కాళేశ్వరంతో తెలంగాణ దివాళా: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్

కాళేశ్వరంతో తెలంగాణ దివాళా: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఆర్ధికంగా దివాళా తీసి అప్పులపాలైందని, ప్రజాధనం కమిషన్ల రూపంలో కేసీఆర్‌ కుటుంబం పాలైందని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చౌహాన్‌ విమర్శించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరితో కలిసి విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఏం లాగా ఉపయోగపడుతోందన్నారు. కాంగ్రెస్‌ మొదలుపెట్టిన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టును కమిషన్ల కోసమే కేసీఆర్‌ కాళేశ్వరం పేరిట రీడిజైన్‌ చేసి అంచనాలను పెంచారన్నారు.


రాహుల్ కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన తర్వాత అనేక నిజాలు బయటపడుతున్నాయన్నారు. కాళేశ్వరం పేరు చెప్పుకొని బీఆర్ఎస్ ఓట్లు దండుకుందని, ప్రాజెక్టు డిజైన్లో లోపాలు ఉన్నాయని చౌహాన్‌ ఆరోపించారు. డీజైన్‌ లోపంతో ప్రాజెక్టు నిర్వాహణ కూడా ఆర్ధిక భారంగా తయారవుతుందన్నారు. కాళేశ్వరం పై విమర్శలు చేస్తున్న బీజేపీ ఎలాంటి విచారణ చేయడం లేదని, ప్రాజెక్టు కోసం వృధా చేసిన సొమ్ము తెలంగాణ ప్రజలపై అప్పుగా మారిందన్నారు. రైతుల కోసం నీళ్ళు ఇవ్వడానికే ప్రాజెక్టులని చెబుతూ అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.

కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి : రేణుకా చౌదరి

కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ లోప భూయిష్టంగా చేసి నిర్మించిన సీఎం కేసీఆర్‌ తప్పు ఒప్పుకుని చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం వల్ల బంగారం తెలంగాణ కాలేదని, అయితే బంగారమంంతా కేసీఆర్ ఫామిలీ ఇంటికి చేరిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు నాసిరకంగా నిర్మిస్తుంటే క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదన్నారు. ప్రాజెక్టు పేరుతో బీఆరెస్‌ ప్రభుత్వం ప్రతి మనిషిపై లక్ష కు పైగా అప్పుల భారం మోపిందన్నారు.


దొంగ విత్తనాల మూలంగా 8వేల మంది రైతు కుటుంబాలు నాశనం ఐతే కేసీఆర్ నోరు మెదుపలేదని, కౌలు రైతులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని పక్కన పెట్టి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేశాడన్నారు. కేజీ టూ పీజీ అమలు కాలేదని, కొత్తగా ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ల పేరుతో పేదలకు ఇళ్లు లేకుండా చేశరాన్నారు. పథకాలు బీఆరెస్‌ పార్టీకే పరిమితమయ్యాయని విమర్శించారు. ధరణి పోర్టల్ తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా.? అని ప్రశ్నించారు. ధరణితో సామాన్యుడికి, రైతులకు మేలు జరుగలేదన్నారు. పంటకు ధర అడిగితే, భూములకు పరిహారం కోరితే రైతులకు బేడీలు, జైలు శిక్షల పాలు చేశారన్నారు. మీ పార్టీ నేతలు చేసిన దోపిడీ ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.