తెలంగాణలో మూడోసారి కేసీఆర్ ప్రభుత్వమే: మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణలో మూడోసారి కేసీఆర్ ప్రభుత్వమే: మంత్రి జగదీశ్ రెడ్డి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ ప్రభుత్వమే రాబోతోందని, తెలంగాణకు బీఆర్‌ఎస్సే కరెక్ట్‌ పార్టీ అని, పర్యాయపదం ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి బీఆర్ఎస్ సైనికులు సన్నద్ధం అవ్వాలని పిలుపు నిచ్చారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న శత్రువుల నాటకాలను రాబోయే 36 రోజుల పాటు నిరంతరం ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ సైనికులు తిప్పి కొట్టాలన్నారు. గడ గడపకూ మ్యానిఫెస్టోను చేర్చే బాధ్యత శ్రేణులదే అన్నారు.

కాంగ్రెస్‌ హామీలు నీటిమూటలే అన్న మంత్రి, మ్యానిఫెస్టోను నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత దేశంలో బీఆర్ఎస్ పార్టీది మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు ఉద్యమించి, కేంద్రంతో కొట్లాడి సాధించుకొన్న తెలంగాణను ఈ పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. సాగు, తాగునీరు, మౌలిక వసతులు, సబ్బండ వర్గాల అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, దేశంలోనే మిన్నగా ఐటీ అభివృద్ధి, రైతుల సర్వతోముఖాభివృద్ధి, మహిళాభ్యున్నతి, గ్రామాలు, పట్టణాల అభివృద్ధి… ఇలా ఏ రంగం చూసినా అభివృద్ధిలో ముందుకుపోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు.

ఈ అభివృద్ధి పరుగులు ఆగకుండా ఉండాలంటే.. అందరూ ఆశించిన బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలంటే ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చి, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం ఒక్కటే మార్గం అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నీటిమూటలేనని, వారికి మాటలు తప్ప చేతలు తెలియవని ఎద్దేవా చేశారు. అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ఆరోపించారు. దేశంలోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.