ప్రజలతో మాకు గ్యాప్ వచ్చింది ,మా వైఖరిని మార్చుకోవాలి … బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ ప్రజలతో బీఆరెస్‌కు గ్యాప్ ఏర్పడిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు అంగీకరించారు. తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

మా ఓటమికి ప్రజలది తప్పు అనడం తప్పే అవుతుంది
ఏపీలో జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించింది
పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా
హైదరాబాద్: తెలంగాణ ప్రజలతో బీఆరెస్‌కు గ్యాప్ ఏర్పడిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు అంగీకరించారు. తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బీఆరెస్ ఓటమిలో ప్రజలది తప్పు అనడం అంటే తమదే తప్పవుతుందని అన్నారు. అదే సమయంలో టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చడం వల్లే ఓడిపోయామనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అన్ని సీట్లు గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేదని అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసినా ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. అయినా 40 శాతం ఓట్లు వైసీపీ సాధించడం మామూలు విషయం కాదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి ఓడిపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను ఒక వస్తువులా వాడుకున్నారని, అంతకు మించి షర్మిలకు అక్కడ ఏమీ లేదని చెప్పారు. బీఆరెస్‌కు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని కేటీఆర్ అన్నారు. ఆత్మ విశ్వాసానికి, అహంకారానికి వారికి తేడా తెలియడం లేదని చెప్పారు. అభివృద్ధిలో తమతో పోటీ పడలేనివారే మాకు అహంకారం అంటూ ప్రచారం చేశారని విమర్శించారు.
ఫిరాయింపుల వల్ల మాకు లాభం జరగలేదు
గత బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఫిరాయింపుల వల్ల తమకు ఒనగూరింది ఏమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. తమ పార్టీలో చేరినవారిలో పది మంది ఓడిపోయారని గుర్తు చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బి.ఆర్ ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పాలన పై పట్టు రాలేదని, పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. అధికారులు మా చేతుల్లో ఉన్నారంటే అది వారి చేతగానితనమేనని అన్నారు.
గ్రామాల్లో పరిశుభ్రత కరువైందని,ప్రజలు డెంగ్యూ, మలేరియా భారిన పడుతున్నారని తెలిపారు.