‌లో జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: అధికార పార్టీ అత్యుత్సాహం వల్లే రైతుబంధు రైతులకు ఇవ్వాల్సిన అందకుండా పోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయంలో బీఆరెస్ బాధ్యతారహితంగా, స్వార్థపూరితంగా వ్యవహరించిందని మండిపడింది. రైతుబంధు పంపిణీకి తొలుత అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఈ విషయంలో హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనుమతిని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనికి పాపం మీదంటూ మీదేనంటూ కాంగ్రెస్, బీఆరెస్ ఆరోపించుకుంటున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం వల్లే రైతుబంధు విడుదలకు అనుమతిని రద్దు చేశామని ఎన్నికల సంఘం పేర్కొనడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో ప్రస్తావించారు.
The BRS’ response to the ECI only confirms the fact that Harish Rao’s statements were the sole reason behind the farmers being denied the Rythu Bandhu instalments.
Their flimsy reasoning is not going to fool anyone, and blaming the congress is not going to absolve them either.…
— K C Venugopal (@kcvenugopalmp) November 27, 2023
తెలంగాణను పాలిస్తున్న ‘నలుగురు సభ్యుల ముఠా’ తప్పించి ఎవరూ ఇందుకు కారణం కాదని స్పష్టం చేశారు. వారు అధికార దాహంతో వ్యవహరించడం వల్లే రైతులకు రైతుబంధు అందకుండా పోయిందని విమర్శించారు. రైతు భరోసా కింద ఎకరానికి 15వేలు, కౌలు రైతులకు ఎకరాలకు 15వేలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12వేలు ఇస్తామన్న తమ గ్యారెంటీకి కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఇదే కాకుండా.. రైతులందరికీ రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇదే అంశంలో కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో స్పందిస్తూ.. బీఆరెస్ నేతలు, మంత్రి హరీశ్‌రావు బాధ్యతారాహిత్యంతో, స్వార్థంతో చేసిన పని వల్లే రైతు బంధు అందకుండా పోయిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే హరీశ్‌రావు రైతుబంధుపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆ సొమ్ము రైతుల హక్కు అని, ఏడాది పొడుగునా చేసిన కష్టానికి ప్రతిఫలమని చెప్పారు. వాస్తవానికి ఈ డబ్బును అక్టోబర్-జనవరి మధ్య ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉన్నా.. బీఆరెస్ అత్యుత్సాహం కారణంగా అందలేదన్నారు. బీఆరెస్ మరో పాపానికి పాల్పడిందని, తెలంగాణ రైతులు దీనిని క్షమించబోరని స్పష్టం చేశారు.