ఐటీ హబ్ కావాలా.. పేకాట క్లబ్ కావాలా?
ఐటీ హబ్ కావాలంటే కారు గుర్తుకు ఓటు, పేకాట క్లబ్ కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయడమో ప్రజలే నిర్ణయించుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

– కారు గుర్తు కావాలా.. బేకర్ గాళ్ళు కావాలా?
– 24 గంటలు ఉచిత కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా?
– బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్
– కారుణ్య నియామకాలతో కార్మికుల వారసులకు ఉద్యోగాలు
– రైతు బంధు కావాలా..రాబందుల కాంగ్రెస్ కావాలా?
– జన్నారం ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్
– మంచిర్యాల జిల్లాలో రోడ్ షో
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఐటీ హబ్ కావాలంటే కారు గుర్తుకు ఓటు, పేకాట క్లబ్ కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయడమో ప్రజలే నిర్ణయించుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మంచిర్యాల అభివృద్ధి కోసం దివాకర్ రావు మంచిర్యాల జిల్లాకు ఐటీ హబ్ కావాలని కోరినట్లు తెలిపారు. శుక్రవారం మంచిర్యాల లో మంత్రి కేటీఆర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్, శ్రీనివాస టాకీస్, ముఖరామ్ చౌరస్తా, అర్చనా టెక్స్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ మీదుగా బెల్లంపల్లి చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున మంచిర్యాల జిల్లా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేశామని, ఇవాళ ఇక్కడ జిల్లాస్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని, రైతుబంధు, రైతు బీమా లాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. సింగరేణిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి కార్మికులకు బాసటగా నిలిచామన్నారు. 32 శాతం బోనస్ ఇచ్చి కార్మికులను ప్రయోజనం చేకూర్చామని తెలిపారు. దీపావళి, దసరా కలుపుకొని కార్మికులకు రూ.1000 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. కార్మికుల కొడుకులకు కారుణ్య నియామకాల పేరుతో వేలాది ఉద్యోగాలు కల్పించామన్నారు.
కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం గోస
కాంగ్రెస్ హయాంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు, సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడ్డామని కేటీఆర్ అన్నారు. మళ్లీ ఆ కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ వాళ్ళు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి కనబడుటలేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి, మీ ప్రేమ సాగర రావు కలిసి మంచిర్యాల ఏ గల్లీలోనైనా కరెంటు తీగ పట్టుకోండి.. కరెంటు ఉందో, లేదో తెలుస్తుంది. తెలంగాణకు పట్టిన దరిద్రం కూడా పోతుంది’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం అనేక గోసలు పడ్డారని, రాత్రిపూట ఖండిస్తే రైతులు పాములు కుట్టి చనిపోయారని పేర్కొన్నారు. మంచిర్యాల కరకట్ట నిర్మాణం కోసం దివాకర్ రావు అడిగారని, గోదావరి ఉధృతంగా ప్రవహించేటప్పుడు పట్టణంలోకి నీరు రాకుండా కరకట్ట నిర్మాణానికి హామీ ఇచ్చారు.
ఖానాపూర్ ను దత్తత తీసుకుంటా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నా నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తానో అలాగే ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వరుసలు కలుపుకొని వచ్చినప్పుడు కూడా అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు చేతనైత లేదా? ఇక్కడున్న నాయకులు బీఆర్ఎస్ ను ఎదుర్కొనలేక ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, అమిత్ షా లను పిలిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మీకు ఢిల్లీ పాలకులు కావాలా? తెలంగాణ సీఎం కేసీఆర్ కావాలా? అని ప్రశ్నించారు. కుట్టి రిజర్వాయర్, కడెం ప్రాజెక్టు గేట్లు పెంపు కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల అభ్యర్థి దివాకర్ రావు, ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు.