రాజకీయ దురుద్దేశంతోనే నివేదిక: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ దురుద్దేశంతోనే డ్యామ్ సేఫ్టీ విచారణ కమిటీ నివేదిక ఇచ్చిందని రాష్ట్ర మంత్రి, బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేంద్రానికి నివేదికలు ఇచ్చే కేంద్ర జల సంఘం ఆమోదంతోనే తాము కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని ఒక ఆంగ్ల చానల్‌కు చెప్పారు. ఎన్నికల సమయంలో నివేదిక బయటకు పెట్టడంలో ఉద్దేశాన్ని ఆయన ప్రశ్నించారు. దేశంలో కాళేశ్వరం సహా ప్రతి ఒక్క ప్రాజెక్టును సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్మాతే నిర్మిస్తారని ఆయన గుర్తు చేశారు.
కాశేళ్వరం ప్రాజెక్టును అద్భుతమైన కట్టడంగా సీడబ్ల్యూసీ బృందం గతంలో అభివర్ణించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అమెరికాలో అవార్డు కూడా వచ్చిందని తెలిపారు. రిపోర్టులో ఏమున్నదో తనకు తెలియదని, కానీ.. తెలంగాణను దేశానికే ధాన్యాగారంగా మార్చుతున్న ప్రాజెక్టును సీడబ్ల్యూసీ ఇప్పుడు తప్పుపడుతున్నదంటే.. దాని ఉద్దేశాన్ని, నివేదిక విడుదల చేసిన సమయాన్ని తాము ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.