బీజేపీకి లొంగిపోను.. మోదీకి 250 సీట్లు కూడా రావు: కేసీఆర్‌

ప్రధాని మోదీని తాను వ్యతిరేకించినందుకే తన బిడ్డ కవితను జైల్లో పెట్టారని బీఆరెస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు.

బీజేపీకి లొంగిపోను.. మోదీకి 250 సీట్లు కూడా రావు: కేసీఆర్‌

ఎట్టిపరిస్థితుల్లో పోరాటం చేస్తా
మోదీని వ్యతిరేకించినందుకే కవిత అరెస్ట్‌
కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర సర్కార్‌
14 సీట్లు గెలిస్తే అందులో మనమే కీలకం
నా గర్జనతోనే రైతుబంధు వేస్తున్నారు
నిజామాబాద్‌ రోడ్‌ షోలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

నిజామాబాద్‌: ప్రధాని మోదీని తాను వ్యతిరేకించినందుకే తన బిడ్డ కవితను జైల్లో పెట్టారని బీఆరెస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. కానీ తాను భయపడబోనని, రాజీపడబోనని, ఎట్టిపరిస్థితుల్లోనూ పోరాటం చేస్తానే తప్ప ఏనాడు కూడా లొంగిపోలేదని అన్నారు. ఇప్పుడు కూడా లొంగిపోయే ప్ర‌స‌క్తే లేదన్నారు. ఆరు నూరైనా స‌రే లొంగిపోను అని ఉద్ఘాటించారు. సోమవారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షో అనంతరం కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. మోదీకి 250 సీట్లకు మించి రావని, బీఆరెస్‌ ఇక్కడ 14 సీట్లు గెలిస్తే కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందని చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రావని, ప్రాంతీయ ప్రాంతీయ శ‌క్తులు ఏర్పాటు చేసే ప్రభుత్వమే ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యే అవకాశం కూడా ఉన్నదన్నారు. నిజామాబాద్‌ స్థానంలో బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని గెలిపించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచినా ఏకాణ పనికూడా జరగలేదన్నారు. మోదీ ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. స‌బ్ కా సాత్‌.. సబ్‌కా వికాస్ కాలేదని, కానీ.. దేశ్ కా స‌త్య నాశ్ అయిందని మండిపడ్డారు. అచ్చేదిన్ రాలేదు కానీ స‌చ్చేదిన్ వ‌చ్చిందన్నారు.

నా గర్జనతోనే రైతుబంధు

గ‌త ఐదు నెల‌లుగా కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం అర‌చేతిలో వైకుంఠం చూపించిందని, ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదని కేసీఆర్‌ అన్నారు. తాను రథం ఎక్కగానే దెబ్బకు దెయ్యం వదిలిందని, తాను బస్సు ఎక్కి గర్జన చేయడం వల్లే ఇప్పుడు రైతుబంధు డబ్బులు పడుతున్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పిడికిలి బిగిస్తేనే దెయ్యం వదిలి, ముఖ్యమంత్రికి వణుకుడు పుట్టి రైతుబంధు వేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేయించాలంటే బీఆరెస్‌ను గెలిపించాలని కోరారు. యువ‌కులు ఆవేశంలో ఓటు వేయ‌కుండా, ప్ర‌జాస్వామ్య ప‌రిణితితో, విజ్ఞ‌త‌త‌లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.

తెలంగాణ‌లో ఉన్న అంద‌రు ప్ర‌జ‌లు బాగుప‌డాలని, అన్ని వర్గాలు మంచిగా ఉండాలని చెప్పారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనుకూంటు కలిసి బతకాలన్నారు. దాంట్లోనే గొప్పతనం, బలం ఉంటుందని చెప్పారు. కానీ.. ప్ర‌జ‌లను విడ‌దీసే, మ‌త‌విద్వేషాలు రెచ్చ‌గొడితే లాభం ఉండ‌దన్నారు. మోదీ గోదావ‌రిని తీసుకుపోయి త‌మిళ‌నాడుకు ఇస్తా అంటున్నాడు. యుద్ధం చేద్దామా..? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. గోదావ‌రి న‌ది మీద నీళ్ల హ‌క్కు మ‌న‌కు ఉండాలని, అందుకు నిజామాబాద్ పులి బిడ్డ బాజిరెడ్డి గెల‌వాలని చెప్పారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీ ద‌గ్గ‌ర చేతుల క‌ట్టుకుంటారని, మ‌న హ‌క్కుల కోసం నోరు మెద‌ప‌రు అని కేసీఆర్ దుయ్య‌బ‌ట్టారు.